ETV Bharat / state

రామోజీ ఫౌండేషన్ దాతృత్వం, రూ.కోటిన్నర వెచ్చించి వృద్ధాశ్రమం

author img

By

Published : Aug 23, 2022, 8:40 PM IST

Updated : Aug 24, 2022, 7:13 AM IST

Ramoji Foundation
Ramoji Foundation

Ramoji Foundation రామోజీ ఫౌండేషన్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. కర్నూలులోని ఓ వృద్ధాశ్రమానికి కోటిన్నర రూపాయలు వెచ్చించి అత్యాధునిక భవనాన్ని నిర్మించి ఇచ్చింది. దాదాపు 70 మంది వృద్ధులు అన్ని సౌకర్యాలతో నివసించేలా రామోజీ ఫౌండేషన్‌ నిర్మించిన నూతన భవనాన్ని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ ప్రారంభించారు.

రామోజీ ఫౌండేషన్ దాతృత్వం

బట్టలు అమ్ముతూ జీవనం సాగించే.. బత్తిని శ్రీనివాసులు వృద్ధుల వెతలు చూసి.. వారికి సేవ చేయాలని భావించారు. ఐదుగురు వృద్ధులతో 9 ఏళ్ల క్రితం కర్నూలు నందికొట్కూరు రోడ్డులో.. షిరిడీ సాయి వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. క్రమంగా ఆశ్రమంలో వృద్ధుల సంఖ్య 50కి చేరింది. అద్దె భవనంలో ఆశ్రమం నిర్వహించేందుకు శ్రీనివాసులు ఇబ్బందులు పడుతుండేవారు. ఈ విషయం రామోజీ ఫౌండేషన్ దృష్టికి వచ్చింది.

తనవంతు సాయంగా: ‘‘కర్నూలు నగరంలో ‘రామోజీ’ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ.1.20 కోట్లతో వృద్ధాశ్రమం నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. నాణ్యమైన భవనంతోపాటు ఇందులో వృద్ధులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాం. సొంతింటికంటే ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పాం’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ సీహెచ్‌ శైలజాకిరణ్‌ అన్నారు. ఈనాడు తెలంగాణ ఎడిటర్‌ డీఎన్‌ ప్రసాద్‌, రామోజీ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ శివరామకృష్ణ, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటనాగ శ్రీనివాసరావు, వయోవృద్ధుల సహాయ సంచాలకురాలు పి.విజయతో కలిసి ఆమె మంగళవారం వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. కర్నూలు-నందికొట్కూరు రోడ్డులోని వాసవినగర్‌లో ఈ భవనాన్ని నిర్మించారు.

రామోజీ ఫౌండేషన్ దాతృత్వం.. రామోజీ ఫౌండేషన్‌ ద్వారా సీఎస్‌ఆర్‌ నిధులు సద్వినియోగమయ్యేలా, ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా వెచ్చిస్తున్నామని శైలజాకిరణ్‌ తెలిపారు. ‘‘సమాజంలో కొందరు వృద్ధులు వేధింపులు, నిరాదరణకు గురవుతున్నారు. ఇలాంటివారికి ఆర్థిక మద్దతు, అక్కున చేర్చుకునే ఆప్యాయతలు కరవై ఆశ్రమాల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. యువత వృత్తిపరంగా బిజీగా ఉండటం, కుటుంబ బాధ్యతలు నిర్వహించే క్రమంలో తల్లిదండ్రులను దగ్గర ఉంచుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో వృద్ధాశ్రమాల్లో ఉంచాల్సి వస్తోంది. అభిమానం పంచుతూ ప్రతి రోజూ వారితో మాట్లాడుతూ ఉండాలి. మందులు, భోజనం, నిద్ర గురించి కుశల ప్రశ్నలు వేస్తే మీరు దగ్గర ఉన్నట్టే భావించి తృప్తిగా జీవిస్తారు. యువత సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, పాటలు, నృత్యాలతో పోస్టులు పెడుతున్నారు. ఈ సరదాతోపాటు బాధ్యతగా ఎదగాలి. పుట్టిన రోజుకు రూ.10 వేలు ఖర్చు పెట్టి వేడుక చేసుకున్నా.. అందులో రూ.వంద ఖర్చు పెట్టి పేదలకు చిన్న కానుక ఇచ్చి ఈ పోస్టులు సామాజిక మాధ్యమాల్లో పెట్టండి. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒకరిని చూసి మరొకరు చేస్తే లేనివారికి ఎంతో సాయం చేసిన వాళ్లమవుతాం. ఉద్యోగులు ప్రజలకు అండగా నిబద్ధతతో పనిచేస్తే మన దేశం 25 ఏళ్లలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు.

నిస్వార్థ జీవనంతో యశస్సు: తన కోసం తాను కాకుండా.. ఇతరుల కోసం జీవించేవారు చిరకాలం నిలిచిపోతారు... అలాంటి వారిలో రామోజీరావు కూడా ఒకరని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటనాగ శ్రీనివాసరావు కొనియాడారు. రామోజీరావును ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కర్నూలులో అత్యాధునిక వసతులతో వృద్ధాశ్రమం నిర్మించడం గొప్పగా భావిస్తున్నామని వయోవృద్ధుల సహాయ సంచాలకులు పి.విజయ అన్నారు. తమ బాగోగులు తెలుసుకుని సొంత భవనం నిర్మించి ఇచ్చిన రామోజీరావు కుటుంబానికి రుణపడి ఉంటామని షిర్డీసాయి ఆశ్రమ అధ్యక్షుడు బత్తిని శ్రీనివాసులు అన్నారు. కార్యక్రమంలో కర్నూలు ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి అలీ తదితరులు పాల్గొన్నారు.

సంకల్పంగా చేపట్టి పూర్తి చేశాం: ఎం.శివరామకృష్ణ, రామోజీ ఫౌండేషన్‌ డైరెక్టర్‌

రామోజీరావు ఆధ్వర్యంలో వృద్ధాశ్రమాలు నిర్మించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు తల్లిదండ్రుల్లాంటి వృద్ధులకు భవనాలు కట్టించడం గర్వంగా, ఛాలెంజ్‌గా తీసుకున్నా. విద్యుత్‌ ఇబ్బందులు తలెత్తకుండా సోలార్‌, వేడి నీళ్లు, వినోదానికి టీవీలు ఇలా సదుపాయాలన్నీ ఏర్పాటుచేశాం.

విపత్తుల సమయంలో చేదోడుగా: డీఎన్‌ ప్రసాద్‌, ఈనాడు తెలంగాణ ఎడిటర్‌

సమాచారాన్ని చేరవేయడమే కాకుండా పేదల సంక్షేమానికి అంకితభావంతో పనిచేయడమే జర్నలిజమని ఛైర్మన్‌ రామోజీరావు నమ్మారు. వ్యాపారంతోపాటు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్ఫూర్తిప్రదాతగా ఛైర్మన్‌.. రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను పటిష్ఠంగా నిర్వహిస్తున్నారు. వృద్ధాశ్రమాలు, పాఠశాలల భవనాలు, పేదలకు ఇళ్లు నిర్మించడంతోపాటు వస్తు రూపేణా సహాయ సహకారాలను అందిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 55 పాఠశాలల భవనాలు నిర్మించారు. నాలుగు చోట్ల వృద్ధాశ్రమాలకు కొత్త భవనాలు, వంద ఆశ్రమాలకు వస్తు రూపంలో సౌకర్యాలు కల్పించడంతోపాటు అదనపు గదులు నిర్మించి ఇచ్చారు

Last Updated :Aug 24, 2022, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.