ETV Bharat / sports

Neeraj Chopra: ఫోన్ పక్కన పెట్టా.. స్వీట్లు మానేశా

author img

By

Published : Aug 22, 2021, 7:46 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో అదరగొట్టిన నీరజ్ చోప్డా.. 100 ఏళ్ల కలను సాకారం చేశాడు. ప్రస్తుతం ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్న అతడికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల్ని తెలుసుకుందాం.

Olympics medalist Neeraj chopra
నీరజ్ చోప్డా

ఒక్క ఒలింపిక్‌ స్వర్ణంతో వంద కోట్లమంది హృదయాలకు చేరువయ్యాడు జావెలిన్‌ ఆటగాడు నీరజ్‌ చోప్డా. అతడి విజయం భారతీయ క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. దీనికోసం అలుపెరగని ప్రయత్నం చేసిన ఈ యువకెరటంలోని ఆటగాణ్నీ, సామాన్యుణ్నీ ఓసారి పలకరిద్దామా!

అందరి ప్రోత్సాహం...

నాన్న సతీశ్ కుమార్‌. అమ్మ సరోజ్‌ బాల. పానిపట్‌ దగ్గర్లోని ఖాంద్రా మా సొంతూరు. బరువు ఎక్కువగా ఉన్నానని చిన్నపుడు బాబాయి భీమ్‌సేన్‌ నన్ను జిమ్‌లో చేర్పించారు. అక్కణ్నుంచి స్నేహితులతో గ్రౌండ్‌లో అడుగుపెట్టి జావెలిన్‌ పట్టుకున్నా. మాది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో 17 మంది ఉంటారు. వ్యవసాయమే ఆధారం. అలాంటి పరిస్థితుల్లోనూ నాకు పోషకాహారం అందించడానికి అదనంగా ఖర్చుచేశారు. అయితే ఆ అనుభవాలే లక్ష్యం మీద మరింతగా దృష్టిపెట్టేలా స్ఫూర్తినిచ్చేవి. కొన్నేళ్లుగా ఇంటికి ఏడాదిలో ఒకట్రెండు సార్లే వెళ్తున్నా. ఇంట్లో ఉన్నన్ని రోజులూ పండగ రోజులే. ఈసారి ఒలింపిక్‌ పతకంతో రాఖీ సంబరాలు ముందే మొదలయ్యాయి.

Neeraj chopra
అమ్మనాన్నతో నీరజ్ చోప్డా

పోటీలోనే బెస్ట్‌...

జావెలిన్‌ క్రీడాకారుడికి బలంతో పాటు ఫ్లెక్సిబిలిటీ, వేగం ఉండాలి. ఈటె విసిరినపుడు భుజాన్నీ, మోచేయినీ ఎక్కువగా ఉపయోగిస్తాను. నా వ్యాయామాలు వీటి దృఢత్వాన్ని పెంచేలా ఉంటాయి. కొన్నిసార్లు గాయాలూ అవుతాయి. ప్రాక్టీసు ఎక్కువ, తక్కువ కాకుండా చూసుకోవాలి. వీటితోపాటు రన్నింగ్‌, జంప్స్‌, బరువులు ఎత్తడం చేస్తా. యోగా ధ్యానం కూడా చేస్తాను. శిక్షణ సమయంలోనే పోటీకి అన్ని విధాలా సిద్ధమవుతా. పోటీ అనేసరికి ఇంకా ఉత్సాహం వస్తుంది. చాలాసార్లు నా బెస్ట్‌ పోటీల్లోనే నమోదవుతుంది.

Olympics medalist Neeraj chopra
నీరజ్ చోప్డా

జులపాలు ఇష్టం...

జట్టు పెద్దగా పెంచుకోవడం ఇష్టం. ఐరోపా దేశాల్లో చల్లని వాతావరణం ఉంటుంది. అక్కడే ఎక్కువగా ప్రాక్టీసు చేస్తా, టోర్నీలకు వెళ్తా కాబట్టి ఇబ్బంది ఉండదు. కానీ వేడి ఎక్కువగా ఉండే దేశాల్లో చెమటలు పట్టి చిరాగ్గా అనిపిస్తుంది. అందుకే ఒలింపిక్స్‌ సమయంలో జుట్టు కత్తిరించుకున్నా. ఆటగాడిగా ఉన్నంతసేపే జుట్టు పెంచుకుంటా. డ్యూటీమీద యూనిఫామ్‌ వేసుకుంటే మాత్రం ఆర్మీ కట్‌ చేసుకుంటా.

