ETV Bharat / state

ఇష్టమొచ్చినట్లు చేస్తే హైకమాండ్​ చూస్తూ ఊరుకోదు.. నేతలకు డిగ్గీరాజా వార్నింగ్

author img

By

Published : Dec 22, 2022, 8:00 PM IST

Updated : Dec 22, 2022, 8:08 PM IST

high command to solve T congress dispute
high command to solve T congress dispute

T Congress Dispute : రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు రావాల్సిందిపోయి.. సీనియర్లు, జూనియర్లని పంచాయితీ పెట్టుకోవడం సరికాదని కాంగ్రెస్‌ నాయకులను సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ మందలించారు. గాంధీభవన్‌ వేదికగా అసంతృప్తితో ఉన్న నాయకులతో వేర్వేరుగా సమావేశమై చర్చించారు. పీసీసీ నిర్ణయాలు, తమ సమస్యలను రాష్ట్ర నేతలు ఏకరవు పెట్టారు. పార్టీ బలోపేతానికి ఏం చేస్తున్నారని ప్రశ్నించిన డిగ్గీరాజా.. ప్రతి విషయాన్ని అధిష్ఠానం గమనిస్తోందన్నారు. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే హైకమాండ్ చూస్తూ ఊరుకోదని దిగ్విజయ్‌సింగ్‌ హెచ్చరించారు.

T Congress Dispute : పీసీసీ జంబో కమిటీ ప్రకటన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో రేగిన చిచ్చును చల్లార్చేందుకు అధిష్ఠానం ఆదేశాలతో రంగంలోకి దిగిన సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌.. గాంధీభవన్‌ వేదికగా చర్చలు జరిపారు. అసంతృప్త నేతలు సహా పీసీసీ కమిటీకి రాజీనామా చేసిన వారితో విడివిడిగా సమావేశమయ్యారు. పార్టీలో పరిస్థితులు, నేతల వైఖరిపై సమాలోచనలు జరిపారు. భేదాభిప్రాయాలు ఎందుకు వచ్చాయనే కోణంలో దిగ్విజయ్‌ ఆరా తీశారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. దిగ్విజయ్‌ను కలిసి సమస్యలను వివరించారు. పీసీసీ ఏకపక్ష నిర్ణయాల వల్లే నాయకుల మధ్య విబేధాలు వచ్చాయని వీహెచ్‌ తెలిపారు. దిగ్విజయ్‌ సమస్యల్ని పరిష్కరిస్తారనే సీనియర్‌ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశం తర్వాత సీనియర్ల వైఖరిని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఖండించారు. ఒరిజినల్, వలసదారులు అన్న వాదన తెరపైకి రావడం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్‌లో త్వరలోనే సమస్యలన్నీ సర్దుకుంటాయని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. తమ రాజీనామాలను వెనక్కి తీసుకోలేదన్న ఆమె.. తామే నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలుగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో కోవర్టులు ఎవరూ లేరని సీనియర్‌ నేత జానారెడ్డి తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో సమస్యలు సర్దుకుంటాయని.. దిగ్విజయ్‌సింగ్‌ ఇరువర్గాల నేతలతో మాట్లాడినట్లు చెప్పారు.

గాంధీభవన్‌లో నాయకులతో చర్చలు జరిపిన దిగ్విజయ్ సింగ్.. వారిని మందలించారు. పార్టీలో జూనియర్, సీనియర్ అనే పంచాయతీ మంచిది కాదని హితవు పలికారు. సమస్యలుంటే అధిష్ఠానం దృష్టికి తీసుకు రావాలే గానీ.. మీడియా ముందు మాట్లాడడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ప్రశ్నల అజెండాతో తన వద్దకు వచ్చిన నేతల్ని దిగ్విజయ్‌సింగ్‌ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ను ఓడించడానికి మీ దగ్గర ఉన్న వ్యుహమేంటని అడిగారు. పార్టీ బలోపేతానికి మీ పాత్రేంటి.. ఏం చేస్తున్నారని నిలదీశారు. అంతర్గత సమస్యపై అభిప్రాయాలు చెప్పాలని కోరారు. ఎవరేం పని చేస్తున్నారో అధిష్ఠానం గమనిస్తుందని.. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే హైకమాండ్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
ఇవీ చదవండి:

Last Updated :Dec 22, 2022, 8:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.