ETV Bharat / sports

సీఎస్కేxఆర్సీబీ: ఆధిపత్యం కొనసాగించేది ఎవరో?

author img

By

Published : Apr 25, 2021, 5:31 AM IST

RCB vs CSK
ఆర్సీబీ, సీఎస్కే

ఐపీఎల్ 14వ సీజన్​లో భాగంగా నేడు టేబుల్ టాపర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు గెలుపు కోసం అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ఐపీఎల్​లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. లీగ్​లో ప్రస్తుతం టాప్​-2 స్థానాల్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్​లో వరుసగా నాలుగు మ్యాచ్​లు గెలిచి జోరుమీదుంది ఆర్సీబీ. ఆడిన నాలుగింటిలో మూడు గెలిచి తన పాత ఫామ్​ను కొనసాగించేందుకు ఆరాటపడుతోంది సీఎస్కే. ఈ మ్యాచ్ వాంఖడే వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది.

ఆర్సీబీ జోరు కొనసాగేనా?

చివరగా రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది ఆర్సీబీ. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (101) సెంచరీతో కదం తొక్కగా, కోహ్లీ (72) అతడికి మద్దతిస్తూ స్ఫూర్తివంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 178 పరుగుల లక్ష్యాన్ని 16.3 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది ఆర్సీబీ. నేడు చెన్నైతో జరిగే మ్యాచ్​లోనూ ఇదే ఫామ్​ను కొనసాగించాలని యాజమాన్యం భావిస్తోంది. కోహ్లీ, పడిక్కల్​తో పాటు డివిలియర్స్, మ్యాక్స్​వెల్​తో బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది.

RCB vs CSK
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

బౌలింగ్​లోనూ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది ఆర్సీబీ. టీమ్ఇండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్​తో పాటు హర్షల్ పటేల్ ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయడంలో సఫలమవుతున్నాడు. విదేశీ పేసర్​ జేమిసన్ ఈ జట్టుకు అదనపు బలం.

పాత చెన్నైని మరిపిస్తారా?

సీజన్​ను ఓటమితో ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. తర్వాత జరిగిన మూడు మ్యాచ్​ల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. గత సీజన్​లో ప్లే ఆఫ్స్​ చేరడంలో విఫలమైన ఈ జట్టు ఈసారి 'ఛాంపియన్ చెన్నై'ని గుర్తుకుతెస్తోంది. బ్యాటింగ్​లో గత మ్యాచ్​లో యువ ఓపెనర్​ రుతురాజ్ గైక్వాడ్​తో పాటు డుప్లెసిస్ అద్భుతంగా ఆడారు. మూడో స్థానానికి ప్రమోట్ అయిన మొయిన్ అలీ మంచి ప్రదర్శన చేశాడు. వీరితో పాటు రైనా, ధోనీ మంచి ఫామ్​లో ఉన్నారు.

RCB vs CSK
చెన్నై సూపర్ కింగ్స్

బౌలింగ్​లో దీపక్ చాహర్ ప్రత్యర్థిని మొదటి పవర్​ప్లేలోనే దెబ్బకొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతడు కనుక మొదటి ఆరు ఓవర్లలో కీలక వికెట్లు తీస్తే.. ఆర్సీబీకి కష్టమే. మరో పేసర్ శార్దూల్ ఠాకూర్​ కూడా మెరుగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే రవీంద్ర జడేజా, మొయిన్ అలీ వారి స్పిన్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.