ETV Bharat / state

ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు తీపికబురు.. 1,433 ఉద్యోగాల భర్తీకి అనుమతి

author img

By

Published : Jun 7, 2022, 2:04 PM IST

Updated : Jun 8, 2022, 7:04 AM IST

నిరుద్యోగులకు మరో గుడ్​న్యూస్​.. 1,433 కొత్త ఉద్యోగాల భర్తీకి నిర్ణయం
నిరుద్యోగులకు మరో గుడ్​న్యూస్​.. 1,433 కొత్త ఉద్యోగాల భర్తీకి నిర్ణయం

13:53 June 07

ఇంజినీరింగ్‌ పట్టభద్రులకు తీపికబురు.. 1,433 ఉద్యోగాల భర్తీకి అనుమతి

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్​న్యూస్​ చెప్పింది. పురపాలక, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల్లో 1,433 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్‌ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, అసిస్టెంట్‌ ఇంజినీర్లు, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, పట్టణ ప్రణాళిక బిల్డింగ్‌ ఓవర్సియర్లు, సర్వేయర్లు, అసిస్టెంట్‌ టౌన్‌ప్లానర్లు, డ్రాఫ్ట్స్‌మెన్‌, టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌లు, వాటర్‌ ఎనలిస్ట్‌లు, హెల్త్‌ అసిస్టెంట్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు సహా వివిధ పోస్టులు భర్తీచేస్తారు. మిషన్‌భగీరథ, పురపాలకశాఖ, పట్టణ ప్రణాళిక విభాగంలో ఉన్న ఖాళీలను రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ గ్రామీణ నీటిసరఫరా (మిషన్‌భగీరథ)లో 420 పోస్టులు, పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ పరిధిలో 350, ప్రజారోగ్యశాఖ (పబ్లిక్‌హెల్త్‌)లో 236, పురపాలకశాఖలో 196, పట్టణ ప్రణాళిక విభాగంలో 223 ఉన్నాయి. మరో 8 పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ అనుమతించింది. వాటిల్లో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు మూడు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ సీఈవో కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు రెండు, రాష్ట్ర ఎన్నికల సంఘంలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు మూడు ఉన్నాయి. సంఖ్యాపరంగా చూసినప్పుడు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల పోస్టులు 657, టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సియర్‌ ఉద్యోగాలు 175, అసిస్టెంట్‌ ఇంజినీర్ల కొలువులు 113 అత్యధికంగా ఉన్నాయి. ఇంజినీరు పోస్టుకు ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ ప్రధాన అర్హతగా ఉంటుంది. మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు 29తో కలిపి ఏఈఈ, ఏఈ ఉద్యోగాలు మొత్తం 799 ఉన్నాయి.

ఇప్పటివరకు 35,220 పోస్టుల భర్తీకి అనుమతి..

రాష్ట్ర ప్రభుత్వం 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు శాసనసభలో ప్రకటించగా ఇప్పటివరకు 35,220 కొలువుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 33,787 పోస్టులు భర్తీచేసేందుకు అనుమతించగా తాజాగా 1,433 ఉద్యోగాలు తోడయ్యాయి. ఇతర శాఖల్లోని ఖాళీల భర్తీకి అవసరమైన ఉత్తర్వులు జారీ చేసేందుకు ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం ఒక ప్రకటనలో ఈ విషయాలను తెలియజేసింది.

.

ఇదీ చూడండి..

యూపీఎస్సీ వైస్ ప్రిన్సిపల్, లెక్చరర్ ఉద్యోగాలు.. ఆ ఏజ్ వారికీ ఛాన్స్!

Last Updated :Jun 8, 2022, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.