ETV Bharat / state

నిమజ్జనంపై గందరగోళం వద్దు.. ట్యాంక్​బండ్​పై ఏర్పాట్లు జరుగుతున్నాయన్న తలసాని

author img

By

Published : Sep 7, 2022, 4:51 PM IST

Ganesha immersion
Ganesha immersion

Ganesh immersion on Tank Band: వినాయక నిమజ్జనానికి సంబంధించి ప్రజలను గందరగోళానికి గురి చేయటం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. హుస్సేన్‌ సాగర్‌ వద్ద ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు. పండుగలను రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమో ఆత్మ పరిశీలన చేసుకోవాలని తలసాని వ్యాఖ్యానించారు. వాళ్లే హిందువులయితే తామెవరిమి అని ప్రశ్నించారు.

Ganesh immersion on Tank Band: దేశంలో ఎక్కడా ఇంత పెద్దగా వినాయక చవితి ఏర్పాట్లు చేయడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ అన్నారు. గణేశ్​ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి తలసాని ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 1 నుంచి బయలుదేరి ట్యాంక్‌బండ్‌ వరకు వెళ్లి పరిశీలించారు. నిమజ్జనం కోసం జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు.

శానిటేషన్‌, హార్టీకల్చర్‌, ఎంటమాలజీ, విద్యుత్‌, ఆర్‌ ఆండ్ బీ, వాటర్‌ వర్క్స్‌, ఆరోగ్యశాఖతోపాటు ట్రాఫిక్ పోలీసులు అందరూ సిద్దంగా ఉన్నారని మంత్రి వివరించారు. గణేశ్​ నిమజ్జనం కోసం ఇన్ని ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ ర్యాలీలు, దీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. వినాయకులను ఎవరూ ఆపడంలేదని మంత్రి స్పష్టం చేశారు. వాళ్లే హిందువులయితే తామెవరిమి అని తలసాని ప్రశ్నించారు.

ఇప్పటికే మట్టి విగ్రహాల కోసం ఎన్టీఆర్‌మార్గ్‌లో 8, నెక్లెస్‌రోడ్డులో 4 క్రేన్లను హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఏర్పాటు చేసింది. ట్యాంక్‌బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా ట్యాంక్‌బండ్‌పైనా నిమజ్జనాలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ట్యాంక్‌బండ్‌పై 10 క్రేన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ఈ రోజు ఉదయం గణేశ్‌ నిమజ్జనం విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్‌లో పలుచోట్ల హిందూ సంఘాలు నిరసన చేపట్టాయి. భాగ్యనగర్ గణేశ్​ ఉత్సవ సమితి, భాజపా, విశ్వహిందూ పరిషత్ సంయుక్తంగా ఎంజే మార్కెట్‌ కూడలి వద్ద అందోళనకు దిగాయి. ఏటా జరుపుతున్నట్లుగానే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేశాయి. కూకట్‌పల్లి వై కూడలి వద్ద బజరంగ్‌దళ్‌, వీహెచ్​పీ నాయకులు ఆందోళన చేపట్టారు. వినాయకుని నిమజ్జనానికి కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. హుస్సేన్ సాగర్​లో గణేశ్‌ నిమజ్జనానికి అనుమతించాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.