ETV Bharat / sports

ఆ విషయం మాట్లాడేందుకు ఇది టైమ్​కాదు: కోచ్ ద్రవిడ్

author img

By

Published : Dec 25, 2021, 8:59 PM IST

Rahul Dravid
కోచ్ రాహుల్ ద్రవిడ్

IND VS SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ఎవరెవరిని ఆడించాలనే స్పష్టత ఉందని టీమ్​ఇండియా కోచ్ ద్రవిడ్ చెప్పాడు. అలానే కెప్టెన్​ ఎవరిని నియమించాలనేది జట్టు అంతర్గత విషయమని అన్నాడు.

RAHUL DRAVID: దక్షిణాఫ్రికాతో ఆదివారం నుంచి (డిసెంబరు 26) నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్‌ఇండియా కోచ్‌ రాహుల్ ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సఫారీల గడ్డపై సిరీస్ సాధించాలంటే తుది జట్టులో పలు మార్పులు చేయాలని అన్నాడు. జట్టులో సీనియర్‌ ఆటగాళ్లున్నా.. జట్టు ప్రయోజనాల కోసం కొందరిని పక్కన పెట్టక తప్పదని చెప్పాడు.

'తొలి టెస్టులో ఎవరెవరిని ఆడించాలనే విషయంపై మాకు పూర్తి స్పష్టత ఉంది. కొన్నిసార్లు జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. అజింక్య రహానె, పుజారాలతో పాటు జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాను. తిరిగి ఫామ్‌ అందుకోవడానికి రహానె నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. అయితే, తొలి టెస్టుకు అజింక్య రహానె, ఇషాంత్‌ శర్మల్లో ఎవరో ఒకరినే తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇద్దరిలో ఎవరిని పక్కన పెడతామనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. టాస్ తర్వాతే తుది జట్టును ప్రకటిస్తాం. దక్షిణాఫ్రికా పిచ్‌లపై ఆడటం చాలా కష్టం. ప్రత్యేకించి సెంచూరియన్‌లో కఠిన సవాళ్లు ఎదురవుతుంటాయి. మొదటి టెస్టులో గెలిస్తే ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టొచ్చు. దక్షిణాఫ్రికాతో పోల్చుకుంటే భారత పేస్ దళం పటిష్టంగా కనిపిస్తోంది. అయినా వారిని తేలిగ్గా తీసుకోం. మా బౌలర్లు 20 వికెట్లు తీసినా.. బ్యాటర్లు కూడా మెరుగైన స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌లు గాయాల కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరం కావడం వల్ల బౌలింగ్ విభాగంలో సమతూకం లోపించింది. ఒకవేళ ఐదుగురు బౌలర్లతో ఆడాలనుకుంటే.. శార్ధూల్‌ ఠాకూర్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌/హనుమ విహారిల్లో ఎవరినో ఒకరిని మాత్రమే తుది జట్టులోకి తీసుకుంటేనే శార్ధూల్‌కు చోటు దక్కుతుంది’ అని కోచ్‌ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.

kohli dravid
కోహ్లీతో ద్రవిడ్

మాట్లాడేందుకు ఇది సమయం కాదు

జట్టును ఎంపిక చేయడం, సారథిగా ఎవరిని నియమించాలనే నిర్ణయాలను సెలెక్షన్ కమిటీ చూసుకుంటుందని మరొక ప్రశ్నకు రాహుల్ సమాధానం ఇచ్చాడు. ‘‘జట్టు సభ్యులు, సారథి ఎంపికలో కీలక పాత్ర సెలెక్టర్లది. అందుకే నేను ఎలాంటి వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పలేను. అంతేకాకుండా ఇది సరైన వేదిక, సమయం కాదు. ఇప్పటివరకు నేను ఏదైతే చర్చించానో.. వాటిని మీడియాకు చెప్పడం కుదరదు’’ అని బదులిచ్చాడు. ‘‘విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు, నాయకుడు. జట్టుపరంగా టెస్టుల్లో ఇంకా మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. అందులో విరాట్ పాత్ర కీలకమైంది. టెస్టు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే వారిలో విరాట్ ఒకడు. కాబట్టే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ గొప్పగా ఉండబోతుందని భావిస్తున్నా. అది జట్టుకు కూడా ఎంతో ప్రయోజనం’’ అని పేర్కొన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.