ETV Bharat / sports

ఒక్క వికెట్‌ తీస్తేనేం.. సిరాజ్ సూపర్: సచిన్‌

author img

By

Published : Jan 17, 2021, 6:15 AM IST

Sachin decodes on Siraj's Bowling on day one at the Gabba
ఒక్క వికెట్‌ తీస్తేనేం.. సిరాజ్ సూపర్: సచిన్‌

బ్రిస్బేన్​ టెస్ట్​లో టీమ్​ఇండియా పేస్​ను ముందుండి నడిపిస్తున్న మహ్మద్​ సిరాజ్​ బౌలింగ్​ను ప్రశంసించాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​. సిరాజ్​ బౌలింగ్​ను పరిశీలించిన మాస్టర్​.. అతడి సామర్థ్యంపై స్పందిస్తూ ట్విట్టర్​ వేదికగా ఓ వీడియోను పోస్ట్​ చేశాడు.

బుమ్రా గైర్హాజరీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో భారత పేస్‌ దళాన్ని హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ముందుండి నడిపిస్తున్నాడు. ఆడేది మూడో టెస్టే అయినప్పటికీ సహచర ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తూ సమర్థవంతంగా పేస్ బాధ్యతల్ని మోస్తున్నాడు. అయితే.. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టాడు. రెండో రోజు ఆటలో బంతితో ప్రభావం చూపినప్పటికీ వికెట్లు సాధించలేకపోయాడు.

ఈ నేపథ్యంలో సిరాజ్ బౌలింగ్‌ను దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ విశ్లేషించాడు. పిచ్‌పై ఉన్న పగుళ్లతో సిరాజ్‌.. స్వింగ్ రాబడుతున్నాడని వినిపిస్తున్న వాదనలను కొట్టిపారేశాడు. నైపుణ్యంతోనే స్వింగర్స్‌, కట్టర్స్‌ను అద్భుతంగా సంధిస్తున్నాడని ట్విట్టర్ వేదికగా ఓ వీడియోతో తన అభిప్రాయాలను‌ పంచుకున్నాడు మాస్టర్​.

'అది కచ్చితంగా అతడి సామర్థ్యమే..'

"పిచ్‌పై ఉన్న పగుళ్ల సాయంతో మహ్మద్‌ సిరాజ్‌ బంతిని స్వింగ్ చేస్తున్నాడని కొందరు అంటున్నారు. అయితే.. అతడి బౌలింగ్‌ను పరిశీలించాను. తెలివిగా, వైవిధ్యంగా బంతులు విసురుతున్నాడు. బంతిపై ఉన్న షైన్‌ను ఉపయోగించుకుని ఫస్ట్ స్లిప్‌, సెకండ్‌ స్లిప్‌ లక్ష్యంగా బంతులు సంధిస్తున్నాడు. రెండువేళ్లతో బంతుల్ని వదులుతూ స్వింగ్ రాబడుతున్నాడు. అలాగే కట్టర్‌ వేయాలనుకున్నప్పుడు బంతి షైన్‌ను ఎడమవైపునకు ఉండేలా ఉంచి లేదా కోణాన్ని కాస్తమార్చి బంతులు వేస్తున్నాడు. అప్పుడు బంతి గింగరాలు తిరుగుతూ దూసుకెళ్తోంది. అది పిచ్ సాయంతో వచ్చింది కాదు.. కచ్చితంగా సిరాజ్ సామర్థ్యమే" అని సచిన్‌ అన్నాడు.

ఇదీ చదవండి: 'రోహిత్​.. టెస్టుల్లో ఇది సరిపోదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.