ETV Bharat / state

రామనామంతో మార్మోగిన తెలంగాణ.. జగత్ కల్యాణాన్ని చూసి పులకించిన భక్తజనం

author img

By

Published : Mar 30, 2023, 2:02 PM IST

Sri Rama Navami
Sri Rama Navami

Sri Rama Navami Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘగంగా జరిగాయి. తెలంగాణ అంతా రామనామంతో మార్మోగింది. ప్రధాన ఆలయాలు నవమిశోభతో అలరారాయి. ఉదయం నుంచే పెద్దఎత్తున ఆలయాలకు తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేములవాడ సహా ఆయా జిల్లాల్లో రాములోరి కల్యాణానికి పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు.. కనులారా తిలకించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

Sri Rama Navami Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. పలుప్రాంతాల్లో స్వామివారి జగత్ కల్యాణంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడ పుణ్యక్షేత్రంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. కన్నుల పండువగా సాగిన స్వామివారి కల్యాణ క్రతువును చూసేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పంచోపనిషత్తు ద్వారా శ్రీ సీతారామ చంద్రమూర్తి స్వామివార్లకు అభిషేకాలు, స్వామివారి మూలవిరాట్​కు పండితులు కల్యాణం జరిపారు.

రాములోరి కల్యాణానికి హాజరైన మంత్రులు : సిద్దిపేటలోని హనుమంతుడిన దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు.. సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. భాగ్యనగరంలోను సీతారాముల కల్యాణం కమనీయంగా జరిగింది. మహబూబాబాద్‌లోని రామమందిరంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మంత్రి సత్యవతి రాఠోడ్ పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోని ఊరు వాడల్లో సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా సాగాయి. శ్రీరామనవమి సందర్భంగా రాయపర్తి మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన రాములోరి కల్యాణ మహోత్సవానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు పాల్గొని తలంబ్రాలు సమర్పించారు. హైదరాబాద్‌ సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో దేవాదాయ శాఖ అధికారులు నిర్వహించిన శ్రీ సీతారామ కల్యాణంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ దంపతులు పాల్గొన్నారు. కార్పొరేటర్‌ లక్ష్మి బల్రెడ్డితోపాటు తలసాని దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.

కమనీయంగా కోదండరాముని కల్యాణం : ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్​ఘాట్ ధ్యానాంజనేయ దేవాలయంలో దైవకార్యాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి లోక కళ్యాణం వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, చంపాపేట్ కార్పొరేటర్ హాజరయ్యారు. హైదరాబాద్‌ కూకట్ పల్లిలో 450 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం పుననిర్మాణం చేపట్టిన తర్వాత వేలాది మంది భక్తుల సమక్షంలో కమనీయమైన కల్యాణం జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. వనస్థలిపురం గణేష్‌ దేవాలయంలో జరిగిన కోదండరాముడి కళ్యాణానికి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా మోమిన్​పేట మండలం చీమలదరి గ్రామంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగా జరిగింది.

జానకమ్మను మనువాడిన జగదభిరాముడు : మెదక్ శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, అభిషేకాలు, మహా అలంకరణ, మహా మంగళహారతితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. భక్తుల రామనామస్మరణ మధ్య జానకమ్మను జగదభిరాముడు మనువాడాడు. బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో సీతారాముల కళ్యాణంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. దేశాయ్ పేట, బాన్సువాడ, తిరుమలపూర్‌లలోని పలు గ్రామాల్లో జరిగిన కల్యాణోత్సవాల్లో సతీసమేతంగా పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి... ప్రత్యేక పూజలు చేశారు.

శోభయాత్ర సందడి : శ్రీరామనవమిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్వాడి ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరం నుంచి శోభాయాత్ర ను పురవీధుల గుండా జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ కొనసాగించారు. చిన్నారుల పౌరాణిక వేషధారణలను ఆకట్టుకున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.