ETV Bharat / state

'లక్ష రూపాయల రుణమాఫీపై ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలి'

author img

By

Published : Jun 17, 2021, 9:29 PM IST

bjp kisan morcha fire on government
'లక్ష రూపాయల రుణమాఫీపై ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలి'

రైతులకు లక్ష రూపాయల రుణమాఫీపై తక్షణమే ప్రభుత్వం ఓ ప్రకటన చేయాలని భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములు విషయంలో కంచె చేను మేసినట్టు ఉందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ భూముల విషయంలో ప్రభుత్వం వ్యవహారశైలి చూస్తే... కంచె చేను మేసినట్టు ఉందని భాజపా కిసాన్ మోర్చా(BJP Kisan Morcha) రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో భాజపా కేంద్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా ఇంఛార్జి ప్రేమేందర్ రెడ్డితో కలిసి చర్చించారు. ఎస్సీలకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సర్కారు... భూములు లేవంటూ ఇప్పుడు అమ్మకానికి ఎలా పెడుతుందంటూ ప్రశ్నించారు.

విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తామన్న హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. నాసిరకం విత్తనాలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. 'ధరణి' పెద్ద తల నొప్పిగా మారడమే కాకుండా... వివాదాలు పెరిగి... రైతులు తహసీల్దార్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కొవిడ్ సాకుగా చూపి.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం వాయిదా వేసిన ప్రభుత్వం... ఇప్పటివరకు వానాకాలం వార్షిక రుణ ప్రణాళిక ప్రకటించలేదని తప్పుబట్టారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి 5 వేల రూపాయలు ఇస్తే సరిపోదన్న శ్రీధర్‌రెడ్డి... లక్ష రూపాయల రుణమాఫీపై తక్షణమే ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 22న జిల్లా కలెక్టర్లకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు.

ఇదీ చూడండి:BB Patil: నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు: ఎంపీ బీబీ పాటిల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.