ETV Bharat / state

ఆడ పిల్లలంటే సాటుగా ఉండడం కాదు స్మార్ట్​ ఫోన్​ మాదిరిగా ఉండాలి: ఎమ్మెల్సీ కవిత

author img

By

Published : Mar 7, 2023, 4:25 PM IST

MLC Kavitha
MLC Kavitha

MLC Kavitha Comments on Womens Day: రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు టీహబ్‌, టీ వర్క్స్‌ వంటి అనేక అవకాశాలున్నాయని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

MLC Kavitha Comments on Womens Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థినులతో కలిసి కవిత బెలూన్లు ఎగరేశారు. అనంతరం మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థినులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత.. అనేక రంగాల్లో మహిళలు రాణించటం సంతోషకరమన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు టీహబ్‌, టీ వర్క్స్‌ వంటి అనేక అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల గౌరవాన్ని, ఉన్నతిని కాపాడేందుకు అనేక పథకాలను అందిస్తున్నారని అన్నారు. ప్రపంచంలో మహిళల కోసం అనేక అవకాశాలు ఉన్నాయన్న కవిత.. ధైర్యంగా ముందుకు అడుగేసి వాటిని చేజిక్కించుకోవాలని కోరారు.

'నా దృష్టిలో ఆడపిల్లలమంటే సాటుగా ఉండడం కాదు స్మార్ట్​ఫోన్ మాదిరిగా ఉండాలి. నేటి కాలంలో చదువుకోవడం ఉద్యోగం చేయడం అనేది పాతగా అయిపోయింది. చదువుకొని ఉద్యోగం చేస్తూనే వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించే స్టేజ్​కి మనం రావాలి. కేవలం మనం మల్టినేషనల్​ కంపెనీలో ఉద్యోగం చేయాలనే ఆలోచన వదిలిపెట్టి మనం ఎందుకు మల్టి నేషనల్ కంపెనీ పెట్టొద్దు అనే ఆలోచన చేయాలి. మనం పెట్టే కంపెనీ ఎందుకు మల్టీపుల్ నేషనల్స్​లో పని చేయకూడదనే ఆలోచన మనలో ప్రారంభం కావాలి. నేడు ఏదైనా ఒక గొప్ప ఐడియా ఉంటే సరిపడా డబ్బులు లేకున్నా ఆ రంగంలో ముందుకు వెళ్లొచ్చు.'-కవిత, ఎమ్మెల్సీ

నేను తుమ్మితే తుఫాన్ వస్తుంది : ఇదే కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మహిళలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మల్లారెడ్డి తన మాటలతో యూనివర్సిటీ విద్యార్థులను అలరించారు. ఎప్పుడూ తనదైన శైలీలో డైలాగులు గుప్పించే మల్లారెడ్డి మరోసారి తన క్రేజ్ మార్క్ చూపించుకున్నారు. 'ఈ మధ్య నేను పెద్ద సెలబ్రిటీ అయ్యాను. నేను తుమ్మితే తుఫాన్ వస్తుంది. ఈ మధ్య నేను తుమ్మినా, దగ్గినా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాను.' అని మల్లారెడ్డి అన్నారు. అలాగే మల్లన్న అంటే ఆ క్రేజ్ ఉట్టిగానే రాలే... కష్టపడ్డ పూలమ్మిన, పాలమ్మిన అనే డైలాగుతో మరోసారి మంత్రి మల్లారెడ్డి విద్యార్థులను నవ్వించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.