ETV Bharat / sports

దక్షిణాఫ్రికా పర్యటన.. ద్రవిడ్​కు అగ్నిపరీక్ష

author img

By

Published : Dec 26, 2021, 8:26 AM IST

Rahul Dravid as Coach, South Africa is crucial for Rahul Dravid, ద్రవిడ్ లేటేస్ట్ న్యూస్, దక్షిణాఫ్రికా పర్యటన ద్రవిడ్​కు అగ్ని పరీక్ష
Rahul Dravid

Dravid SA tour: టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ ద్రవిడ్‌ తొలి పరీక్షలో పాసైపోయాడు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20, టెస్టు సిరీస్‌లను టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు భారత జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లింది. ఇప్పుడు ఇదే ద్రవిడ్‌ కోచింగ్‌ సామర్థ్యానికి అసలైన పరీక్ష. భారత జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కిది తొలి విదేశీ పర్యటన. మరి ఈ క్రమంలో ఆదివారం నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో సీనియర్ల జట్టును ఎలా నడుపుతాడో వేచి చూడాలి.

Dravid SA tour: సొంత పిచ్‌ల మీద టీమ్‌ఇండియా బలమైన జట్టు. కాబట్టి పలువురు సీనియర్‌ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా కివీస్‌ మీద సిరీస్‌లను గెలుచుకోగలిగింది. అయితే తొలిసారి రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలోని భారత్‌ జట్టు విదేశీ పర్యటనకు వెళ్లింది. అసలే కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న వేళ దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఈ క్రమంలో బయోబబుల్‌ను వీడి బయటకు వెళ్లకుండా ఆటగాళ్లను, సిబ్బందిని ద్రవిడ్‌ కట్టడి చేయాలి. రవిశాస్త్రి ఆటగాళ్లకు కాస్త స్వేచ్ఛ ఇస్తాడనే పేరుంది. ఆటపరంగా రాహుల్‌ స్ట్రిక్ట్‌ అయినా.. నిబంధనలను పాటిస్తూనే ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగనీయడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కఠినంగా వ్యవహరించాల్సిందే. ఎప్పటికప్పుడు వారి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. క్రమశిక్షణ విషయంలో ద్రవిడ్‌ వెనుకడుగు వేయడు. సీనియర్లు, జూనియర్లను కలుపుకుని దక్షిణాఫ్రికా పరిస్థితులను త్వరగా అర్థం చేసుకోవాలి.

బాక్సింగ్‌ డే సందర్భంగా డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు జరగనుంది. మూడేళ్ల కిందట దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియా రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. అయితే ఆరు వన్డేల సిరీస్‌ను 5-1 తేడాతో, మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్‌ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో గత టెస్టు సిరీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్‌ఇండియా భావిస్తోంది. 2015 సీజన్‌ నుంచి ఇరు దేశాల మధ్య జరిగే సిరీస్‌లను గాంధీ-మండేలా సిరీస్‌లుగా నామకరణం చేశారు.

Rahul Dravid as Coach, South Africa is crucial for Rahul Dravid, ద్రవిడ్ లేటేస్ట్ న్యూస్, దక్షిణాఫ్రికా పర్యటన ద్రవిడ్​కు అగ్ని పరీక్ష
ద్రవిడ్, కోహ్లీ

