ETV Bharat / sports

నేనెప్పుడూ రాజీ పడలేదు.. అలా అయితే మంచి క్రికెటర్ కాలేరు : అంబటి రాయుడు​

author img

By

Published : Jun 1, 2023, 7:32 AM IST

Updated : Jun 1, 2023, 11:03 AM IST

Ambati Rayudu IPL Retirement
Ambati Rayudu IPL Retirement

Ambati Rayudu IPL Retirement : అంబటి రాయుడు.. భారత క్రికెట్​లో ఓ వెలుగు వెలిగిన తెలుగు తేజం. మెరుగైన ఆటతీరుతో ఆరేడేళ్ల పాటు టీమ్​ఇండియా తరఫున ఆడాడు. దేశవాళీ క్రికెట్​తో పాటు ఐపీఎల్​లో 6 ట్రోఫీలు గెలిచిన ముంబయి, చెన్నై తరఫున ఆడాడు. ఐపీఎల్​ 16వ సీజన్​ ఫైనల్​ మ్యాచ్​లో అద్భుత ప్రదర్శన చేసి.. తన ఐపీఎల్​ కరెరీర్​కు ఘనంగా వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా అంబటి రాయుడు పంచుకున్న ఆసక్తికర విశేషాలివే..

Ambati Rayudu IPL Retirement : ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్)లో ముంబయి ఇండియన్స్​, చెన్నై సూపర్ కింగ్స్​ లాంటి అగ్రశ్రేణి జట్లకు ఆడాడు. అంతేకాకుండా ఆ జట్ల తరఫున ముడు ట్రోఫీలో అందుకున్నాడు. భారత క్రికెట్​లో అండర్​-19 జట్టు కెప్టెన్​గా, టీమ్​ఇండియా ప్లేయర్​గా, ఐపీఎల్​ ఆటగాడిగా తనదైన ఆటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మన తెలుగు తేజం అంబటి తిరుపతి రాయుడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్​ మ్యాచ్​లో మెరపు ఇన్నింగ్స్​ ఆడి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్​లో తన ప్రస్థానాన్ని ఘనంగా ముగించాడు. రాయుడు తన 30 ఏళ్ల క్రికెట్​ ప్రయాణంపై పంచుకున్న విశేషాలివే.. ​

మీ 30 ఏళ్ల క్రికెట్ జీవితాన్ని ఎలా విశ్లేషిస్తారు?
క్రికెట్‌పై ఉన్న ప్రేమ కారణంగా ఏడెనిమిదేళ్ల వయసులో బ్యాట్​ పట్టా. అప్పటి నుంచి క్రికెట్​ నా ప్రాణం అయింది. అయితే అంతకుముందు నాకు ఎలాంటి క్రికెట్ నేపథ్యం లేదు.. పలుకుబడి.. ఎండార్స్‌మెంట్లు లేవు. ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. చాలా మంది తొక్కేయాలనుకున్నారు. ఆ సంఘటనలన్నీ ఆటపై ఏకాగ్రత పెట్టలేక మానసికంగా కుంగిపోయేలా చేశాయి. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ నేను ఎవరికీ తలవంచలేదు. ఫీల్డ్‌లో అయిన లేదా బయట అయినా నేను ఎప్పుడూ రాజీపడలేదు. ప్రతిభను నమ్మి సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నా. ఒక్కో మెట్టు ఎక్కుతూ టీమ్ఇండియా వరకు వెళ్లాను. ఐపీఎల్‌లో నా ప్రదర్శనతో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ జట్లను ఆకట్టుకున్నాను. ఆరు ట్రోఫీలు గెలుచుకున్న రెండో ఆటగాడిగా అరుదైన గౌరవాన్ని అందుకున్నా. గౌరవంగా ఆడాను.. అదే గర్వంతో వీడ్కోలు పలికా.