Neeraj chopra
నీరజ్ చోప్డా

షాపింగ్‌ చేస్తా

చిన్నపుడు బాస్కెట్‌ బాల్‌ ఆడుతూ కింద పడ్డాను మణికట్టు దగ్గర దెబ్బ తగిలింది. 40 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. కానీ 20 రోజులకే ఆటలాడటం మొదలుపెట్టా. కానీ ఇప్పుడలా చేయలేను. కొన్నిసార్లు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గాయం తిరగబెడితే ఇంకా ప్రమాదం. ఆ సమయంలో చిన్నచిన్న వ్యాయామాలు చేస్తా. షాపింగ్‌కు వెళ్లి టైమ్‌పాస్‌ చేస్తా. కానీ ఇకమీదట అది వీలుపడదనుకుంటా. బైకుమీద షికార్లు చేయడమూ ఇష్టం.

అనుభవజ్ఞుల సమక్షంలోనే...

జావెలిన్‌కు బలంకంటే టెక్నిక్‌ ముఖ్యం. కాబట్టి మొదటిసారి జావెలిన్‌ ప్రాక్టీసు మొదలుపెట్టినపుడే సీనియర్లూ, లేదంటే కోచ్‌ సలహాలు తీసుకోవాలి. జావెలిన్‌ను పొరపాటుగా పట్టుకోవడం అలవాటైతే, తర్వాత దాన్ని మార్చుకోవడం కష్టం.

Neeraj chopra
నీరజ్ చోప్డా

ఇంగ్లిష్‌ అర్థం కాకపోయినా...

విశ్రాంతి కోసం పాటలు వింటుంటా. హరియాణ్వీ, పంజాబీ పాటలు ఎక్కువగా వింటా. ఈ మధ్యనే ఇంగ్లిష్‌ పాటల్నీ వింటున్నా. థండర్‌-బిలీవర్‌ లాంటి పాటల సాహిత్యం అర్థం కాదుగానీ, సంగీతం నచ్చి వింటుంటా.

ఫోన్‌కు దూరంగా...

ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నపుడు సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్నా. ఇతరులతో మాట్లాడేకొద్దీ పతకం తేవాలనే మాటలు పదే పదే వినిపించి ఒత్తిడికి గురిచేస్తాయి. అందుకే ఒలింపిక్స్‌ పదిహేను రోజులూ ఫోన్‌ పక్కన పడేసి పూర్తిగా శిక్షణమీదా, వ్యూహాలమీదా దృష్టిపెట్టా. మన క్రికెట్‌ టీమ్‌ ఆస్ట్రేలియా పర్యటనలో బయో బబుల్‌ లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆడి చారిత్రక విజయం సాధించింది. అది చూశాక పరిస్థితులు ఎలా ఉన్నా మనసుని దృఢంగా ఉంచుకోవాలనుకున్నా.

neeraj chopra modi
మోదీతో నీరజ్ చోప్డా

స్వీట్లు ఇష్టం...

స్వీట్లు బాగా ఇష్టం. క్రీడాకారుడిగా మారాక స్వీట్లు తగ్గించేశాను. ఒలింపిక్స్‌కు ఆరు నెలల ముందు నుంచీ స్వీట్లు తినడం మానేశా. ఎప్పుడైనా టోర్నీ ముగిశాక విరామంలో తింటుంటా. అమ్మచేసే చూర్మా (రోటీలో పంచదార, నెయ్యి వేసి చేస్తారు), దూధ్‌ పేడా అంటే బాగా ఇష్టం. స్ట్రీట్‌ఫుడ్‌లో పానీపూరీ ఇష్టం. రోజులో ఎక్కువగా సలాడ్లూ, పండ్ల రసాలూ, బ్రెడ్‌ ఆమ్లెట్‌, సాల్మన్‌ ఫిష్‌... తీసుకుంటా. వీటితో బోర్‌ కొడితే ఫ్రైడ్‌రైస్‌ చేసుకుని తింటుంటా.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.