ETV Bharat / state

గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల సమావేశం.. అదే ఎజెండా..!

author img

By

Published : Aug 11, 2022, 10:16 AM IST

గాంధీభవన్‌
గాంధీభవన్‌

Congress party Meeting: మునుగోడు ఉపఎన్నికపై ఇవాళ కాంగ్రెస్‌ ముఖ్యనాయకులతో గాంధీభవన్‌లో సమావేశం జరగనుంది. మాణిక్కం ఠాగూర్, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ తదితరులు పాల్గొననున్నారు.

Congress party Meeting: మునుగోడు ఉప ఎన్నికలపై ఇవాళ గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ మునుగోడు ఉపఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ , పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, , నియోజకవర్గ కమిటీ కన్వీనర్ మధుయాష్కీలతోపాటు కమిటీ సభ్యులు కూడా పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన టీపీసీసీ అనుబంధ సంఘాల ఛైర్మన్‌ల సమావేశం మధ్యాహ్నం 1 గంటకు జరుగుతుందని కాంగ్రెస్​ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్​కుమార్​ గౌడ్‌ తెలిపారు. ఈ సమావేశాలల్లో ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికల అంశంపైనే చర్చ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

మునుగోడు కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరికి ఇచ్చినా అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలసికట్టుగా అభ్యర్థి గెలుపునకు కృషిచేయాలని ఆశావహులకు పార్టీ స్పష్టం చేసింది. సిట్టింగ్‌ స్థానమైన మునుగోడును దక్కించుకోవడమే లక్ష్యంగా కీలక సమావేశాలను కాంగ్రెస్‌ ప్రారంభించింది. నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్‌ ఆశావహులతో పాటు నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలతో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు సమావేశమై వివిధ అంశాలను చర్చించారు.

మునుగోడు స్థానాన్ని మళ్లీ హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ చురుగ్గా పావులు కదుపుతోంది. అందులోభాగంగా గాంధీభవన్‌లో నల్గొండ జిల్లా, మునుగోడు నేతలతో బోసురాజుతో పాటు కాంగ్రెస్​ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్​కుమార్​ గౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మాజీ విప్‌ అనిల్‌కుమార్, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌లతో పాటు నియోజకవర్గ నాయకులు సమావేశమయ్యారు.

కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశిస్తున్న నియోజకవర్గ నేతలు పాల్వాయి స్రవంతి, చల్లమల కృష్ణారెడ్డి, కైలాష్‌నేత, పల్లె రవికుమార్‌లు ఇందులో పాల్గొన్నారు. ఉపఎన్నికకు సంబంధించిన వివిధ అంశాలపై నాయకుల సలహాలు తీసుకున్నారు. మునుగోడు కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషిచేయాలని స్పష్టం చేశారు.

మండల పార్టీ అధ్యక్షులు రాజీనామా చేసిన ఆరు మండలాల్లో ఐదుగురు సీనియర్లతో సమన్వయ కమిటీ వేయాలని నిర్ణయించారు. ఈనెల 16 నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటించనున్నారని పార్టీవర్గాలు వెల్లడించాయి. మండలాలవారీగా పార్టీ నేతలతో సమావేశమై శ్రేణులకు భరోసా కల్పించనున్నారు. సమీక్షలు, సర్వేలు పూర్తయ్యాక వచ్చే నివేదిక ఆధారంగానే అభ్యర్థి ఎంపిక జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు స్పష్టం చేశారు.

మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కూడా జానారెడ్డిని కలిసి మునుగోడు ఉపఎన్నిక, అక్కడి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ విజయం కోసం సమన్వయంతో పనిచేస్తామని సమావేశం అనంతరం ఆశావహులు చెప్పారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని పాల్వాయి స్రవంతి స్పష్టం చేశారు. పార్టీలో ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదన్నారు.

కాంగ్రెస్‌ ముఖ్యనేతలు బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మాణిక్కం ఠాగూర్, రేవంత్‌రెడ్డి, బోసురాజు, నదీమ్‌ జావేద్, సునీల్‌ కనుగోలు.. తదితరులు అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఉపఎన్నికపై ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ సర్వే వివరాలను అందించినట్లు సమాచారం. ప్రధానంగా మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహం, ఆశావహుల నేపథ్యం, ప్రత్యర్థులు బలాబలాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.

ఇవీ చదవండి: కళాశాలలకు రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌.. ఉన్నత విద్యామండలి నిర్ణయం

'రాష్ట్రపతి కాలేదన్న బాధలేదు.. నేనేదీ కోరుకోలేదు.. పెద్దలే ప్రోత్సహించారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.