ETV Bharat / state

ఏపీలో వైసీపీ నేతల ఆగడాలతో జాకీ కంపెనీ జంప్​..!

author img

By

Published : Nov 21, 2022, 10:08 AM IST

Jockey Company Issue In AP
Jockey Company Issue In AP

Jockey Company Issue In AP: పరిశ్రమ స్థాపిస్తామని ఎవరైనా ముందుకొస్తే.. ఏ ప్రభుత్వమైనా ఎర్ర తివాచీ పరిచి ఘనంగా స్వాగతం పలుకుతుంది. కానీ ఏపీలో వైసీపీ ప్రభుత్వ వ్యవహారం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. వసూళ్లు.. మామూళ్లు అంటూ నేతలు మేత కోసం వెంట పడుతుండటంతో కాలు పెట్టిన కంపెనీలు కూడా పరారైపోతున్నాయి. కాలు తొక్కిననాడే తెలుస్తుంది కాపురం చేసే కళ అన్నట్లు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే ఈ జాడ్యం మొదలైంది. ఓ ప్రజాప్రతినిధి దెబ్బకు ఒక పెద్ద పరిశ్రమ ఒకటి కాపురం పెట్టక ముందే బెదిరిపోయి పక్క రాష్ట్రానికి పారిపోయింది.

ఏపీలో వైసీపీ నేతల ఆగడాలతో జాకీ కంపెనీ జంప్​..!

Jockey Company Issue In AP: వేల మందికి ఉపాధి కల్పించగల ఒక పరిశ్రమను ఏపీలో పెట్టేందుకు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న సంస్థ పేజ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌’ సిద్ధపడింది. ఎంతో పేరు ప్రతిష్ఠలున్న జాకీ దుస్తులను అది తయారు చేస్తుంది. ఈ సంస్థకు స్థల కేటాయింపులు, సన్నాహాలూ పూర్తయ్యాయి. కానీ ముందు తన సంగతి తేల్చాలంటూ ఆ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒకరు ముడుపుల కోసం బెదిరింపులకు దిగారు.

దీంతో ఆ సంస్థ ఆంధ్ర నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. తర్వాత తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించడంతో అక్కడ ఒకచోట కాదు.. రెండు చోట్ల పరిశ్రమలు పెట్టేందుకు సిద్ధమైంది. తాజాగా ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ పరిశ్రమల మంత్రి కేటీ రామారావును కలిశారు. ఆ రాష్ట్రంలోని ఇబ్రహీంపట్నం, ములుగుల్లో యానిట్లను స్థాపిస్తామని, అక్కడి ప్రభుత్వం ఇస్తున్న సహకారం, ప్రోత్సాహంవల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు ప్రకటించారు.

నిజానికి పేజ్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ స్థాపన కోసం 2017లోనే ముందుకు వచ్చింది. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవసరమైన అనుమతులు, భూకేటాయింపుల ప్రక్రియ పూర్తయింది. రాప్తాడులో రాయితీలు కల్పిస్తూ 2017 నవంబర్‌ 2న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్‌ 24న అనంతపురం సమీపంలోని రాప్తాడు వద్ద పరిశ్రమ ఏర్పాటు కోసం 30 ఎకరాలను.. ఏపీఐఐసీ ద్వారా తాత్కాలికంగా కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

2018 ఫిబ్రవరి 26న 28.8 ఎకరాలను ఆ కంపెనీకి కేటాయిస్తూ ఏపీఐఐసీ ద్వారా ఉత్తర్వులు ఇచ్చింది. 129 కోట్లు పెట్టుబడి పెట్టి ఏటా 32.4 మిలియన్ల దుస్తులను తయారు చేసే కర్మాగారాన్ని, గిడ్డంగిని అక్కడ ఏర్పాటు చేయాలనేది కంపెనీ ప్రణాళిక. ఆ యూనిట్‌ ద్వారా 6,420 మందికి నేరుగా ఉపాధి లభిస్తుందని నాడు అంచనా వేశారు. జపాన్‌ నుంచి అధునాతన యంత్రాలను రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

3 దశల్లో కర్మాగారం నిర్మించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సివిల్‌ పనుల కోసం పేరుగాంచిన నిర్మాణ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. నిర్మాణ స్థలంలో పనులు చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లను సదరు నిర్మాణ సంస్థ ప్రారంభించింది. రాష్ట్రంలో 2019లో ఎన్నికలు జరిగి వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. అనంతపురం సమీపంలోని రాప్తాడు వద్ద పెట్టబోతున్న జాకీ కర్మాగారం ఆ పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధికి అవకాశంగా.. వనరుగా కనిపించింది.

తనకు ఎన్నికల్లో 20 కోట్లు ఖర్చయిందని.. అందులో సగం మీరు ఇవ్వాల్సిందేనని ఆ ప్రజాప్రతినిధి నుంచి కంపెనీ ప్రతినిధులకు బెదిరింపులు వెళ్లినట్లు తెలిసింది. అంతేకాదు.. కంపెనీకి సంబంధించిన సబ్‌ కాంట్రాక్టులన్నీ తాను ఎవరికి చెబితే వారికే ఇవ్వాలని.. ఉద్యోగాలు కూడా తాను చెప్పిన ప్రకారమే ఇవ్వాల్సి ఉంటుందని.. అందుకు భిన్నంగా జరిగితే ఊరుకోనని, పనులు జరగనివ్వనని ఆ ప్రజాప్రతినిధి హెచ్చరించినట్లు తెలిసింది.

రాష్ట్రంలో ముఖ్య నేతలకు సమాచారం ఇస్తే సదరు ప్రజాప్రతినిధిని నియంత్రిస్తారేమోనని కంపెనీ తరఫు వారు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అవి ఫలించకపోవడంతో గత్యంతరం లేని స్థితిలో మీ భూమిని మీరు వెనక్కి తీసుకుని మేం కట్టిన డబ్బులు మాకిచ్చేయండి.. మా దారి మేం చూసుకుంటామని చెప్పేసి వెళ్లిపోయారు. ఈ మేరకు కంపెనీ సెక్రటరీ సి.మురుగేశ్‌ 2019 డిసెంబర్‌ 3న రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు.

యువతరంలో జాకీ సంస్థ ఉత్పత్తులకు విశేషమైన ఆదరణ ఉంది. మార్కెట్‌లో ఈ సంస్థ షేరు విలువ ప్రస్తుతం 45 వేల రూపాయలకు పైగా ఉంది. సాధారణంగా దుస్తుల పరిశ్రమలు సంఖ్యాపరంగా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తాయి. పెద్దగా చదువుకోని గ్రామీణులకు.. అదీ మహిళలకు ఎక్కువ అవకాశాలుంటాయి. అందువల్ల ఇలాంటి పరిశ్రమ ఒకటి వస్తే పరిసర ప్రాంతాల్లోని ప్రజల జీవితాల్లో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయి. అభివృద్ధి జరుగుతుంది. ప్రస్తుతం పరిశ్రమ వెనక్కి వెళ్లిపోవడంతో ఈ ప్రాంత గ్రామీణ మహిళల ఉపాధికి గండిపడినట్లైంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.