ETV Bharat / state

పరమ పవిత్రం వైకుంఠ పర్వదినం.. ఉత్తర ద్వార దర్శనం... సర్వదా శుభదాయకం

author img

By

Published : Jan 2, 2023, 2:17 PM IST

vaikunta ekadasi in telangana
vaikunta ekadasi in telangana

vaikunta ekadasi in telangana : పరమ పవిత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినం. వైకుంఠ ద్వార దర్శనం... సర్వదా శుభదాయకం. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. నెలకు రెండు చొప్పున 24 ఏకాదశులు ఉన్నా... అత్యంత ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశే. ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటారు. అందుకే ఈ పర్వదినాన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు మహా విష్ణువు గరుడ వాహనం అధిరోహించి మూడుకోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి..భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం. ఇంతటి ప్రాశస్త్యమున్న వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ ఆలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. వేకువజామునుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు...ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.

vaikunta ekadasi in telangana : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. యాదాద్రిలో లక్ష్మీ సమేత నారసింహుడు.. భక్తులకు ఉత్తర ద్వార దర్శనమిచ్చాడు. ఆలయ పునర్నిర్మాణం లో భాగంగా నలుదిక్కుల గోపురాలు నిర్మించడంతో ఆలయ చరిత్రలో తొలిసారి స్వామి వారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల నరసింహ నామస్మరణతో ఆలయ తిరువీధులు మార్మోగుతున్నాయి. మంత్రులు జగదీశ్ రెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యే గొంగిడి సునిత, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఉన్నతాధికారులు స్వామివారిని ఉత్తరద్వారం ద్వారా దర్శించుకున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మేళ్లచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయానికి వేకువజామునుంచే భారీగా తరలివచ్చిన భక్తులు..స్వామివారిని దర్శించుకున్నారు.

vaikunta ekadasi in Bhadradri : భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. రామయ్యను ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రామనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఉత్తర ద్వారం తలుపులు తెరవడంతో భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయత్వానికి లోనయ్యారు.

vaikunta ekadasi in Kaleshwaram : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామాలయం, మందరగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వేకువజామునుంచే భక్తులు తరలివచ్చారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, పూజల అనంతరం ఆలయ అర్చకులు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు.

మహదేవపూర్ లోని మందరగిరి స్వయం భూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కనుల పండువగా జరిగాయి. మూలవిరట్టుకు పంచామృత అభిషేకం, విశేష పూజలు చేశారు. వరంగల్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బట్టల బజార్లోని శ్రీ బాలానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. హనుమకొండ జిల్లా పరకాల పరిధిలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వైష్ణవ ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు దేవుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఆలయాలు వైకుంఠ శోభను సంతరించుకున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో వైకుంఠ ఏకాదశి ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. యోగ, ఉగ్ర నరసింహ స్వామి, వెంకటేశ్వర స్వామి మూలవిరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశి వేళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

సిద్ధిపేటలోని శ్రీవేంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న మంత్రి హరీశ్‌రావు...స్వామికి స్వర్ణ కిరీటాన్ని ధారణ చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంగారెడ్డి లొని శ్రీ వైకుంఠపురంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయమే ఆలయానికి తరలివచ్చిన భక్తులు...ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. జహీరాబాద్ మహీంద్రా కాలనీలోని వెంకటేశ్వరుడు... ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు అభయమిచ్చారు.

వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలన్నీ గోవింద నామస్మరణతో మార్మోగాయి. జిల్లాలోని ప్రముఖమైన మన్యంకొండ, కురుమూర్తి, సింహగిరి నరసింహస్వామి దేవాలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. మల్దకల్ ఆది శిలాక్షేత్రం అపర తిరుపతిగా శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంగా విరాజిల్లుతోంది.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోని బాలాజీ మందిరంలో వేకువజామునే పండితులు వెంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వారం గుండా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారాన్ని తెరవగా భక్తులు దర్శించుకుని పులకించారు.

వైకుంఠ ఏకాదశి వేళ హైదరాబాద్‌లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వనస్థలిపురం వెంకటేశ్వర స్వామిని భక్తులు భారీగా దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయ క్యూ లైన్లలోకి చేరుకున్న భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుని గోవింద నామ స్మరణ చేసుకున్నారు.

సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లి స్వర్ణధామ నగర్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వేకువజామునుంచే పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారి అలంకరణ పల్లకి సేవ కార్యక్రమాలు భక్తుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.