ETV Bharat / state

Political Heat in Telangana : ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోన్న రాష్ట్ర రాజకీయం.. అధికారమే లక్ష్యంగా పార్టీల వ్యూహాలు.!

author img

By

Published : Jul 9, 2023, 8:06 AM IST

Elections Heat in Telangana : తెలంగాణలో రాజకీయం రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. ఇప్పటివరకు రాష్ట్ర పార్టీ నేతల మాటలయుద్ధం కాకరేపుతుండగా.. ఇప్పుడు జాతీయనేతల పర్యటనలతో మరింత వేడేక్కింది. ఖమ్మం జనగర్జన సభలో రాహూల్‌ గాంధీ.. బీఆర్​ఎస్​, బీజేపీలు రెండు ఒక్కటేనని విమర్శనాస్త్రాలు సంధిస్తే.. నిన్న ఓరుగల్లు విజయసంకల్ప సభావేదికగా బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌లను లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక ఈ రెండు పార్టీల ఆరోపణలు, విమర్శల్ని దీటుగా తిప్పికొడుతున్న గులాబీ పార్టీనేతలు మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు అమలుచేస్తున్నారు.
Etv Bharat
Etv Bharat

రాజకీయ రణక్షేత్రంగా మారుతున్న తెలంగాణ

Political Heat in Telangana : రాష్ట్రంలో రాజకీయం ఎన్నికల ప్రచారాన్నితలపిస్తోంది. అసెంబ్లీ పోరుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్‌ కొట్టాలని లక్ష్యంగా పెట్టున్న బీఆర్​ఎస్​ సభలు, సమావేశాలతో జనంలోకి వెళ్తోంది. అటు తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌, బీజేపీలు అగ్రనేతలను బరిలోకి దింపాయి.

Modi Statements on BRS and Congress : బీఆర్​ఎస్​కు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న కమలనాథులు దూకుడు పెంచారు. మహాజన్‌ సంపర్క్‌ సహా వివిధ కార్యక్రమాల ద్వారా కేంద్రమంత్రులు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో మరింత జోష్‌ నింపేలా అగ్రనేతలు రంగంలో దిగారు. ఇటీవల నాగర్‌కర్నూల్‌లో నవసంకల్ప సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... ఎన్డీఏ సర్కార్‌ అభివృద్ధిని వివరిస్తూనే కేసీఆర్​ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇక నిన్న ఓరుగల్లులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రధాని నరేంద్రమోదీ.... విజయసంకల్ప సభలో పాల్గొన్నారు. బీజేపీ, బీఆర్​ఎస్​లు ఒక్కటేనన్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌లు రెండూ కుటుంబ, అవినీతి పార్టీలేనని వీటిని ఓడించి బీజేపీకు పట్టం కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

దూకుడు పెంచిన కాంగ్రెస్.. అధికారమే లక్ష్యంగా.. : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయామని భావిస్తున్న కాంగ్రెస్‌... ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో శ్రమిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర అగ్రనాయకత్వం పాదయాత్రలు, సభలతో బీఆర్​ఎస్​ సర్కార్‌ వైఫల్యాలపైనా పోరుబాటపట్టింది. ఇదేసమయంలో జాతీయ అగ్రనేతలు తెలంగాణ బాటపట్టారు. ఇప్పటికే ఓరుగల్లులో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌... సరూర్‌నగర్‌ సభావేదికగా ప్రియాంకగాంధీ యూత్‌ డిక్లరేషన్‌ ప్రకటించారు. ఇదేసమయంలో కర్ణాటక గెలుపు ఇచ్చిన ఊపుతో తెలంగాణలోనూ దూకుడు పెంచింది. ఖమ్మం జనగర్జన సభలో పాల్గొన్న రాహుల్‌గాంధీ బీఆర్​ఎస్​, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ముక్కోణపు పోటీ ఉంటుందన్న అంచనాల నడుమ బీఆర్​ఎస్​... బీఆర్​ఎస్​కు బీ టీమ్‌ అంటూ ఆరోపణలు చేశారు. కర్ణాటకలో బీజేపీ ఓడించినట్లుగానే ఇక్కడ ఆ పార్టీ టీమ్‌ను ఓడిస్తామని ప్రకటించారు

'మొదట్లో తెలంగాణలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య పోటీ ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ లేదు. ఓ వాహనం వెళ్తున్నప్పుడు మధ్యలో నాలుగు టైర్లు పంక్చర్‌ అయినట్లుగా బీజేపీ అంతమైపోయింది. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ బీ టీమ్‌ మధ్యే ప్రస్తుతం పోటీ ఉంది. కర్ణాటకలో బీజేపీని ఓడించినట్లుగానే తెలంగాణలోనూ బీజేపీ బీ టీమ్‌ను ఓడిస్తాం.'-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

KCR about BJP and Congress Parties : ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలనే లక్ష్యంతో వేగంగా పావులు కదుపుతుంటే... అధికార బీఆర్​ఎస్​ వీటిని దీటుగా ఎదుర్కొనే వ్యూహాలు అమలుచేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీలు రాష్ట్ర పర్యటనలో చేసిన విమర్శలను ఎప్పటికప్పుడే మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పికొడుతున్నారు. సీఎం కేసీఆర్‌ కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల ప్రారంభోత్సవాలతో జిల్లాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... 9ఏళ్ల బీఆర్​ఎస్​ సర్కార్‌ అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రలో నిర్వహిస్తున్న సభల్లోనూ కాంగ్రెస్‌, బీజేపీల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీల్లో తాము ఎవరికీ అనుకూల పక్షం కాదంటూ తేల్చిచెబుతున్నారు.ఇలా ప్రధాన పార్టీల హోరాహోరీ పోరుతో తెలంగాణ రాజకీయ కాకరేపుతోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇది మరింత ఆసక్తికరంగా మారనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.