ETV Bharat / state

కృష్ణా బోర్డుకు ఆర్‌ఎంసీ తుది నివేదిక..

author img

By

Published : Dec 10, 2022, 8:15 AM IST

కృష్ణా బోర్డుకు ఆర్‌ఎంసీ తుది నివేదిక..
కృష్ణా బోర్డుకు ఆర్‌ఎంసీ తుది నివేదిక..

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నిర్వహణ విధివిధానాలపై ఆర్‌ఎంసీ తన తుది నివేదికను కృష్ణా బోర్డుకు అందజేసింది. ఈ నివేదికను త్వరలో నిర్వహించనున్న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో చర్చకు పెట్టి రాష్ట్రాల అభిప్రాయాలను కోరనున్నట్లు సమాచారం.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నిర్వహణ విధివిధానాలు రూపొందించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ(ఆర్‌ఎంసీ) తుది నివేదికను కృష్ణా బోర్డుకు అందజేసింది. రవికుమార్‌ పిళ్లై కన్వీనర్‌గా బోర్డు నుంచి ఒకరు, రెండు రాష్ట్రాల నుంచి నలుగురితో కలిపి ఆరుగురు సభ్యులతో మే 10న ఆర్‌ఎంసీని బోర్డు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రెండు జలాశయాల నిర్వహణ విధానాలు, జల విద్యుదుత్పత్తి కేంద్రాల నిర్వహణ, మిగులు జలాల అంశాలను తేల్చేందుకు ఆరు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. ఏపీ, బోర్డు సభ్యులు మాత్రమే సంతకాలు చేసిన నివేదికను బోర్డు ఛైర్మన్‌కు కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లై అందజేశారు.

ముసాయిదా నివేదికలోని ప్రధాన అంశాలపై ఈ నెల 3న జరిగిన ఆరో సమావేశంలో ఒప్పందంపై సంతకాలకు సభ్యులంతా సిద్ధమవగా.. తెలంగాణ మరికొంత గడువు కోరిందని నివేదికలో కన్వీనర్‌ పేర్కొన్నారు. దీని కోసం సమావేశం వాయిదా వేసి తిరిగి 5న నిర్వహించగా తెలంగాణ గైర్హాజరయిందన్నారు. చివరగా ఏపీ, బోర్డుకు చెందిన నలుగురు సభ్యుల సంతకాలతో నివేదికను అందజేస్తున్నట్లు వివరించారు. అయితే, ఈ నివేదికను త్వరలో నిర్వహించనున్న కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో చర్చకు పెట్టి రాష్ట్రాల అభిప్రాయాలను కోరనున్నట్లు తెలిసింది. అనంతరం ఆర్‌ఎంసీని కొనసాగిస్తారా లేదా అనేది తేలనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.