ETV Bharat / state

జోరుగా కోడి పందేలు.. బౌన్సర్లతో రక్షణ.. బహుమతులుగా బుల్లెట్ బండ్లు, స్కూటీలు

author img

By

Published : Jan 14, 2023, 2:45 PM IST

Cockfight in AP
కోడి పందేలు

Cockfight in AP: ఏపీలో సంక్రాంతి సంబురాలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంతో గడుపుతున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మిగిలిన ప్రముఖులు అంతా వారి కుటుంబాలతో కలిసి పండుగను ఆస్వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కోడి పందేల రాయళ్ల చేతుల్లో రూ.వందల కోట్లు మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Cock Fight In AP: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి కోలాహలంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో.. మొదటి రోజైన భోగి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులంతా వారి వారి కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కోడి పందేల నిర్వాహకులు పందెం రాయుళ్లను ఆకర్షించటం కోసం రూ.వందల కోట్లకు తెర తీశారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో నిర్వాహకులు ఇష్టారీతిగా కోడిపందేలను నిర్వహిస్తున్నారు. ఈ తతంగాన్ని చూస్తున్న అధికార యంత్రాంగం చూసీచూడనట్లుగా వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

25 ఎకరాల్లో కోడిపందేల బరులు: ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఊరూరా బరులు కొలువుదీరాయి. అధికార వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ బరులను ఏర్పాటు చేశారు. ప్రధానంగా బాపులపాడు మండలం అంపాపురంలో సుమారు 25 ఎకరాల్లో కోడిపందేలు, జూద, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన బరులను ఏర్పాటు చేసి, పందెం రాయుళ్లకు తగిన వసతులు కల్పిస్తున్నారు. శేరినరసన్నపాలెం, కొత్తపల్లి, వేలేరు, గోపవరపుగూడెం, చిన్నఅవుటపల్లి, తెంపల్లి, బీబీగూడెం, ముస్తాబాద, అంబాపురంలో వెయ్యి నుంచి 2వేల మందితో కూడిన కోడిపందేల శిబిరాలను నిర్వహిస్తున్నారు. సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతికి కోడిపందేలు, పేకాట శరామాములే అంటూ పోలీసులు సైతం చూసీ చూడనట్లు ఉండటంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా బరుల్లో పందెం రాయుళ్ల నుంచి రూ.కోట్లు చేతులు మారుతుండటం సంచలనంగా మారింది. మరో రెండు రోజుల పాటు ఈ బరులు కొనసాగనుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బరుల వద్ద బౌన్సర్లతో రక్షణ: మరో పక్క ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలంలో కోడిపందేలు అట్టహాసంగా జరుగుతున్నాయి. నిర్వాహకులు కత్తులు కట్టి కోళ్లను బరిలోకి దించుతున్నారు. అంతేకాదు కోడిపందేల బరుల వద్ద బౌన్సర్లతో రక్షణ కల్పిస్తున్నారు. జాలిపూడి, చాటపర్రులో జోరుగా గుండాట, నిడమర్రు, మందలపర్రులో నిర్వాహకులు.. డిజిటల్ స్క్రీన్లలో లైవ్ పెట్టి మరీ కోడిపందేలను నిర్వహిస్తున్నారు. దీంతో పందేలను వీక్షించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. మరికొన్ని చోట్ల సంక్రాంతి సంబురాల పేరుతో బోర్డులు పెట్టి, లోపల మాత్రం కోడిపందేలను నిర్వహిస్తున్నారు.

బహుమతులుగా బుల్లెట్ బండ్లు, స్కూటీలు: పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు ఈసారి బరుల నిర్వాహకులు.. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో కోడి పందేలు ఆడేవారికి బహుమతులుగా బుల్లెట్ బండ్లు, స్కూటీలను ఆఫర్లుగా ప్రకటించారు. రూ.2 లక్షల విలువైన కోడిపందేలను వరుసగా ఐదుసార్లు ఆడితే రూ.1.75 లక్షల విలువైన బుల్లెట్ బండిని, రూ.లక్ష విలువైన పందేలు వరుసగా ఐదుసార్లు ఆడితే స్కూటీని బహుమతులుగా అందిస్తామని ప్రకటించారు. అంతేకాదు, వాటిని బరుల వద్దే ప్రదర్శనకు ఉంచి పందెం రాయుళ్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ తతంగాన్ని అంతా చూస్తున్న పోలీసులు.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.