ETV Bharat / state

కస్టోడియల్‌ డెత్‌ కేస్​: కారకులపై హత్యానేరం కేసులు నమోదు చేయాలి

author img

By

Published : Jun 23, 2021, 10:13 PM IST

mariyamma lockup death
కస్టోడియల్‌ డెత్‌ కేస్

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పీఎస్​లో అనుమానాస్పదంగా మృతి చెందిన మరియమ్మ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళిత, గిరిజనులపై పోలీసుల ఆకృత్యాలు పెరిగి పోయాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు.. విచారణ పేరిట ఏళ్ల తరబడి ఎంతోమంది ప్రాణాలు తీశారంటూ మండిపడ్డారు.

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పీఎస్​లో జరిగిన మరియమ్మ కస్టోడియల్‌ డెత్‌కు కారకులైన పోలీసులపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క, రాష్ట్ర కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ప్రీతమ్​లు.. డీజిపీ మహేందర్‌ రెడ్డిని కలిసి అన్యాయంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో.. ఎస్సీ, ఎస్టీలతోపాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై జరుగుతోన్న దాడులను ఫిర్యాదులో ప్రస్తావించారు.

సస్పెండ్​ సరిపోదు..

మరియమ్మ ఘటనలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను, ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తే సరిపోదని నేతలు మండిపడ్డారు. ఘటనకు కారకులైన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల్లో తెరాసకు వ్యతిరేకంగా పని చేసిన కాంగ్రెస్‌ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశ పూర్వకంగానే ఇబ్బందులు పెడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి.. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. పీడీ చట్టాలను ప్రయోగిస్తున్నారు. అన్యాయాలపై ప్రశ్నించేవారే లేరనుకుంటున్నారా..? న్యాయం జరిగే వరకూ పోరాడుతాం. ఘటనపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తాం.

- ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

మరియమ్మను మూడు స్టేషన్లకు తిప్పుతూ దారుణంగా కొట్టి చంపారు. కూతురు చూస్తుండగానే చిత్ర హింసలకు గురి చేశారు. ఘటనపై న్యాయ విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో దళిత, గిరిజనులపై పోలీసుల ఆకృత్యాలు పెరిగి పోయాయి. పోలీసులు.. విచారణ పేరిట ఏళ్ల తరబడి ఎంతోమంది ప్రాణాలు తీశారు. సీఎం కేసీఆర్.. పోలీసులకు విచ్చలవిడి అధికారాలు ఇవ్వడం వల్ల.. సామాన్యులెవరూ బతికే పరిస్థితి కనిపించడం లేదు.

- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

మృతురాలి కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియోను చెల్లించాలి. మరియమ్మ పిల్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. భూమి, డబుల్​ బెడ్​ రూమ్​ను కేటాయించాలి. ప్రభుత్వం ఇకపై దళితులు, గిరిజనులపై దాడులు జరగకుండా చూడాలి.

-సీతక్క, ఎమ్మెల్యే

ఏం జరిగిందంటే..

ఓ చోరీ కేసులో విచారణకు తీసుకొచ్చిన మరియమ్మ.. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పీఎస్​లో జూన్​ 18న అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దొంగతనం కేసు విచారణలో పీఎస్​కు తరలిస్తుండగా ఆవరణలోనే స్పృహతప్పి పడిపోవడం వల్ల భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు ఎస్సై మహేశ్ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే చర్యలు..

పోలీసులు కొట్టడంతోనే మరియమ్మ మరణించినట్లు భారీ ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తూ.. చర్యలు చేపట్టారు. స్థానిక ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యపై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని భువనగిరి జోన్ డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.

సస్పెండ్ సరిపోదు.. హత్యానేరం కేసు నమోదు చేయండి..

సంబంధిత కథనాలు:

మరియమ్మ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించిన పోలీసులు

మరియమ్మ మరణంతో అడ్డగూడూరు ఎస్సై, కానిస్టేబుళ్లపై వేటు

PIL IN HIGHCOURT: అడ్డగూడూరు కస్టోడియల్ మృతిపై హైకోర్టులో పిల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.