ETV Bharat / state

TS Intermediate exams: రేపటి నుంచే ఇంటర్​ పరీక్షలు.. పకడ్బందీగా ఏర్పాట్లు

author img

By

Published : Oct 24, 2021, 11:32 AM IST

TS Intermediate exams: రేపటి నుంచే ఇంటర్​ పరీక్షలు.. పకడ్బందీగా ఏర్పాట్లు
TS Intermediate exams: రేపటి నుంచే ఇంటర్​ పరీక్షలు.. పకడ్బందీగా ఏర్పాట్లు

ఈనెల 25 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ప్రకటించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బోర్డు కార్యాలయంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. గతేడాది కొవిడ్ కారణంగా పరీక్షల నిర్వహణ జరగలేదని.. ఈసారి కోర్టు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నామని జలీల్ తెలిపారు. వచ్చే ఏడాది కొవిడ్ కారణంగా పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోతే.. ఇప్పడు రాసిన ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే ప్రామాణికంగా రెండో ఏడాదికి ఉత్తీర్ణత చేయాల్సి ఉంటుందని.. కావున విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలు రాయాలని సూచించారు.

ఇంటర్మీడియట్ పరీక్షలను ఈ సారి పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల అధికారి అబ్దుల్ ఖాలిక్, ఓఎస్డీ సుశీల్ కుమార్, సంయుక్త కార్యదర్శులు భీమ్ సింగ్, శ్రీనివాస్ తదితరులతో కలిసి జలీల్ శనివారం విలేకర్లతో మాట్లాడారు. ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని.. విద్యార్థులు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలని అధికారులు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4 లక్షల 59 వేల మంది ఇంటర్ విద్యార్థులు ఉండగా.. వారికోసం కొవిడ్ భద్రతా చర్యల దృష్ట్యా ఈసారి పరీక్ష కేంద్రాలు పెంచామన్నారు. మొత్తం 1768 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. ఈసారి 70 శాతం సిలబస్​తో పరీక్ష నిర్వహిస్తున్నందున.. ఆ సిలబస్​కు పరిమితమయ్యే పరీక్ష ఉంటుందని, అదేవిధంగా ఈనెల 31న ఆదివారం రోజున సైతం పరీక్ష ఉంటుందని ఈ విషయాలు విద్యార్థులు గమనించాలని కోరారు.

పరీక్షలు జరపాల్సిన అనివార్య పరిస్థితి

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో తప్పితే కనీస మార్కులతో ఉత్తీర్ణులను చేయమని, మళ్లీ వారు మార్చి/ఏప్రిల్​లో పరీక్షలు రాసి పాస్ కావాల్సిందేనని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చించి వీలుంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ తరహాలో మరోసారి పరీక్షలు జరిపేందుకు ఆలోచిస్తామని తెలిపారు. ఒకవేళ కరోనా కారణంగా వచ్చే మార్చి, ఏప్రిల్​లో పరీక్షలు నిర్వహించడానికి వీల్లేని పరిస్థితులు తలెత్తితే తొలి ఏడాది పరీక్షల్లో వచ్చిన మార్కులనే ప్రామాణికంగా తీసుకొని రెండో ఏడాదికి కేటాయించి ఉత్తీర్ణులను చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే పరీక్షలు జరపాల్సిన అనివార్య పరిస్థితి ఉందని, ప్రతి విద్యార్థి తప్పకుండా రాయాలని సూచించారు. హాల్ టికెట్​పై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని విద్యార్థులు తమ ఇంటి నుంచి వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

పాజిటివ్​ ఉన్నవారికి అనుమతి లేదు

ఇంటర్ తొలి ఏడాది చదివిన కళాశాల ఉన్న జోన్ పరిధిలోనే పరీక్షా కేంద్రాలు కేటాయించామని అధికారులు తెలిపారు. రెండో ఏడాదిలో మరో కళాశాలకు మారినా.. ప్రథమ సంవత్సరం చదివిన కళాశాల ప్రాంతంలోనే పరీక్ష రాయాలన్నారు. ఒక్కో కేంద్రంలో రెండు ఐసోలేషన్ గదులు ఉంటాయి. జ్వరం, జలుబు ఉన్నవారు అక్కడ పరీక్ష రాస్తారు. పాజిటివ్ ఉన్నవారిని అనుమతించటం వీలుకాదన్నారు. విద్యార్థులు పరీక్షల సన్నద్ధత కోసం బేసిక్ లెర్నింగ్ మెటీరియల్ అందుబాటులో ఉందని.. ఇంటర్మీడియట్ యూట్యూబ్ ఛానల్, వెబ్​సైట్ నుంచి డౌన్​లోడ్ చేసుకొని చదువుకోవచ్చని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష పేపర్లలోనూ ఎక్కువ ఆప్షన్లు పొందుపరిచామని.. విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు లోనుకాకుండా తప్పకుండా హాజరై ధైర్యంగా పరీక్షలు రాయాలని ఆయన కోరారు. నవంబరు తొలివారంలో జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమవుతుందన్నారు. దాదాపు 400 ప్రైవేటు జూనియర్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఈ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేస్తామని జలీల్ తెలిపారు.

ఇదీ చదవండి: Inter 1st year exams 2021: 'ధైర్యంగా ఉండండి... ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.