ETV Bharat / sports

KL Rahul​.. ఫామ్​లో లేకపోయినా అందులో మాత్రం టాపే!

author img

By

Published : Feb 28, 2023, 10:00 PM IST

KL rahul test centuries
కేఎల్ రాహుల్ టెస్ట్ సెంచరీలు

కేఎల్ రాహుల్​.. పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఓ ఘనతను మాత్రం తన ఖాతాలో అలానే ఉంచుకున్నాడు. అదేంటంటే..

టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్​ కేఎల్ రాహుల్ ప్రస్తుతం తన కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫామ్‌లేమీతో సతమతమవుతూ పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో కూడా అతడి బ్యాట్ నుంచి సరైన ఇన్నింగ్స్ రావడం లేదు. పేలవ ప్రదర్శన చేస్తూ తన వైస్​ కెప్టెన్​ హోదాను కూడా పోగొట్టుకున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ కలిపి అతడు 12.67 సగటుతో 38 పరుగులు మాత్రమే చేశాడు. జట్టులో అతడికి చోటు ప్రశార్థకంగా మారింది. నెటిజన్లు, మాజీలు అతడి ప్రత్యామ్నయంగా సూపర్ ఫామ్​లో ఉన్న శుభమన్​ గిల్​ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. రాహుల్ విశ్రాంతి తీసుకోవాలని అంటున్నారు. అయితే కేఎల్​ ఇంత చెత్త ప్రదర్శన చేసినప్పటికీ.. అతడి ఖాతాలో మాత్రం ఓ ఘనత అలానే ఉంది. అదేంటంటే.. ప్రస్తుతం అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో కొనసాగుతున్నాడు.

వాస్తవానికి అతడు గత మూడేళ్లుగా టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత బ్యాటర్లలో అతడు ఉన్నాడు. ఈ మూడేళ్లలో టెస్టు క్రికెట్‌లో అతడు మొత్తం రెండు సెంచరీలను బాదాడు. ఇక ఇదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. అతడు మొత్తం మూడు టెస్టు సెంచరీలను సాధించాడు. అతడితో సమానంగా రిషబ్ పంత్ కొనసాగుతున్నాడు. అతడు కూడా మూడు టెస్టు సెంచరీలు కొట్టాడు. వీరి తర్వాత కేఎల్​ రాహుల్​తో సమానంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా రెండు శతకాలను బాదాడు. అలా రోహిత్ శర్మ, పంత్​ చెరో మూడు శతకాలు, రవీంద్ర జడేజా, కేఎల్​ రాహులు చెరో రెండు సెంచరీలను సాధించారు.

27 ఫిబ్రవరి 2020 నుంచి 27 ఫిబ్రవరి 2023 వరకు ఈ నలుగురి గణాంకాలను ఓ సారి పరిశీలిద్దాం. గత మూడేళ్లలో రోహిత్ శర్మ మొత్తంగా పదిహేను టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. ఈ మ్యాచుల్లో 27 ఇన్నింగ్స్‌ ఆడగా.. 47.16 సగటుతో మొత్తం 1179 పరుగులు సాధించాడు. ఇందులో హిట్​మ్యాన్​ మూడు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలు చేశాడు.

ఇక రిషబ్ పంతైతే మొత్తం 21 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. వీటిలో అతడు 36 ఇన్నింగ్స్‌లలో 44.63 సగటుతో 1,473 రన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో మూడు శతకాలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి.

రవీంద్ర జడేజా విషయానికొస్తే.. మొత్తం 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 40.78 సగటుతో మొత్తం 775 పరుగులను సాధించాడు. ఈ పరుగులతో రెండు శతకాలతో పాటు నాలుగు హాఫ్ సెంచరీలను ఖాతాలో వేసుకున్నాడు.

ఇక కేఎల్ రాహుల్ మొత్తం 11 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 30.28 సగటుతో మొత్తం 636 రన్స్​ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో రెండు శతకాలు, రెండు హాఫ్​ సెంచరీలు ఉన్నాయి.

రాహుల్ గత పది ఇన్నింగ్స్​.. గత మూడు ఇన్నింగ్స్​లో కే ఎల్​ రాహుల్​.. 71 బంతుల్లో 20.. 41 బంతుల్లో 17.. 3 బంతుల్లో ఒక్క పరుగు చేసి విమర్శలను మూటగట్టుకున్నాడు. అసలు గత పది ఇన్నింగ్స్‌లలోనూ ఇలాంటి చెత్త ప్రదర్శనే చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా బాదలేదు. మొత్తంగా ఈ పది ఇన్నింగ్స్​లో కేఎల్​ అత్యధిక వ్యక్తిగత స్కోరు 23 రన్సే కావడం గమనార్హం. అదీ కూడా బంగ్లాదేశ్‌పై ఈ ఇన్నింగ్స్ ఆడాడు. అందుకే కేఎల్​ రాహుల్​పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి, నెటిజన్లు అతడిని ట్రోల్స్​ చేస్తున్నారు. అందుకే బోర్డు కేఎల్​ను వైస్ కెప్టెన్​ ట్యాగ్​ను తొలగించింది.

ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఘోరంగా ఓడించింది టీమ్​ఇండియా. అలానే మూడో మ్యాచ్​లోనూ ఆసీస్​ను ఓడించి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ బెర్తును ఖాయం చేసుకోవాలని ఆశిస్తోంది. ఇక మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌ వేదికగా జరగనుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ఇదీ చూడండి: రోహిత్ శర్మ ఫామ్​.. రెండు నెలల్లో 500 ప్లస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.