ETV Bharat / state

రాష్ట్రంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

author img

By

Published : Dec 25, 2020, 12:36 PM IST

Updated : Dec 25, 2020, 1:46 PM IST

vaikunta-ekadasi-celebrations-in-all-temples-in-telangana
రాష్ట్రంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ముక్కోటి ఏకాదశి వేడుకలతో రాష్ట్రంలోని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పలు దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువ జామునుంచే ఆలయాల వద్ద భారీగా బారులు తీరారు. ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వార దర్శనాలతో ఆలయాలు కళకళలాడుతున్నాయి.

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని రాష్ట్రంలోని పలు ఆలయాలు శోభాయామానంగా తయారయ్యాయి. ప్రముఖ ఆలయాల్లో ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు వేకువ జామునుంచే భక్తులు పోటెత్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

vaikunta-ekadasi-celebrations-in-all-temples-in-telangana
రాష్ట్రంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

రామయ్య సన్నిధిలో ముక్కోటి ఏకాదశి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములు బంగారు కవచాలతో స్వర్ణలంకృతలుగా దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

యాదాద్రిలో ఘనంగా వేడుకలు

యాదాద్రి పాతగుట్టలో నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై భక్తులకు వైకుంఠ ద్వార దర్శనమిస్తున్నారు. యాదాద్రిలో ఉదయం 6:43 నుంచి ఉదయం 9:30 గంటల వరకు... పాతగుట్టలో ఉదయం 10 గంటల వరకు దాదాపు 3 గంటల పాటు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. బాలాలయానికి ఉత్తర ద్వారం లేకపోవడంతో తూర్పు ద్వారం గుండా స్వామివారు దర్శనమిస్తున్నారు. నరసింహ నామస్మరణతో ఆలయ వీధులు మార్మోగుతున్నాయి.

vaikunta-ekadasi-celebrations-in-all-temples-in-telangana
రాష్ట్రంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

రాజన్నకు ప్రత్యేక పూజలు

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం వేకువ జామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే రాజన్నకి మంగళ వాయిద్యాలు, సుప్రభాతం, పల్లకి సేవ తదితర పూజలు నిర్వహించారు. స్వామివారిని అంబారి సేవపై ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం వైకుంఠ ఏకాదశి విశిష్టతను అర్చకులు వివరించారు.

vaikunta-ekadasi-celebrations-in-all-temples-in-telangana
రాష్ట్రంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ధర్మపురిలో ముక్కోటి ఏకాదశి

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం ముందట లక్ష్మీనరసింహస్వామికి పుష్ప వేదికపై వేద ఘోష నిర్వహించారు. ఉత్తరద్వారం గుండా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. పంచముఖ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 3 గంటలకు స్వామివారికి అభిషేకాలు, ఆరే పత్రాలతో లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు.

కాళేశ్వరంలో వైకుంఠ ఏకాదశి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ రామాలయంలో తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు చేసి, 4.45 గంటలకు ఆలయ అర్చకులు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. శ్రీ సీతారమ చంద్ర స్వామి వారికి పంచహరతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

మహదేవపూర్​లోని మందరగిరి స్వయం భూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు చేశారు. ఉదయం 4గంటల నుంచి ఉత్తర ద్వారా దర్శనం కల్పించారు.

హిమయత్ నగర్​లో కేంద్రమంత్రి ప్రత్యేక పూజలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా హిమాయత్ నగర్​లోని వేంకటేశ్వర స్వామిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సతీసమేతంగా ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు కిషన్ రెడ్డి దంపతులకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు.

వెంకటేశ్వర స్వామి ఆలయంలో తలసాని

ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని మోండా మార్కెట్​లోని పెరుమాళ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హుజూరాబాద్​లో మంత్రి ఈటల

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో మంత్రి ఈటల రాజేందర్‌ పర్యటించారు. ఇల్లందకుంటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొన్నారు. స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. జమ్మికుంటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.

vaikunta-ekadasi-celebrations-in-all-temples-in-telangana
రాష్ట్రంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

వరంగల్​లో...

ముక్కోటి ఏకాదశి సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ తెల్లవారుజామున నుంచే ఆలయానికి బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామి వారిని ఉత్తర ముఖద్వారం నుంచి భక్తులు దర్శించుకున్నారు. హన్మకొండలోని శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

పాలమారు తిరుపతిలో...

ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని మహబూబ్ నగర్​ జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలమూరు తిరుపతిగా ప్రసిద్ధి చెంశ్రీ మన్యంకొండ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. దేవరకద్రలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామి వారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

ఆదిలాబాద్​లో వైకుంఠ ఏకాదశి

ఆదిలాబాద్‌ పట్టణంలోని బాలాజీ మందిరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. వేకువజామునే పండితులు వెంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో శాస్త్రోక్తంగా ఉత్తర ద్వారాన్ని తెరిచారు. వేకువజాము నుంచే స్వామి వారిని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

ఇదీ చదవండి: వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి?

Last Updated :Dec 25, 2020, 1:46 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.