ETV Bharat / state

ఏకధాటిగా కురుస్తున్న వానలకు స్తంభించిన జనజీవనం

author img

By

Published : Oct 11, 2020, 8:03 PM IST

heavy rains in telangana state
ఏకధాటిగా కురుస్తున్న వానలకు స్తంభించిన జనజీవనం

అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించింది. భాగ్యనగరంలోని పాతబస్తీలోని హుస్సేనీ ఆలంలో రేకుల ఇల్లు కూలి.. ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. వరుణుడి ప్రతాపానికి పలుచోట్ల చేతికొచ్చిన పత్తి, వరి పంటలు నేలమట్టం అయ్యాయి.

అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లో కుండపోతగా వానలు పడుతున్నాయి. పాతబస్తీ హుస్సేనీ ఆలంలో భారీ వర్షం ధాటికి రేకుల ఇల్లు కూలి ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూకట్‌పల్లి, హైదర్​నగర్, ఆల్విన్ కాలనీ, మూసాపేట్‌, నిజాంపేట్‌ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రజలు అవస్థలు పడ్డారు. ధరణినగర్‌లో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి చెరువును తలపిస్తోంది. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలోనూ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌ వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి బల్దియా యంత్రాంగం అప్రమత్తమైంది. జీహెచ్​ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశాలతో మాన్సూన్, డీఆర్​ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.

జిల్లాల్లోనూ వరుణ ప్రతాపం

జిల్లాల్లోనూ అల్పపీడనం వల్ల వరుణ ప్రతాపం కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించిన పండించిన పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల్లో కోత దశలో ఉన్న వరి పైరు నేలకూలిపోయింది. కంకులు తేలిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. తడిచిన వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నదాతలు అర్థిస్తున్నారు.

అందకుండా పోయింది..

జోరు వర్షానికి కామారెడ్డిలో ప్రధాన రహదారుల్లోకి భారీగా వరదనీరు చేరి జనం అవస్థలు పడ్డారు. బీబీపేట్, భిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, తాడ్వాయి మండలాల్లో వానలకు కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని కోరుతున్నారు. కామారెడ్డి మార్కెట్ యార్డు ఆవరణలో ఎండబోసిన మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. చేతికి వచ్చిన పంట నీటి పాలు కావడంపై కర్షకులు ఆందోళన చెందుతున్నారు.

ఏకధాటిగా కురుస్తున్న వానలకు స్తంభించిన జనజీవనం

తాడు సాయంతో కాపాడారు..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగర్​కర్నూల్ జిల్లా నల్లమలలోని ముక్కిడిగుండం, నార్లాపూర్ ఉడుముల వాగు, పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రవాహ ఉద్ధృతికి ముక్కిడిగుండం వంతెనపై నుంచి రైతులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ వాగులో కొట్టుకుపోయింది. స్థానికులు తాడు సాయంతో సాగుదారులను కాపాడారు. జేసీబీతో ట్రాక్టర్ లాగుతున్న క్రమంలో నీటిలో పడిపోయింది. వర్షాకాలం వచ్చిందంటే వాగు దాటడానికి ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: రెండ్రోజులు వానలున్నాయ్​.. అప్రమత్తంగా ఉండండి : కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.