ETV Bharat / sports

ఆనంద్​ మహీంద్రా చేసిన పనితో నిఖత్​ జరీన్ ప్లాన్​​ ఛేంజ్​​.. ఇక అలా చేయబోతుందట

author img

By

Published : Mar 27, 2023, 3:36 PM IST

Nikhat Zareena mercedes car
నిఖత్​ జరీన్​ మెర్సిడెస్ కారు

వరల్డ్ బాక్సింగ్​ ఛాంపియన్​ నిఖత్​ జరీన్​ ఓ విషయంలో తన మనసును మార్చుకుంది. తనకు వచ్చిన ప్రైజ్​మనీతో ఏం చేయలనుకుంటుందో వివరించింది. ఆ వివరాలు..

మహిళల ప్ర‌పంచ‌ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్​లో తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ పసిడిని ముద్దాడిన సంగతి తెలిసిందే. 50 కేజీల విభాగంలో గోల్డ్​ మెడల్​ సాధించిన నిఖ‌త్.. ఈ గెలుపుతో వరుసగా రెండోసారి వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ సాధించిన రెండో భారత బాక్సర్​గా రికార్డుకెక్కింది. దీంతో ఆమెపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు సరికొత్త థార్​ SUVను బహుమతిగా ఇచ్చింది ​ మహీంద్రా సంస్థ. అయితే ఈ బహుమతితో ఆమె తనకు సంబంధించిన ఓ నిర్ణయాన్ని మార్చుకుంది.

మొదటగా ఆమె.. తన విజయంతో వచ్చిన ప్రైజ్​మనీతో USD 100,000(భారత కరెన్సీలో 82లక్షల 34,980) లగ్జరీ మెర్సిడెస్​ కారును కొనుగోలు చేయాలని ఆశించింది. ఈ విషయాన్ని మీడియా సమావేశంలోనూ పేర్కొంది. అనంతరం మహీంద్రా.. అధునాతన థార్​ SUVను బహుమతిగా ఇవ్వడంతో తన ఉద్దేశాన్ని మార్చుకుంది. అస్సలు ఊహించలేదంటూ పేర్కొంది. మెర్సిడెస్ కారును కొనుగోలు చేయలన్నా తన ప్లాన్​ను మార్చుకున్నట్లు వెల్లడించింది.

తనకు వచ్చిన నగదు బహుమతితో.. తన తల్లిదండ్రులను 'ఉమ్రా' తీర్థయాత్రకు పంపిస్తానని తెలిపింది. పుణ్యకార్యాల కోసం డబ్బును వినియోగిస్తానని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆనంద్​ మహీంద్రాకు ధన్యావాదాలు తెలిపింది. భవిష్యత్​లో ఇలాంటి ప్రోత్సాహకాలు క్రీడాకారులకు స్ఫూర్తినిస్తాయని చెప్పింది.

ఇకపోతే గతంలోనూ ఆనంద్​ మహీంద్రా.. దేశం కోసం పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు.. సరికొత్త మోడళ్ల కారులను బహుమతిగా ఇచ్చి అభినందనలు తెలిపారు. వీరిలో ఒలింపిక్​ గోల్డ్​ మెడలిస్ట్​ జావిలెన్​ ఛాంపియన్​ నీరజ్​ చోప్రా కూడా ఉన్నాడు. అతడికి మహీంద్ర XUV 700ను బహుమతిగా ఇచ్చింది. అలా ఎంతో మంది అథ్లెట్లను మహీంద్రా సంస్థ ప్రోత్సాహించింది.

ఇక తన విజయంపై నిఖత్​ జరీన్​ మాట్లాడుతూ.. "రెండోసారి వరల్డ్​ ఛాంపియన్‌గా నిలవడం చాలా ఆనందంగా ఉంది. చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. ఓ కొత్త అద్భుతమైన అనుభూతినిస్తోంది. నాకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు. ఈ గోల్డ్​ మెడల్​ను దేశానికి అంకితం ఇస్తున్నా. ఆటపై ఉన్న ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తోంది. దేశం కోసం మెడల్స్​ సాధించాలనే పట్టుదల, రింగ్‌లో బరిలోకి దిగితే వంద శాతం పోరాడాలనే అంకిత భావంతోనే ముందుకు సాగుతున్నా. ప్రత్యర్థి ఎవరైనా సరే.. గెలవాలనే లక్ష్యంతోనే ధైర్యం ప్రదర్శిస్తా. ఒలింపిక్స్‌ ఆడాలి. అందులో గోల్డ్​మెడల్​ సాధించాలి. ఇదే ఎప్పుడూ నన్ను ప్రేరేపిస్తోంది. సొంత అభిమానుల మధ్య విజయం సాధించడం ఎంతో గొప్పగా ఉంది. తల్లిదండ్రుల సమక్షంలో టైటిల్‌ దక్కించుకోవడం ఎప్పటికీ మరిచిపోలేను. పారిస్‌ ఒలింపిక్స్‌ దృష్టిలో పెట్టుకుని వెయిట్​ కేటగిరి మారాలనుకున్నా. 54తో పోలిస్తే 50 కేజీలకు మారడమే సులువనిపించింది. బరువు తగ్గాలని నిర్ణయించుకున్నా. దీనికోసం ఎంతో కష్టపడ్డా. ఆహార నియమాలు పాటించా. ఒలింపిక్స్‌కు ముందు ఈ కేటగిరి నా ప్రదర్శన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కామన్వెల్త్‌ క్రీడల్లో 50 కేజీల విభాగంలో పోటీపడ్డాను. అప్పుడు పసిడి సాధించాను. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లోనూ గెలిచాను" అని నిఖత్ జరీన్ హర్షం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి: IPL 2023 : అత్యధిక పరుగులు చేసిన 'చెన్నై' టాప్-5 బ్యాటర్లు వీళ్లే.. మహీది ఎన్నో ప్లేస్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.