గతంలో కోచ్‌గా విదేశీ పర్యటనల అనుభవం

భారత్‌ - ఏ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం రాహుల్‌ ద్రవిడ్‌కు ఉంది. టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా ఎంపిక కాకముందు శ్రీలంక పర్యటనకు భారత్‌ జట్టుతో ద్రవిడ్‌ వెళ్లాడు. అయితే లంకతో టెస్టులు ఆడని టీమ్‌ఇండియా టీ20లను మాత్రమే ఆడింది. ఇప్పటికే అండర్‌ 19, భారత్‌-ఏ జట్లతో విదేశాల్లో పర్యటించాడు. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు, వన్డే మ్యాచ్‌లను జట్టుతో ఆడించాడు. భారత్‌ - ఏ జట్టు కోచ్‌గా ద్రవిడ్‌ ఉన్నప్పుడే దక్షిణాఫ్రికా-ఏ జట్టు అక్కడ పర్యటించింది. అయితే సీనియర్ల జట్టు ప్రధాన కోచ్‌గా తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లాడు. యువ క్రికెటర్లు హనుమ విహారి, రిషభ్‌ పంత్‌, ఇషాన్‌ కిషన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శుభ్‌మన్ గిల్‌ వంటి యువ క్రీడాకారుల ప్రతిభను అండర్‌-19 దశలోనే ద్రవిడ్‌ గుర్తించాడు. సీనియర్లతోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో టీమ్ఇండియాను విదేశంలోనూ విజయ పథంలో నడపడం ద్రవిడ్‌కు పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. రవిశాస్త్రి హయాంలో ఆసీస్‌, ఇంగ్లాండ్ వంటి కఠినమైన పిచ్‌లపైనా సిరీస్‌లను గెలుచుకుని భారత్‌ తన సత్తా చాటింది. ఇప్పుడు అదే ఒరవడిని ద్రవిడ్‌ కొనసాగించాలని ప్రతి ఒక్క భారత క్రికెట్‌ అభిమాని ఆశిస్తున్నాడు.

వివాదాల నడుమ జట్టును నడపడమే పెద్ద సవాల్‌!

దక్షిణాఫ్రికా పర్యటన కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ జట్టుకు నాయకత్వం వహిస్తుండగా... రోహిత్‌ శర్మను డిప్యూటీగా నియమించింది. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు రోహిత్‌తోపాటు జడేజా దూరమయ్యారు. దీంతో కేఎల్‌ రాహుల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగింపు వ్యవహారం హాట్‌హాట్‌గా మారిన నేపథ్యంలో రోహిత్ కావాలనే టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అలానే వన్డే సిరీస్‌కు తాను దూరమవుతున్నట్లు వచ్చిన వార్తలను విరాట్ కోహ్లీ కొట్టిపడేశాడు. ఇటువంటి వివాదాల నేపథ్యంలో సారథి, జట్టు సభ్యులకు వారధిగా నిలిచి టీమ్‌ను నడిపించాలని బాధ్యత రాహుల్‌ ద్రవిడ్‌దే. మరోవైపు కివీస్‌తో సిరీస్‌లో విఫలమైన సీనియర్లు అజింక్యా రహానే, ఛెతేశ్వర్ పుజారాలకు మరొక అవకాశం దొరికింది. అయితే తుది జట్టులో మాత్రం ఎవరు ఉంటారనేది అయితే అక్కడి పిచ్‌లను బట్టి మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుంది. దక్షిణాఫ్రికా ఇప్పటికే 21 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

అసలెందుకు ఈ పర్యటనకు ప్రాధాన్యం?

IND vs SA series: అంతర్జాతీయ క్రికెట్‌లోకి దక్షిణాఫ్రికా పునరాగమనానికి 30 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్‌ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పట్లో జాతి వివక్ష కారణంతో దక్షిణాఫ్రికా మీద ఐసీసీ నిషేధం విధించింది. 1992లో నిషేధం పూర్తికావడం.. అప్పుడు తొలి పర్యటన టీమ్ఇండియాదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మైత్రికి చిహ్నంగా దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలను భారత్‌ ఆడనుంది. నాలుగో వేవ్‌, కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌ పర్యటనపై కాస్త సందిగ్ధత ఏర్పడింది. అయితే సౌతాఫ్రికా క్రికెట్‌ బోర్డు నుంచి పూర్తిస్థాయి భరోసా లభించడం వల్ల టీమ్ఇండియా పర్యటన ఖరారైంది. కాకపోతే డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభమవ్వాల్సిన తొలి టెస్టు మ్యాచ్‌ డిసెంబర్‌ 26న మొదలవుతుంది. తొలుత టీ20 సిరీస్‌ను కూడా ఖరారు చేసిన ఇరు బోర్డులు.. ప్రస్తుతానికి దానిని హోల్డ్‌లో పెట్టాయి.

ఇవీ చూడండి: 'ఆత్మవిశ్వాసం ముఖ్యం'.. రహానేకు జహీర్ సలహా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.