ETV Bharat / state

కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు సర్కారు సమాయత్తం.. నేడు కొన్నిచోట్ల శ్రీకారం!

author img

By

Published : Apr 14, 2022, 5:19 AM IST

కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు సర్కారు సమాయత్తం.. నేడు కొన్నిచోట్ల శ్రీకారం!
కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు సర్కారు సమాయత్తం.. నేడు కొన్నిచోట్ల శ్రీకారం!

Grain purchasing centers: రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం సమాయత్తమైంది. నేడు అంబేడ్కర్​ జయంతిని పురస్కరించుకుని లాంఛనంగా పలు గ్రామాల్లో, రేపు మరికొన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. యాసంగిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన సర్కారు.. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దుల్లో 51 పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తోంది.

Grain purchasing centers: యాసంగిలో పండిన ప్రతి ధాన్యపు గింజను కొంటానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ధాన్యం కొనుగోలుపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. 60 రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ధాన్యం కొనుగోలు, ఏర్పాట్లపై పౌర సరఫరాల అధికారులతో మంత్రి గంగుల కమలాకర్‌ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 36 లక్షల ఎకరాల్లో వరి సాగవగా.. 65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తాయని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖలు అంచనా వేశాయి.

సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణకు రాకుండా పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం సరిహద్దుల్లో 51 పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్థానిక రైతుల పంట మాత్రమే ఆధార్ కార్డు ఆధారంగా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

పొరపాట్లు పునరావృతం కాకుండా..

గత వానాకాలం ధాన్యం సేకరణలో చోటుచేసుకున్న పొరపాట్లు పునరావృతం కాకుండా పౌర సరఫరాల శాఖ జాగ్రత్తలు తీసుకోనుంది. నిత్యం పర్యవేక్షించేందుకు ఒక్కో కొనుగోలు కేంద్రానికి ఒక నోడల్ అధికారి, రైస్‌ మిల్లుకు గెజిటెడ్ అధికారిని నియమించబోతోంది. ఏదైనా జిల్లాలో పంట అధికమై మిల్లింగ్ సామర్థ్యం తగ్గితే.. రైతులకు అన్యాయం జరగకుండా ఓ గెజిటెడ్ అధికారి స్వయంగా రైతు వెంట వెళ్లి ధాన్యం అన్‌లోడింగ్ అయ్యేంత వరకు ఉండేలా ఆదేశాలు ఇచ్చింది. ఈ యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు 15 కోట్ల గన్నీ బ్యాగుల అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు కోటీ 60 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. కొత్తవి మరో 57 లక్షలు ఉన్నాయి. అవసరమైన 13 కోట్ల 40 లక్షల గన్నీ బ్యాగుల కోసం కేంద్ర జ్యూట్ కమిషనర్‌కు లేఖ రాస్తున్న పౌర సరఫరాల శాఖ... అందుకోసం రూ.527 కోట్లు ముందస్తు చెల్లింపులు చేస్తోంది.

సరకు నిల్వలపై ప్రత్యేక దృష్టి..

ధాన్యం సేకరణ ప్రారంభమవుతున్న వేళ.. సరకు నిల్వలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఎఫ్​సీఐ గోదాముల్లో నిల్వ సామర్థ్యం సరిపడా ఉంది. అవి నిండుకుంటే గతేడాది తరహాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల్లో నిల్వ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ చూడండి..

ఆబ్కారీ, అటవీ, అగ్నిమాపకశాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్​ సిగ్నల్​

బట్టలు ఆరేసే తీగల్లో చిక్కుకుని విలవిల్లాడిన కోతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.