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మీకెలా అనిపించింది?
Ambati Rayudu IPL 2023 : జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ అది. కీలక సమయంలో క్రీజులోకి అడుగుపెట్టాను. 18 బంతుల్లో 38 పరుగులు చేయాల్సి ఉంది. మోహిత్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అంతకుముందు ఓవర్‌లో శివమ్ దూబే రెండు సిక్సర్లు బాది ఇన్నింగ్స్‌కు ఊపునిచ్చాడు. ఆ జోరును కొనసాగించాలంటే బౌలింగ్‌లో గట్టిగా ఆడాలని మోహిత్ భావించాడు. కాబట్టి వరుసగా 6, 4, 6 వచ్చాయి. రెండో సిక్స్.. నా కెరీర్‌ అత్యుత్తమ షాట్‌లలో ఒకటి. ఇది ముందుగా అనుకున్న షాట్ కాదు. బంతి గమనాన్ని పూర్తిగా అంచనా వేసిన తర్వాత మాత్రమే ఆడాను. చాలా ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత మాత్రమే అలాంటి షాట్ ఆడగలరు. అదృష్టవశాత్తూ, చెన్నై జట్టు అంతా అనుభవజ్ఞులే. నాకంటే ముందు రహానే కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. నాణ్యమైన గుజరాత్ బౌలింగ్​ను ఎదుర్కోవడానికి చెన్నై ఆటగాళ్ల అనుభవమే కారణం. ఫైనల్‌లో గెలిచిన తర్వాత నా ఉత్సాహాన్ని అదుపు చేసుకోలేకపోయాను. 30 ఏళ్ల ప్రయాణం ఆగిపోయినట్లే అనిపించింది. చిన్ననాటి అనుభవాలు గుర్తుకు వచ్చాయి. ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన కష్టాలు కళ్ల ముందు కనిపించాయి.

2 బంతుల్లో 10 పరుగులు అవసరమైనప్పుడు మ్యాచ్‌పై ఆశ ఉందా?
లక్ష్యాన్ని ఛేదించేందుకు మొదటి బంతి నుంచే మంచి స్థితిలో ఉన్నాం. రుతురాజ్, కాన్వే శుభారంభం ఇచ్చారు. దుబే, రహానేలు ఇన్నింగ్స్‌ గేర్‌ మార్చారు. నేను ఔటయ్యాక 14 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉంది. టీ20 ఫార్మాట్‌లో ఇది సులభమైన సమీకరణం. మరో భారీ షాట్ పడితే మ్యాచ్ పూర్తిగా చెన్నై ఆధీనంలోకి వచ్చేది. కానీ చివరికి షాట్లు వచ్చాయి. వెంటనే ధోనీ వికెట్‌ పడిపోయింది. షమీ అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్ల మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా రవీంద్ర జడేజా సిక్సర్, ఫోర్​తో చెన్నైకి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. అతడు నా చివరి ఐపీఎల్ మ్యాచ్‌ను గుర్తుండిపోయేలా చేశాడు.

ఐపీఎల్ ట్రోఫీని తీసుకోమని ధోని మిమ్మల్ని అడుగుతారని మీరు ఊహించారా?
లేదు.. కానీ అది ధోనీ గొప్పతనం. ఆయనది గొప్ప వ్యక్తిత్వం. ధోనీతో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. అతడితో కలిసి ఇండియా-ఏ, టీమ్ఇండియా, చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఆడే అదృష్టం దక్కింది. విశాఖపట్నంలో పాకిస్థాన్‌పై ధోనీ సెంచరీకి ముందు మేమిద్దరం కలిసి ఇండియా-ఎ తరఫున ఆడాం. అప్పటి నుంచి అతనంటే నాకు గౌరవం. అతడు మైదానం బయట కూడా చాలా సాధారణంగా ఉంటాడు. అలాంటి వ్యక్తులు చాలా అరుదు. మైదానంలో వైడ్స్ బాల్స్​, నోబాల్స్ వంటి నిర్ణయాలకు వాట్సన్, నేను తీవ్రంగా ప్రతిస్పందిస్తాము. అందుకే ఫెయిర్ ప్లే పాయింట్లు తగ్గుతాయని ధోనీ సరదాగా అన్నాడు.

అత్యంత విజయవంతమైన ముంబయి, చెన్నై జట్లకు ఆడుతూ.. ఆరు ట్రోఫీలు గెలవడం ఐపీఎల్ చరిత్రలో గొప్ప ఘనతగా భావించవచ్చా?

గౌరవంగా కాకుండా అరుదైన అవకాశంగా భావిస్తా. తాజాగా ఆకాశ్​ అంబానీ 200వ ఐపీఎల్ మ్యాచ్‌కు ప్రత్యేక వీడియో సందేశంతో శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్ తర్వాత ధోనీ సహా జట్టులోని ఆటగాళ్లంతా నా గురించే మాట్లాడారు. అవి నేను ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలు. ముంబయి, చెన్నై జట్లకు ఆడే అవకాశం రావడం నా అదృష్టం. రెండు జట్లలో ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదించాను. మంచి రన్ రేట్​తో పరుగులు సాధించాను. రెండు జట్లు..తలో మూడు ట్రోఫీలు గెలుచుకోవడంలో నా పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. రోహిత్ శర్మ తర్వాత ఆరు ట్రోఫీలు గెలవడం గొప్ప అనుభూతి.

