ETV Bharat / sports

దిల్లీ క్యాపిటల్స్​ కొత్త కెప్టెన్​గా వార్నర్!​.. సన్​రైజర్స్​పై పగ తీర్చుకుంటాడా?

author img

By

Published : Feb 23, 2023, 6:50 PM IST

Delhi capitalas captain David warner
దిల్లీ క్యాపిటల్స్​ కొత్త కెప్టెన్​గా వార్నర్!

రోడ్డు ప్రమాదం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్​కు రిషబ్ పంత్ దూరమైన నేపథ్యంలో తమ జట్టుకు కొత్త కెప్టెన్​గా వార్నర్​ను ఎంపిక చేసిందట దిల్లీ క్యాపిటల్స్. త్వరలోనే అధికార ప్రకటన ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని తెలిసింది.

ఐపీఎల్‌ టీమ్​ దిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదం కారణంగా ఆ టీమ్​ కెప్టెన్ రిషబ్​ పంత్ ప్రస్తుతం రెస్ట్​ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఐపీఎల్ సీజన్​కు అతడు దూరమయ్యాడు. ​ఈ క్రమంలోనే దిల్లీ జట్టు కొత్త సారథిగా ఎవరిని నియమిస్తారనే చర్చ జోరుగా సాగింది. అయితే ఇప్పుడీ విషయంపై దిల్లీ యాజమాన్యం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను తమ జట్టు కెప్టెన్‌గా నియమించాలని ఫిక్స్​ అయిందట. ఇకపోతే వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన ఇవ్వనుందట.

అంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్​కు సుదీర్ఘ కాలం పాటు కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్.. 2016లో ఆ జట్టుకు ట్రోఫీని కూడా అందించాడు. అయితే 2021లో పేలవ ప్రదర్శన చేయడంతో అతడిని సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు జట్టు నుంచి కూడా తప్పించింది. దీంతో సన్​రైజర్స్​తో బంధం తెంచుకున్న వార్నర్​.. 2022 ఐపీఎల్​లో దిల్లీ క్యాపిటల్స్​లో చేరాడు. ఇక ఈ జట్టు తరఫున మంచి ప్రదర్శన చేస్తూ రాణించాడు. 12 మ్యాచుల్లో 432 రన్స్ సాధించాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పంత్​ దూరమవ్వడంతో వార్నర్​కు జట్టు పగ్గాలు అప్పగించాలని యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిసింది. ఇక ఈ విషయాన్ని తెలుసుకుంటున్న అభిమానులు.. వార్నర్ ఈసారి మెగాలీగ్​లో సన్‌రైజర్స్‌పై పగ తీర్చుకుంటాడని, ఆ జట్టుపై అద్భుతంగా ఆడతాడని అంటున్నారు. చూడాలి మరి ఎలా రాణిస్తాడో.

ఇకపోతే ఇప్పటివరకు 162 ఐపీఎల్ మ్యచ్‌లు ఆడిన వార్నర్ 140.69 స్ట్రైక్‌రేట్‌తో 5,881 పరుగులు చేశాడు. 15 ఏళ్ల ఐపీఎల్ హిస్టరిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా, మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభంకానుంది. దిల్లీ క్యాపిటల్స్ టీమ్ తన మొదటి మ్యాచ్‌ను ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ పోరుకు లఖ్​నవూ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇదీ చూడండి: 'సన్​రైజర్స్'​కు కొత్త కెప్టెన్​.. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌కు బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.