ETV Bharat / sports

అది భారత జట్టుకు కూడా ప్రయోజనమే: ద్రవిడ్​

author img

By

Published : Jun 8, 2022, 7:20 AM IST

భారత యువ ఆటగాళ్లు ఐపీఎల్​లో కెప్టెన్లుగా తమ జట్లను మెరుగ్గా నడిపించడం.. భారత జట్టుకు కూడా ప్రయోజనమేనని అన్నాడు టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌. హార్దిక్ పాండ్యా తిరిగి ఫామ్​ను అందుకోవడం సహా దక్షిణాఫ్రికాతో సిరీస్​కు ఎంపిక అవ్వడం సంతోషంగా ఉందని చెప్పాడు.

dravid
ద్రవిడ్​

IND VS SA Rahul Dravid: టీ20 లీగ్‌లో భారత ఆటగాళ్లు కెప్టెన్లుగా విజయవంతం కావడం జాతీయ జట్టుకు ఉపయోగపడుతుందని టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. హార్దిక్‌ పాండ్య నేతృత్వంలోని గుజరాత్‌ తొలి ప్రయత్నంలోనే టైటిల్‌ నెగ్గగా.. టోర్నీలో రాహుల్‌ (లఖ్‌నవూ), శ్రేయస్‌ అయ్యర్‌ (కోల్‌కతా), సంజు శాంసన్‌ (రాజస్థాన్‌) కూడా సారథులుగా ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్‌ అలా స్పందించాడు. "టీ20 లీగ్‌లో చాలా మంది భారత కెప్టెన్లు రాణించడం మంచి విషయం. ఆ సారథుల్లో హార్దిక్‌ ఒకడు. జట్టును గొప్పగా నడిపించాడు. లఖ్‌నవూ కెప్టెన్‌గా కేఎల్‌, రాజస్థాన్‌ కెప్టెన్‌గా సంజు, కోల్‌కతా సారథిగా శ్రేయస్‌ ఆకట్టుకున్నారు. ఈ యువ బ్యాటర్లు జట్టును ముందుండి నడిపించడం చూస్తుంటే సంతోషం కలుగుతోంది. ఇది ఆటగాళ్లుగా ఎదగడానికి వారికి ఉపయోపడుతుంది. వ్యక్తులుగా ఎదగడానికి కూడా ఉపకరిస్తుంది" అని దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ నేపథ్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ద్రవిడ్‌ అన్నాడు. "భారత యువ ఆటగాళ్లు సారథులుగా తమ జట్లను మెరుగ్గా నడిపించడం వల్ల భారత జట్టుకు కూడా ప్రయోజనమే" అని చెప్పాడు.

అతడు వచ్చినందుకు సంతోషం.. రోహిత్‌, బుమ్రా, కోహ్లీలకు ఈ సిరీస్‌ నుంచి విశ్రాంతినవ్వగా.. హార్దిక్‌ పాండ్య పునరాగమనం చేశాడు. హార్దిక్‌ రాకపై ద్రవిడ్‌ సంతోషం వ్యక్తం చేశాడు. "హార్దిక్‌ తిరిగి జట్టులోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అతడు అద్భుతమైన క్రికెటర్‌. పరిమిత ఓవర్ల క్రికెట్లో హార్దిక్‌ విశేషంగా రాణించాడు. టీ20లీగ్‌లోనూ గొప్ప ఫామ్‌ను ప్రదర్శించాడు. అతడి కెప్టెన్సీ కూడా గొప్పగా ఉంది. నాయకత్వ బృందంతో భాగంగా ఉండాలంటే కెప్టెన్సీనే ఉండాల్సిన అవసరం లేదు. హార్దిక్‌ మళ్లీ బౌలింగ్‌ చేస్తుండడం మాకు సానుకూలాంశం" అని అన్నాడు. భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య మొదటి టీ20 గురువారం జరుగుతుంది. రోహిత్‌ గైర్హాజరీలో రాహుల్‌ టీమ్‌ ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు.

ఉమ్రాన్‌కు కష్టమే.. టీవల టీ20 లీగ్‌లో ఆకట్టుకున్న జమ్ముకశ్మీర్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ గురించి కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందించాడు. అతడికి వెంటనే తుది జట్టులో చోటు దక్కకపోవచ్చని సంకేతాలు ఇచ్చాడు. "అవును.. అతడు ఉత్సుకత కలిగిస్తున్నాడు. మంచి వేగంతో బౌలింగ్‌తో చేస్తున్నాడు. ఎక్కువ మంది భారత బౌలర్లు లీగ్‌లో చాలా వేగంతో బౌలింగ్‌ చేయడం నన్ను ఆకట్టుకుంది. టెస్టుల్లోనూ వాళ్లు అలా బౌలింగ్‌ చేస్తారని మూడు ఫార్మాట్ల కోచ్‌గా ఆశిస్తున్నా. అయితే నెట్స్‌లో ఉమ్రాన్‌ గొప్పగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అతడిలో మంచి పేస్‌ ఉంది. అయితే అతడు ఇంకా నేర్చుకుంటున్నాడు. ఉమ్రాన్‌ ఇంకా కుర్రాడే. రోజు రోజుకూ మెరుగవుతున్నాడు. ఆడుతున్నకొద్దీ ఇంకా మంచి బౌలర్‌ అవుతాడు. మాకైతే అతడు జట్టులో ఉన్నందుకు సంతోషంగా ఉంది. అతడికి ఎన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇవ్వగలమో చూడాలి. మేం వాస్తవికంగా ఉండాల్సిన అవసరముంది. మా జట్టు పెద్దది. అందరికీ తుది జట్టులో చోటివ్వడం కుదరదు. అర్ష్‌దీప్‌ రూపంలో మరో చక్కని యువ పేసర్‌ జట్టులో ఉన్నాడు" అని ద్రవిడ్‌ అన్నాడు.

ఇదీ చూడండి: IND VS SA: కేఎల్​ రాహుల్​.. అంచనాలను అందుకుంటాడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.