మీ దేశీయ, అంతర్జాతీయ, ఐపీఎల్​ కెరీర్‌లో మీకు అత్యంత సంతృప్తిని ఇచ్చింది ఏమిటి?
ఒకటి తక్కువ.. మరొకటి ఎక్కువ కాదు. దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఐపీఎల్‌కు వెళ్లాను. అక్కడి నుంచి టీమ్​ఇండియా తరఫున ఆడా. ఆట నేర్చుకున్నది దేశవాళీ క్రికెట్‌లోనే. అదే నన్ను పదవీ విరమణకు నడిపించింది. ఆరేడు ఏళ్లుగా టీమ్​ఇండియాలో ఉన్నా. ఇప్పటివరకు 61 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాను. అంతకుపైగా రిజర్వ్‌ బెంచ్‌పై కూర్చుని మ్యాచ్‌లు వీక్షించాను. ప్రతి మ్యాచ్‌ ఓ పాఠమే. భారత జట్టు తరఫున ఆడిన ప్రతి మ్యాచ్ చిరస్మరణీయమే. అహ్మదాబాద్‌లో శ్రీలంకపై తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించాను. అదే వేదికలో పదవీ విరమణ చేయడం సంతోషంగా ఉంది.

యువ ఆటగాళ్లకు మీరిచ్చే సలహా ఏమిటి?
ప్రతిభకు తిరుగులేదు. రికమెండేషన్​తో కూడిన ఎంపికలను విశ్వసిస్తే ఎప్పటికీ మంచి క్రికెటర్‌ కాలేరు. విజయానికి షార్ట్‌కట్‌లు లేవు. ఆట నేర్చుకుంటే అవకాశాలకు లోటు ఉండదు. తిలక్ వర్మ, మహ్మద్‌ సిరాజ్‌లే లాంటి క్రికెటర్​లే అందుకు నిదర్శనం. ఐపీఎల్‌లో దేశవాళీ ఆటగాళ్లు సత్తాచాటుతుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఐపీఎల్‌ వల్లే నేను టీమ్‌ఇండియాకు ఆడగలిగాను. లేకపోతే దేశవాళీ క్రికెట్‌తోనే నా కెరీర్‌ ముగిసేది. ప్రతిభావంతులకు ఐపీఎల్‌ అద్భుతమైన వేదిక. ఆటగాడిలో సత్తా ఉంటే ఫ్రాంచైజీలే వెతుక్కుంటూ వస్తాయి.

చెన్నై, ముంబయి జట్లు 16 సీజన్లలో 10 సార్లు గెలిచాయి. ఆ రెండు జట్ల గెలుపు ఫార్ములా ఏమిటి?
గందరగోళం, తికమక లేకపోవడం. ప్లేయర్ ఎంపిక నుంచి ప్రదర్శన వరకు పూర్తి పారదర్శకత. రెండు ఫ్రాంచైజీల అంతిమ లక్ష్యం ఒకటే అయినప్పటికీ, అనుసరించిన విధానాలు భిన్నంగా ఉన్నాయి. ముంబయి టీమ్​.. జట్టు ప్రతి ఆటగాడి పాత్ర గురించి ముందే పూర్తిగా తెలుసుకుంటుంది. ఎవరు ఏమి చేయాలి? ఎలా చెయ్యాలి? ఆటగాళ్లు తమ ప్రణాళికను అమలు చేసేలా చూసుకుంటుంది. ఇందులో చెన్నై తీరు వేరు. ప్రతి క్రీడాకారుడిని ఆలోచింపజేస్తుంది. ఆటలో సొంతంగా ఎదిగేలా ప్రోత్సహిస్తుంది. ప్లేయర్​ అతడి ఆటను ఆతడే మెరుగుపరుచుకునే విశ్వాసాన్ని ఇస్తుంది. అయితే, రెండు ఫ్రాంచైజీలు తమ సొంత వ్యూహాలుస, ప్రణాళికలతో చాలా స్పష్టంగా ఉంటాయి.

Last Updated :Jun 1, 2023, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.