ETV Bharat / state

ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి ప్రయత్నం - గులాబీతోటలో కమల వికాసమే లక్ష్యంగా బీజేపీ ప్రచారం

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 8:25 AM IST

BJP Election Campaign In Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ.. చివరి రోజైన నేడు జోరుగా ప్రచారం చేయనుంది. ప్రధాని మోదీ, అమిత్‌షా ప్రచారం పూర్తికాగా.. బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు.. ఇవాళ నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ప్రచారం ముగియగానే కీలకమైన పోల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియపైనా కాషాయదళం దృష్టిపెట్టింది.

PM Modi Telangana Election Campaign
Bjp National Leaders Election Campaign In Telangana

గులాబీతోటలో కమల వికాసమే లక్ష్యంగా బీజేపీ ప్రచారం

BJP Election Campaign In Telangana 2023 : గులాబీ తోటలో కమల వికాసమే లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం.. ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పార్టీ అగ్రనేతలతో విస్తృత ప్రచారం చేయించింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే పాలమూరు, నిజామాబాద్‌ సభల వేదికగా శంఖారావం పూరించిన మోదీ.. ఆ తర్వాత సైతం ప్రత్యేక శ్రద్ధతో ప్రచారం చేశారు. షెడ్యూల్ వెలువడిన తర్వాత వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు రాష్ట్రానికి వచ్చారు.

PM Modi Telangana Election Campaign 2023 : ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీసీల ఆత్మ గౌరవ సభ, సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మాదిగ ఉప కులాల విశ్వరూప మహా సభకు హాజరయ్యారు. తాజాగా మూడు రోజులపాటు రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. కామారెడ్డి, మహేశ్వరం, తుప్రాన్‌, నిర్మల్, మహబూబ్‌బాద్‌, కరీంనగర్ సభలకు హాజరు కావడంతోపాటు.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సైతం నాలుగు రోజులపాటు రాష్ట్రంలోనే ఉండి ప్రచారం చేయడంతోపాటు.. రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.

రాహుల్ గాంధీకి దమ్ముంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని నిరూపించాలి : కిషన్ రెడ్డి

BJP National Leaders Election Campaign Telangana 2023 : ఇవాళ సాయంత్రం ఐదింటితో ప్రచారం ముగియనుండటంతో.. చివరి రోజు జోరుగా ఓటర్లను కలవాలని బీజేపీ భావిస్తోంది. అగ్రనేతలు, కేంద్రమంత్రులు కమలం అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. వరంగల్‌ పశ్చిమ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి, నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తాకు దన్నుగా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రచారం చేయనున్నారు. సంగారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి పులిమామిడి రాజుకి మద్దతుగా కేంద్రమంత్రి భగవత్ ఖరద్, దేవరకొండ, పాలకుర్తి, నర్సంపేట బీజేపీ అభ్యర్థుల తరపున మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విస్తృత ప్రచారం చేయనున్నారు.

Telangana Assembly Elections : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఆదిలాబాద్ అభ్యర్థి పాయల శంకర్, ధర్మపురి అభ్యర్థి ఎస్.కుమార్‌కి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ప్రచారపర్వం నేటితో పరిసమాప్తి కానుండటంతో.. పోల్‌ మేనేజ్‌మెంట్‌పై భారతీయ జనతా పార్టీ దృష్టిసారించింది. ఈ దిశగా రాష్ట్ర నాయకత్వతానికి అధిష్ఠానం దిశానిర్దేశం చేసింది. ఒక్కో కార్యకర్త వంద మంది ఓటర్లను కలిసేలా పనిచేయాలని స్పష్టంచేసింది. తటస్థ ఓటర్లను బీజేపీ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. బీజేపీ పట్టున్న పట్టణ ప్రాంతాలతోపాటు, ఈసారి గ్రామీణ ప్రాంతాల్లోనూ సత్తా చాటేలా పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేయనున్నారు. యువత, నిరుద్యోగుల ఓట్లు తమకే పడతాయని బీజేపీ భావిస్తోంది.

అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్షాల జోరు - ప్రచారంలో హోరెత్తిస్తున్న బీజేపీ జాతీయ నేతలు

తుది ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం - పార్టీ గుర్తును చూపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్న నేతలు

అంధవిశ్వాసాలను నమ్మే సీఎం మనకు అవసరమా - తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది : ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.