ETV Bharat / state

అరాచకానికి పరాకాష్ఠ.. వివాదాస్పద అధికారిగా ఆ డీఎస్పీ...!

author img

By

Published : Nov 14, 2022, 12:32 PM IST

Tadipatri DSP Chaitanya
Tadipatri DSP Chaitanya

Tadipatri DSP Chaitanya: ఆయన పేరు వీఎన్​కే చైతన్య. ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ డీఎస్పీ. పోలీసు అధికారిగా కంటే అధికార వైకాపా పార్టీకి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కొమ్ముకాసే కార్యకర్తగానే ఆయన ప్రజల్లో ఎక్కువ గుర్తింపు పొందారు. ఆయన పేరు చెబితే చాలు 'అరాచకానికి పరాకాష్ఠ' అనే మాటే వినిపిస్తుంది. వైకాపా నాయకుల వల్ల తమకు అన్యాయం జరిగిందని, వారు దాడి చేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే, వారిపైనే రివర్స్ కేసులు పెట్టటం, సంబంధం లేని కేసుల్లో ఇరికించటం వంటివి చేస్తున్నారన్న విమర్శలున్నాయి. వైకాపా నాయకులు ఫిర్యాదు చేస్తే రెండో ఆలోచనే లేకుండా వారిని పోలీసు స్టేషన్‌కు పిలిచి చిత్రహింసలకు గురిచేస్తారని, బాధితులు వాపోతున్నారు.

అరాచకానికి పరాకాష్ఠ.. వివాదాస్పద అధికారిగా డీఎస్పీ...!

Tadipatri DSP Chaitanya: ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చైతన్య 2018 బ్యాచ్ గ్రూపు-1 అధికారి. డీఎస్పీగా తొలి పోస్టింగు తాడిపత్రిలోనే. అక్కడ బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది అక్టోబరు 17 నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ రెండేళ్లలో ఆయన వ్యవహారశైలి తీవ్ర విమర్శలపాలైంది. రాష్ట్రంలోనే అత్యంత వివాదాస్పద అధికారిగా ఆయన్ను నిలబెట్టింది.

వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పిందే చట్టం అన్నట్లుగా పని చేస్తూ తాడిపత్రి సబ్‌డివిజన్ పరిధిలో, ఆయన ఎజెండానే అమలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యాడికి మండలం కోనుప్పలపాడులో తెదేపా మద్దతుదారైన యానిమేటర్‌ను ఉద్యోగం నుంచి తొలగించడంతో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య వివాదం నెలకొంది.

వైకాపా నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెదేపా వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తెదేపా వారిచ్చిన ఫిర్యాదు మాత్రం తీసుకోనేలేదు. ఈ కేసులో తెదేపా మద్దతుదారులైన రామాంజనేయులు, రాజు, సింహాద్రి, నాగార్జున, శివ, రాజాలను విచారణ పేరిట యాడికి పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లారు. డీఎస్పీ చైతన్య తమను విచక్షణారహితంగా కొట్టారని, చేతి వేళ్లపై లారీలతో కొట్టడంతో ఎముకలు విరిగిపోయాయని బాధితులు వాపోయారు.

కాళ్లూ, చేతులపై దెబ్బలను అప్పట్లో వారు మీడియాకు చూపించారు. తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి, ఈ ఏడాది జూన్ 11న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తెదేపా కౌన్సిలర్.. కొత్తపల్లి మల్లికార్జునపై దాడి చేశారు. ఈ ఘటనపై మల్లికార్జున వీడియోలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా సరే హర్షవర్ధన్‌ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదు.

డీఎస్సీ చైతన్య విచారణ పేరిట పిలిపించి ఎమ్మెల్యే కుమారుడిపైనే కేసు పెట్టమంటావా అంటూ తనను తీవ్రంగా కొట్టారని మల్లికార్జున వాపోయారు. డీఎస్పీ తీరుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనపై ప్రైవేటు కేసు వేశారు. ఇది జరిగిన వెంటనే వైకాపా నాయకులు మల్లికార్జునపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనల్లో వైకాపా నాయకులపై ఎలాంటి చర్యలు లేవు.

తాడిపత్రికి చెందిన కాంట్రాక్టర్ మల్లికార్జునరెడ్డిపై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్దన్‌రెడ్డి కొన్నాళ్ల కిందట దాడిచేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసునమోదు చేయలేదు. పైగా విచారణ పేరుతో డీఎస్పీ చైతన్య చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ బాధితుడు మల్లికార్జునరెడ్డి ఆయనపై న్యాయస్థానంలో ప్రైవేటు కేసు దాఖలు చేశారు.

ఆ తరువాత మల్లికార్జునరెడ్డి తండ్రి కనిపించకుండా పోయారు. దీనిపై యల్లనూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఐతే ఆయన హత్యకు గురయ్యాడని, ఆ నేరాన్ని అంగీకరించాలంటూ.. మల్లికార్జునరెడ్డి సమీప బంధువులైన రఘురామంజులురెడ్డి, మహేంద్రరెడ్డిలను.. చిత్రహింసలకు గురిచేశారు. దారిలో అడ్డగించి, తాడిపత్రి డీఎస్పీ చితకబాది, కరెంట్ షాకు ఇచ్చి వేదించారని రఘురామంజులరెడ్డి ఆరోపించారు.

డీఎస్పీ చైతన్యపై మల్లికార్జునరెడ్డి దాఖలు చేసిన ప్రైవేటు కేసు ఫిర్యాదుపై ఈ నెల 17న విచారణ ఉందని, అందుకే మమ్మల్ని హింసించారని రఘురామంజులరెడ్డి వాపోయారు. మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి గతేడాది వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి చొరబడ్డారు. ఆ సమయంలో ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో లేరు. ఆయన కుర్చీలో పెద్దారెడ్డి కూర్చున్నారు. ఆ తరువాత పరిణామాల్లో ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా నాయకులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనల్లో బాధ్యులైన వారిపై ఇప్పటికీ చర్యలు లేవు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.