ETV Bharat / state

'ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో నిర్ణయం'

author img

By

Published : Mar 13, 2020, 8:02 PM IST

Updated : Mar 13, 2020, 11:06 PM IST

council meeting
'యూనివర్సిటీల్లో నియామకాలు భర్తీ చేస్తాం..'

ఉద్యోగుల పీఆర్సీపై అతి త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు స్పష్టం చేశారు. మండల, జిల్లా పరిషత్​లకు గ్రామపంచాయతీ తరహాలో నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పల్లెల రూపు రేఖలు మార్చేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకోచ్చామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శాసన మండలిలో బడ్జెట్​పై జరిగిన చర్చకు మంత్రి హరీశ్​ రావు సమాధానం ఇచ్చారు. అనంతరం పల్లె ప్రగతిపై లఘు చర్చను నిర్వహించారు.

'యూనివర్సిటీల్లో నియామకాలు భర్తీ చేస్తాం..'

ఆర్థిక మాంద్యంలో కూడా సంక్షేమ పథకాలకు కోత పెట్టకుండా బడ్జెట్ ప్రవేశ పెట్టినట్లు ఆర్థిక మంత్రి హరీశ్​ రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు లక్షా 23 వేల కొత్త ఉద్యోగులను నియమించామన్నారు. త్వరలో యూనివర్సిటీల్లోని నియామకాలను భర్తీ చేస్తామని చెప్పారు. కేంద్రం నుంచి ఫిబ్రవరిలో 9 వేల 33 కోట్ల రూపాయలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు 450 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి 395 కోట్ల నిధులు రావాల్సి ఉందన్నారు. ఎఫ్​ఆర్​బీఎమ్ పరిధిలో 21.3 శాతంలోపే రాష్ట్రం అప్పులు తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాకుండా ఇతర కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయం పెంపుకోసం ప్రత్యేక దృష్టి పెట్టామని మంత్రి చెప్పారు.

పల్లె ప్రగతి నిరంతర కార్యక్రమం..

అనంతరం పల్లె ప్రగతిపై శాసన మండలిలో లఘు చర్చను ప్రారంభించారు. పల్లె ప్రగతిలో గ్రామాల రూపు రేఖలు మారిపోయాయని... గ్రామాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. గంగదేవిపల్లిలా ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. పల్లె ప్రగతి నిరంతర కార్యక్రమమని.. చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాక్టర్లు అందని 420 గ్రామాలకు త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీ రాజ్ శాఖకు గతంలో 13 వేల కోట్ల దాటలేదని.. నేడు 23 కోట్లు కేటాయించారని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.

బెల్టు దుకాణాలు లేనప్పుడే పల్లె ప్రగతి సఫలం

పల్లె ప్రగతి మంచి కార్యక్రమం అని... కానీ గ్రామాల్లో బెల్టు దుకాణాలు లేనప్పుడే నిజమైన పల్లె ప్రగతి సాధించినట్లని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. హోం, ఎక్సైజ్, పంచాయతీ రాజ్ శాఖ కలిసి బెల్టు దుకాణాల మీద దాడులు చేసి మూసివేయాలన్నారు. పీఆర్సీ ఆలస్యం అయితే ప్రభుత్వం వెంటనే మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. 50 వేల లోపు రైతు రుణ మాఫీని రెండు విడతల్లో చేయాలని... నూతన గ్రామ పంచాయతీల్లో రేషన్ దుకాణాలను మంజూరు చేయాలని కోరారు. నూతనంగా ఆహార భద్రత కార్డులను మంజూరు చేయాలన్నారు.

ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడం సరికాదు..

ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలకు ఎమ్మెల్సీలను పిలవడం లేదని.. అధికారులు ప్రోటోకాల్ పాటించాలని భాజపా ఎమ్మెల్సీ రామచందర్ రావు కోరారు. గ్రామాల్లో బహిరంగ మల విసర్జన లేకుండా మరుగుదొడ్లు నియమించాలని... నగరాలు, పట్టణాలకు వలస వచ్చినవారు తిరిగి గ్రామాలకు వెళ్లే పరిస్థితి తీసుకు రావాలని కోరారు. గ్రామాల్లో అనేక పథకాలకు కేంద్రం నిధులు సమకూరుస్తోందని వెల్లడించారు. సమస్యలను పరిష్కరించాలని అడుగుతున్న ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడం సరికాదని... వెంటనే వారిని విడుదల చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ఉపాధ్యాయుల అరెస్ట్​లకు నిరసనగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మండలి నుంచి వాకౌట్ చేసి... మీడియా పాయింట్ వద్ద ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి: పల్లె ప్రగతి మంచి కార్యక్రమం: జీవన్​ రెడ్డి

Last Updated :Mar 13, 2020, 11:06 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.