ETV Bharat / state

ఓటమితో మొదలెట్టి - ఆపై గెలుపు బండెక్కి, ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోని నేతలెవరో తెలుసా?

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2023, 12:18 PM IST

Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023

Undefeated Leaders in Telangana : రాజకీయాల్లో జయాపజయాలు సర్వసాధారణం అని చెప్పవచ్చు. అదేవిధంగా కొందరు నేతలు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓటమి చెందినా.. తిరిగి పుంజుకొని అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయాబావుటా ఎగురవేస్తుంటారు. అలా తొలిసారి ఓటమిని మూటగట్టుకుని.. ఆ తర్వాత దూసుకెళ్తున్న వారెవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Undefeated Leaders in Telangana : రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ కొందరు నాయకులకు మొదటిసారి చేదు ఫలితం దక్కి.. ఆ తర్వాత తీపిగా మారింది. వరుస విజయాలతో తమ పార్టీల్లో అంచెలంచెలుగా ఎదిగారు. రాజకీయంగానూ ముఖ్య పదవులను సాధించారు. తెలంగాణలోని పలువురు నేతలు ఓటమితో తమ రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టిన వారే. వారిలో..

అసంతృప్తులపై పార్టీల బుజ్జగింపు మంత్రం, ప్రచారం కీలకదశకు చేరడంతో ఆపద మొక్కులు

కేసీఆర్‌ : బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ (KCR) ఎన్నికల్లో తొలిసారి 1983లో పోటీ చేశారు. అప్పుడు టీడీపీ అభ్యర్థిగా సిద్దిపేట నుంచి పోటీ చేసి అనంతుల మదన్‌మోహన్‌ చేతిలో కేవలం 877 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే.. పరాజయం మొదటి మెట్టుకే పరిమితమైంది. సిద్దిపేటలోనే 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి వరుస విజయాలు సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా బీఆర్ఎస్‌ను (టీఆర్ఎస్‌) ప్రారంభించిన కేసీఆర్‌.. ఆ పార్టీ అభ్యర్థిగా 2001 ఉప ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు.

కేసీఆర్ 2004లో సిద్దిపేట నుంచి అసెంబ్లీకి, కరీంనగర్‌ ఎంపీ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రి కూడా అయ్యారు. 2006, 2008 ఉప ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి ఎంపీగా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టారు. 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా గెలిచారు. 2014, 2018 ఎన్నికల్లో గజ్వేల్‌ అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించి, రెండుసార్లు సీఎం పీఠాన్ని అధిష్ఠించారు.

ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి : కోదాడ నుంచి 1994లో తొలిసారి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy).. టీడీపీ అభ్యర్థి వేనేపల్లి చందర్‌రావు చేతిలో ఓడిపోయారు. అనంతరం జరిగిన 1999, 2004 ఎన్నికల్లో వేనేపల్లి చందర్‌రావుపైనే.. ఉత్తమ్​కుమార్‌ రెడ్డి వరుసగా గెలుపొందారు. ఆ తర్వాత హుజూర్‌నగర్‌కు మారిపోయారు. 2009లో బీఆర్ఎస్‌ (టీఆర్ఎస్‌) నుంచి పోటీ చేసిన ప్రస్తుత మంత్రి జగదీశ్‌రెడ్డిపై విజయం సాధించారు.

2014, 2018లో హుజూర్‌నగర్‌ స్థానం నుంచి మరో రెండుసార్లు విజయం సాధించారు. 2019లో నల్గొండ ఎంపీ స్థానంలో గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. 2015 నుంచి 2021 వరకు ఆరు సంవత్సరాల పాటు పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు.

ఓటే నీ ఆయుధం- విడవకు నీ బ్రహ్మాస్త్రం

కిషన్‌రెడ్డి : కార్యకర్త స్థాయి నుంచి బీజేపీ ప్రస్థానం ప్రారంభించిన కిషన్‌రెడ్డి (Kishan Reddy).. ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ, కేంద్ర కేబినెట్‌ మంత్రి వరకు అంచెలంచెలుగా ఎదిగారు. 1994లో కార్వాన్‌ నుంచి పోటీ చేసిన కిషన్‌రెడ్డి.. మజ్లిస్‌ అభ్యర్థి సయ్యద్‌ సజ్జద్‌ చేతిలో ఓటమిపాలై రెండోస్థానంలో నిలిచారు. ఆ తర్వాత హిమాయత్‌నగర్‌, అంబర్‌పేట స్థానాల నుంచి 2004, 2009, 2014లో వరుస విజయాలతో హ్యాట్రిక్‌ కొట్టారు.

కిషన్‌రెడ్డి 2018 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్‌ (టీఆర్ఎస్‌) అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌ చేతిలో ఓటమిపాలైనా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి ఎంపీ అయ్యారు. ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రెండుసార్లు పని చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పార్టీ తొలి అధ్యక్షునిగా పనిచేసిన కిషన్‌రెడ్డి.. ఇటీవల మరోసారి తెలంగాణ పార్టీ సారథ్యం స్వీకరించారు.

కొప్పుల ఈశ్వర్‌ : 1994 అసెంబ్లీ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్‌ (Koppula Eshwar) .. స్వతంత్ర అభ్యర్థి మాలెం మల్లేశం చేతిలో ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్‌ (టీఆర్ఎస్‌) ఆవిర్భావ సమయంలో ఆ పార్టీలో చేరారు. 2004లో మేడారం బీఆర్ఎస్‌ (టీఆర్ఎస్‌) అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009 నుంచి ధర్మపురిలో పోటీ చేస్తున్నారు. 2009, 2014, 2018 సాధారణ ఎన్నికల్లో మధ్యలో 2010 ఉప ఎన్నికల్లో వరుసగా జయకేతనం ఎగరేశారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో చీఫ్‌ విప్‌గా, మంత్రిగా కొప్పుల ఈశ్వర్‌ పని చేశారు.

హైదరాబాద్‌పై ఈసారి పట్టు ఎవరిదో? సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రధాన పార్టీలు

జగదీశ్‌రెడ్డి : బీఆర్ఎస్‌ (టీఆర్ఎస్‌) ఆవిర్భావం నుంచి ఉన్న జగదీశ్‌రెడ్డి (Jagdish Reddy) 2009లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు. సొంత నియోజకవర్గం తుంగతుర్తి ఎస్సీ రిజర్వుడు కావడంతో హుజూర్‌నగర్‌ను ఎంచుకున్నారు. అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం నియోజకవర్గం మారి.. సూర్యాపేటకు వచ్చారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా గెలిచి రెండుసార్లు మంత్రి పదవుల్ని పొందారు.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల పాటలు

ఓ వైపు నామినేషన్ ప్రక్రియ జోరు మరోవైపు పార్టీల ప్రచార హోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.