ETV Bharat / state

డిజిటల్‌ కొలతలపై కోర్టుకు.. కొందరు పోలీసు అభ్యర్థుల యోచన!

author img

By

Published : Dec 19, 2022, 10:11 AM IST

TSLPRB
TSLPRB

పోలీసు ఈవెంట్స్​లో గత నోటిఫికేషన్లలో ఎత్తు పరీక్షలో అర్హత సాధించిన పలువురు అభ్యర్థులు ఈసారి అనర్హులుగా మారడం చర్చకు దారి తీసింది. వీరే కాక పలువురు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ డిజిటల్ కొలతలపై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నారు.

పోలీసు ఎంపికల్లో గత నోటిఫికేషన్లలో ఎత్తు పరీక్షలో అర్హత సాధించిన పలువురు అభ్యర్థులు.. ప్రస్తుతం అనర్హులవడం చర్చనీయాంశమైంది. పోలీస్‌శాఖలో కానిస్టేబుళ్లుగా ఉద్యోగాలు చేస్తూ.. ఎస్సై పరీక్షకు పోటీ పడుతున్న పలువురు అభ్యర్థులు సైతం ఎత్తు విషయంలో అనర్హులుగా మారారని చెబుతుండడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకొంది. ఎంపిక ప్రక్రియలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ).. ప్రస్తుతం అభ్యర్థుల ఎత్తును డిజిటల్‌గా కొలుస్తోంది.

‘‘మాన్యువల్‌తో పోలిస్తే డిజిటల్‌ కొలతల్లో రెండు సెంటీమీటర్ల మేర తక్కువగా చూపిస్తోంది. దీంతో మాకు అన్యాయం జరుగుతోంది. మహిళా అభ్యర్థులకూ ఇలాంటి చేదు అనుభవమే ఎదురవుతోంది. డిజిటల్‌ పరికరంతో ఒకసారి కొలిచినప్పుడు వచ్చే కొలతలు.. మరోసారి కొలిచినప్పుడు రావడంలేదు. ఈ పరికరాల్లో ఏమైనా లోపాలున్నాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నాం’’ అని పలువురు అభ్యర్థులు తెలిపారు.

కొన్ని ఉదాహరణలివీ..

* సంగారెడ్డికి చెందిన గౌతమ్‌ 2018 నోటిఫికేషన్‌లో ఎత్తు కొలతల పరీక్షలో 167.6 సెంటిమీటర్ల ఎత్తుతో ఉత్తీర్ణుడయ్యారు. ఈసారి డిజిటల్‌ నమోదులో 167.3 సెం.మీ. (ఉండాల్సిన కనీస ఎత్తు 167.6 సెంటీమీటర్లు) అని తేలడంతో అనర్హుడిగా ప్రకటించారు.

* నిజామాబాద్‌ రాజారాం స్టేడియంలో ఈ నెల 8న తొలి రోజు ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ)లలో 41 మందిని ఎత్తులో అనర్హులుగా ప్రకటించారు. వీరిలో 23 మంది గతంలో ఎత్తు పరీక్షలో అర్హత సాధించినట్లు చెబుతున్నారు. కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన సురేశ్‌ ఎత్తును.. 2012, 2015, 2018 నోటిఫికేషన్ల పరీక్షల్లో 168 సెం.మీ.లుగా ప్రకటించారు. ఈసారి రాజారాం స్టేడియంలో నిర్వహించిన పరీక్షలో 166.70 సెంటీమీటర్లే ఉన్నారంటూ అనర్హుడిగా ప్రకటించారు.

* 2018లో డొంగరి శ్రీకాంత్‌ కొండాపూర్‌ 8వ బెటాలియన్‌లో జరిగిన పీఎంటీలో 168 సెం.మీ.ల ఎత్తుతో అర్హత సాధించారు. ఈసారి నల్గొండ మేకల అభినవ్‌ స్టేడియంలో నిర్వహించిన పరీక్షలో ఆయన ఎత్తు 166.3 సెం.మీ.లే ఉన్నారంటూ అనర్హత వేటు వేశారు.

ఇవీ చదవండి: Cycling track in Hyderabad : ఈ వేసవిలో అందుబాటులోకి సైక్లింగ్ ట్రాక్

వయసు 23 నెలలే.. ప్రపంచ రికార్డుల్లో చోటు.. ఈ బుడ్డోడి తెలివికి సలాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.