ETV Bharat / state

ఆన్​లైన్​లో వలపు వల.. చిక్కితే జీవితాలు విలవిల

author img

By

Published : Mar 14, 2023, 9:25 AM IST

Honey Trap Cases
Honey Trap Cases

Honey Trap Cases in Hyderabad : సోషల్ మీడియా వినియోగం పెరగటంతో అదే స్థాయిలో సైబర్‌ నేరాలూ పెరిగిపోతున్నాయి. కొందరు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహం పేరిట వల వేస్తున్నారు. ఆ తర్వాత నగ్నంగా వీడియో చాటింగ్‌ ఉచ్చులోకి దింపుతున్నారు. అనంతరం తాము డిమాండ్‌ చేసిన డబ్బులు ఇవ్వకపోతే.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ బాధితుల నుంచి దొరికినకాడికి దోచేస్తున్నారు.

Honey Trap Cases in Hyderabad : ఆకర్షణీయమైన ఫొటోలతో అందంగా ముగ్గులోకి దింపుతారు. నాలుగు ఆకట్టుకునే మాటలతో.. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు నిలువునా ముంచేస్తారు. ఒక్క బలహీన క్షణంలో చేసిన పొరపాటును.. బలమైన ఆయుధంలా మార్చుకుని అందినకాడికి దోచేస్తున్నారు. సోషల్ మీడియా, డేటింగ్‌ యాప్‌ల మాటున వలపు వల విసిరి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు.

ప్రశాంతంగా సాగుతున్న జీవితాలను ఒకే ఒక్క ఫోన్‌కాల్‌ తలకిందులు చేస్తోంది. సంతోషాన్ని మాయం చేసి మనోవేదనకు కారణమవుతుంది. ఇప్పటి వరకూ పురుషులు మాత్రమే బాధితులుగా కాగా.. తాజాగా మహిళలనూ ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. హైదరాబాద్​కు చెందిన ఓ 25 సంవత్సరాల వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి వివాహాం కోసం సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు వ్యక్తికి ఫేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయమైంది. ఆమెతో ఛాటింగ్‌ చేయడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే ఫోన్‌ నంబర్​ కూడా ఇచ్చాడు. కొద్దిరోజులకు వాట్సాప్‌ నంబర్‌కు నగ్నవీడియో కాల్‌ చేసింది. ఇతడు దాన్ని చూస్తున్నట్టు అటువైపు వీడియో తీశారు.

ఈ క్రమంలోనే ఊహించని ట్విస్ట్: ఈ క్రమంలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. వెంటనే వారు ఆ వ్యక్తిని రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాదంటే ఆ దృశ్యాలను స్నేహితులు, బంధువులకు పంపుతామంటూ బెదిరించారు. దీంతో బాధితుడు దాచుకున్న సొమ్ము నుంచి రూ.50వేలు ఇచ్చి బయటపడ్డాడు. మరోసారి రూ.లక్ష చెల్లించాడు. అయినా అక్కడినుంచి వేధింపులు తగ్గకపోవడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత సంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం వలపు వలతో డబ్బులు వసూలు చేస్తున్న సైబర్‌ నేరస్థులు పెరుగుతున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 60 నుంచి 70 రోజుల వ్యవధిలో.. 100కుపైగా ఫిర్యాదులు రావడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది.

సోషల్ మీడియాలే అస్త్రాలు: ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, డేటింగ్‌ యాప్స్‌.. ఇవే మాయగాళ్లకు అసలైన అస్త్రాలు. ఫ్రెండ్​షిప్​ పేరుతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపుతారు. ప్రొఫైల్‌లో అందమైన చిత్రాలు, ఉన్నత కొలువు చేస్తున్నట్టు నింపుతారు. తమ రిక్వెస్ట్​కు స్పందించగానే ఛాటింగ్‌ చేస్తారు. అనంతరం వారి సామాజిక హోదా, వయసు తదితర విషయాలను ధ్రువీకరణ చేసుకుంటున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటాక వాట్సాప్‌ ఫోన్‌కాల్‌ చేసి గంటల తరబడి మాట్లాడుతున్నారు. ట్రాప్​లో పడ్డట్టు నిర్దారణకు వచ్చాక ప్లాన్​ను అమలు చేస్తున్నారు.

వాట్సాప్‌లో నగ్న వీడియోకాల్‌ చేసి చూస్తున్నట్లు స్క్రీన్‌ రికార్డింగ్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నా 20వేల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకూ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకుంటారు. ఎదురుతిరిగితే సోషల్​మీడియాలో ఆ నగ్న వీడియోలను పెడుతున్నారు. అయినా వినకపోతే సెల్​ఫోన్​ జాబితాలోని మహిళలకు ఆ వీడియోలను పంపుతారు. మీ సోదరుడితో లేదా స్నేహితుడితో కలసి మీరు నగ్న వీడియోలు చూస్తున్నారంటూ.. మార్ఫింగ్‌ ఫొటోలతో పరువు తీస్తామంటున్నారు. సోషల్​ మీడియాలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్​షిప్ రిక్వెస్ట్​కు స్పందించవద్దని హైదరాబాద్​ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సూచించారు. కొత్తవారి వీడియో కాల్‌ స్వీకరించవద్దన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.