ETV Bharat / state

ts rtc sabharimala spl service: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పిన టీఎస్​ ఆర్టీసీ.. ఐదుగురుకి ఫ్రీ

author img

By

Published : Nov 28, 2021, 8:00 PM IST

tsrtc special service
tsrtc special service

నష్టాల్లో ఉన్న టీఎస్​ ఆర్టీసీ.. ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అన్ని విధాల ప్రయత్నిస్తోంది. నిన్న మొన్నటి వరకు పెళ్లిళ్లకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన ఆర్టీసీ తాజాగా అయ్యప్ప స్వాముల శబరిమల యాత్రపై దృష్టి పెట్టింది. భక్తుల సౌకర్యార్థం శబరిమలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది (ts rtc sabharimala spl service). ఇక్కడ కూడా ఓ బంపర్​ ఆఫర్​ ఇచ్చింది. ప్రత్యేక బస్సులు అద్దెకు తీసుకున్న వారిలో ఐదుగురికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ నిర్ణయించింది.

ts rtc sabharimala spl service : ప్రయాణీకుల అవసరాలే ఆర్టీసీకి ఆదాయ వనరు. ఈసూత్రాన్ని అన్ని విధాల అమలు చేస్తోంది తెలంగాణ ఆర్టీసీ .. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రయాణీకుల మన్ననలతో పాటు ఆదాయాన్ని పెంచుకుంటోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు అధికారులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు ఆఫర్లు తీసుకొచ్చి ప్రజలకు చేరువవుతున్న టీఎస్​ ఆర్టీసీ... తాజాగా శబరిమల భక్తుల యాత్రపై దృష్టి పెట్టింది. తెలంగాణ ఆర్టీసీ.. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించింది.

కార్తికమాసం వచ్చిందంటే అయ్యప్ప భక్తుల యాత్రలు మొదవుతాయి. రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో స్వామిమాలధారులు శబరిమలకు వెళ్తుంటారు. ఎక్కువ మంది ప్రైవేటు వాహనాలనే ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ అవకాశాన్ని ఈసారి ఆర్టీసీ వినియోగించుకోవాలనుకుంటోంది. శబరిమలకు ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అంతే కాకుండా ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.

ఐదుగురికి ఫ్రీ

శబరిమలకి వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్‌ చేసుకుంటే అదే బస్సులో మరో ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. ఈ మేరకు వరంగల్‌ 1 డిపో తరఫున ట్విట్టర్‌లో ప్రచారం కూడా మొదలు పెట్టారు. శబరికి బుక్‌ చేసుకున్న బస్సులో అయ్యప్ప భక్తులతో పాటు ఇద్దరు వంట మనుషులు, ఒక అటెండర్‌, పదేళ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆ‍ర్టీసీ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా మూడు ఫుల్‌ టిక్కెట్లు, రెండు హాఫ్‌ టిక్కెట్లకు ఎటువంటి రుసుము వసూలు చేయడంలేదని ఆర్టీసీ వెల్లడించింది. అయితే వారికి ప్రత్యేకంగా సీట్లు కేటాయించరు. బస్సులో ఖాళీగా ఉన్న స్థలంలో వారు కూర్చోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. సాధారణంగా అద్దెకు ఇచ్చే బస్సుల్లో ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర ఫుల్​ టికెట్​ ఛార్జీ వసూలు చేస్తారు. కానీ.. ఆర్టీసీలో ఈసారి ఐదుగురికి ఉచితంగా పంపించాలని నిర్ణయించారు.

ఛార్జీలు ఇలా ఉన్నాయి...

  • శబరిమలకు 36 సీట్లు ఉన్న సూపర్ లగ్జరీ బస్సులకు కిలోమీటర్ రూ.48.96
  • 40 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటర్​కు రూ.47.20
  • 48 సీట్లు ఉన్న డీలక్స్ బస్సులకు కిలోమీటర్ కు రూ.56.64
  • 49 సీట్లు ఉన్న ఎక్స్ ప్రెస్ బస్ లకు కిలోమీటర్ కు రూ.52.43లు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆర్టీసీ పేర్కొంది.

లేపాక్షికి ప్రత్యేక సర్వీసు

వారాంతాల్లో విహార యాత్రకు వెళ్లేవారికి ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్​ చెల్లించకుండా ఆర్టీసీ బస్సును బుక్​ చేసుకునే అవకాశం కల్పించింది టీఎస్​ ఆర్టీసీ. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి లేపాక్షి టూర్​కు వెళ్లేందుకు బస్సులు బుక్​ చేసుకునే సౌకర్యం కల్పించింది.

శుభకార్యాలకు ప్రత్యేక గిఫ్ట్​లు

పెళ్లిళ్ల సీజన్​ సమయంలో ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాన్ని అమలుచేసింది. శుభకార్యాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకునేవారు ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్​ చెల్లించనవసరం లేదని ప్రకటించింది. అంతే కాకుండా ఆ పెళ్లికి ఆర్టీసీ తరఫున ఒకరు హాజరై ఆర్టీసీ సంస్థ చిరుకానుకను అందిస్తున్నారు. దీంతో పెళ్లి బస్సులు అద్దెకు తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఈ ఆలోచన మంచి ఫలితాలను ఇవ్వడంతో ఆర్టీసీ మరిన్న కార్యక్రమాలు అమలు చేస్తూ క్రమంగా ఆదాయాన్ని పెంచుకుంటూ నష్టాలను పూడ్చుకుంటుంది.

ఇదీ చూడండి: RTC MD Sajjanar tweet: బస్సులో ఈ విద్యార్థి చేస్తుంది చూస్తే ఆశ్చర్యపోతారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.