ETV Bharat / state

ప్రకృతి పర్యాటకానికి నిధుల కొరత.. మూడేళ్లుగా మూసి ఉంచిన జంగిల్‌ క్యాంప్‌

author img

By

Published : Dec 29, 2022, 2:14 PM IST

Three Years Since Majidgadda Jungle Camp Was Closed
Three Years Since Majidgadda Jungle Camp Was Closed

పోటీ ప్రపంచం, ఒత్తిడి జీవితం నుంచి సేద తీరేందుకు ప్రజలు ప్రకృతి పర్యాటకంపై ఆసక్తి బాగా చూపిస్తున్నారు. ప్రైవేటు రిసార్టులు ఓ మాదిరి పచ్చదనం, ఈత కొలను, సాహస క్రీడల ఏర్పాట్లు, భోజనం వంటి సౌకర్యాలతోనే పర్యాటకులను పెద్దఎత్తున ఆకర్షిస్తున్నాయి. రుసుమూ భారీగా వసూలుచేస్తున్నాయి. అదే ఫారెస్టు అర్బన్‌ పార్కుల్లో అడుగుపడితే వేలాది చెట్లు, ధారాళంగా ప్రాణవాయువు, గుట్టలపై ట్రెక్కింగ్‌, వాచ్‌టవర్‌, కొన్నిచోట్ల సాహస క్రీడలు, వన్యప్రాణుల సందడి ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు ఉంటాయి. కానీ నిర్వహణ సమస్యలు పర్యాటకులను నిరుత్సాహపరుస్తున్నాయి.

తుక్కుగూడ ఓఆర్‌ఆర్‌కు దగ్గర్లోని మజీద్‌గడ్డ జంగిల్‌ క్యాంప్‌ను 2019 డిసెంబరులో ప్రారంభించారు. వందల ఎకరాల విస్తీర్ణం, పెద్ద సంఖ్యలో ఔషధ మొక్కలు, కిలోమీటర్ల కొద్దీ సైక్లింగ్‌ ట్రాక్‌, అడవిలో రాత్రి బస చేసేలా ఏర్పాట్లు కూడా చేశారు. దీనికి తొలిరోజుల్లో భారీ స్పందన వచ్చింది. కొద్దిరోజులకే కరోనా రావడంతో అటవీశాఖ మూసేసింది.

మూడేళ్లయినా ఇంకా తెరవలేదు. ఈలోగా సాహసక్రీడా పరికరాలు, సైకిళ్లు తుప్పుపట్టాయి. రాత్రి బసకు ఏసీ గదుల నిర్మాణం చేపట్టినా నిధుల సమస్యతో కొన్ని పూర్తికాలేదు. క్యాంటీన్‌ నిర్మాణమూ జరగలేదు. కొద్ది మొత్తంలో నిధులను కేటాయించి అందుబాటులోకి తీసుకువస్తే పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది.

అనంతగిరి హిల్స్‌లో: ప్రకృతి పర్యాటకం అభివృద్ధికి మంచి అవకాశం ఉన్న ప్రాంతాల్లో అనంతగిరి హిల్స్‌ ఒకటి. కానీ ఆ తరహా ప్రయత్నాలేవీ కనిపించడం లేదు. అక్కడున్న నాలుగు అటవీశాఖ కాటేజీల నిర్వహణ ఆధ్వానంగా ఉంది. కాటేజీలకు గడ్డితో పైకప్పు వేశారు. వర్షం కురిస్తే గడ్డి నుంచి వచ్చే వాసనతో అక్కడ ఉండేందుకు పర్యాటకులు ఆసక్తి చూపట్లేదు. కనీస భోజన ఏర్పాట్లు కూడా లేవు. దీంతో పర్యాటకాభివృద్ధి సంస్థ హోటల్‌కు లేదంటే ప్రైవేటు రిసార్టుకు వెళుతున్నారు.

వికారాబాద్‌ పక్కనే ఉన్న కోట్‌పల్లి జలాశయానికి పెద్దసంఖ్యలో పర్యాటకులు వెళతారు. అటవీ, పర్యాటకశాఖలు విడిగా లేదా సంయుక్తంగా బోటింగ్‌ నిర్వహిస్తే ఆయా శాఖలకు భారీగా ఆదాయం వచ్చేది. కానీ ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుండడంతో వచ్చే ఆదాయం ఆ సంస్థకే వెళుతోందని అటవీ అధికారులు చెబుతున్నారు. పర్యాటకులు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్‌ వ్యర్థాలు, మిగిలిన ఆహారపదార్థాలు వేస్తుండటంతో కుక్కల సంఖ్య పెరిగింది. జింకలపై దాడులు జరుగుతున్నాయి.

..

అక్కడ నిరుపయోగం: మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం పరికిబండలో 285 ఎకరాల్లో, మనోహరాబాద్‌లో 135 ఎకరాల్లో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కుల్ని ఏర్పాటుచేశారు. 2019లో నిర్మాణం మొదలుపెట్టారు. మొక్కలు నాటడం వంటి చిన్నచిన్న పనులున్నాయి. ఏడాదిగా పనులు ఆగాయి. దీంతో యోగా కేంద్రం, నడకదారి, వాచ్‌టవర్‌ నిరుపయోగంగా మారాయి. 44వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ పార్కుల పనులను పూర్తిచేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 200 ఎకరాల్లో అటవీప్రాంతంలో నాలుగేళ్ల క్రితం చేపట్టిన అర్బన్‌ ఫారెస్ట్‌కు నిధుల కొరత ఉంది. దీంతో నడక, సైకిల్‌ ట్రాక్‌లు, సాహసక్రీడల ఏర్పాట్లు చేయలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.