ETV Bharat / sports

సిడ్నీ టెస్టు: ఈ గణాంకాలపై ఓ లుక్కేయండి!

author img

By

Published : Jan 6, 2021, 5:22 PM IST

IND vs AUS SCG Test
సిడ్నీ టెస్టు: ఈ గణాంకాలపై ఓ లుక్కేయండి!

భారత్-ఆస్ట్రేలియా మధ్య గురువారం మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఇప్పటికే 1-1తేడాతో సిరీస్​లో సమంగా ఉన్న ఇరుజట్లకు సిడ్నీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​ చాలా కీలకం. అయితే ఈ మ్యాచ్​కు ముందు పలు రికార్డులు ఆటగాళ్లను ఊరిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

బోర్డర్​ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య గురువారం మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఇప్పటికే చెరో మ్యాచ్​ గెలిచిన ఇరుజట్లు సిరీస్​లో 1-1తేడాతో సమంగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్​ కీలకంగా మారింది. అయితే ఈ మ్యాచ్ జరిగే సిడ్నీ మైదానంలో భారత్​కు అంత గొప్ప రికార్డేమీ లేదు. ఇక్కడ ఆడిన 12 మ్యాచ్​ల్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఐదింటిలో ఆసీస్ గెలవగా 6 మ్యాచ్​లు డ్రాగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఓసారి సిడ్నీ మైదానంలో జరగబోయే మ్యాచ్​కు ముందు నెలకొన్న ఆసక్తికర రికార్డులపై ఓ లుక్కేద్దాం.

ధోనీ సరసన

సిడ్నీ టెస్టులో రహానె జట్టును గెలిపిస్తే మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు. తొలి నాలుగు టెస్టులు విజయం సాధించిన భారత కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ సరసన నిలుస్తాడు. ఇప్పటివరకు మూడు టెస్టులకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించిన రహానె అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచాడు. అయితే బ్యాట్స్‌మన్‌గానూ రహానె మరోరికార్డుపై కన్నేశాడు. మరో 203 పరుగులు చేస్తే కంగారూల గడ్డపై 1000 పరుగులు పూర్తిచేసిన అయిదో భారత ఆటగాడిగా నిలుస్తాడు. ఈ జాబితాలో సచిన్ (1809), కోహ్లీ (1352) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

IND vs AUS SCG Test
రహానె

సిడ్నీలో ఒకే విజయం

రోహిత్‌శర్మ చేరికతో టీమ్​ఇండియా బ్యాటింగ్‌ విభాగం బలపడింది. వరుసగా విఫలమవుతున్న ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ స్థానంలో రోహిత్‌శర్మ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. పేస్‌ను స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే రోహిత్‌పై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. కానీ సిడ్నీ మైదానంలో రికార్డు భారత్‌ను కలవరపెడుతోంది. ఇందులో 12 టెస్టుల్లో భారత్‌ ఒక్క విజయం మాత్రమే సాధించింది.

IND vs AUS SCG Test:
సిడ్నీ టెస్టులో భారత్

42 ఏళ్ల నిరీక్షణ

1978లో బిషన్‌సింగ్‌ బేడీ నాయకత్వంలో భారత జట్టు ఇన్నింగ్స్‌ రెండు పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తుచేసింది. ఆ తర్వాత తొమ్మిది టెస్టుల్లో భారత్‌ తలపడినా మరో గెలుపు అందుకోలేకపోయింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై మిగిలిన టెస్టులను డ్రా గా ముగించింది. 42 ఏళ్ల సిడ్నీ గెలుపు నిరీక్షణకు తెరదించాలని రహానె పట్టుదలగా ఉన్నాడు. తన కెప్టెన్సీలో ఓటమెరుగని రహానె ఈ అరుదైన ఘనత సాధిస్తాడో లేదో అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

సిక్సుల రికార్డుపై రోహిత్ గురి

ఆస్ట్రేలియా జట్టుపై ఎవరికి సాధ్యం కాని రికార్డుపై కన్నేశాడు టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. సిడ్నీ మ్యాచ్​లో ఓ సిక్సు బాదితే ఆసీస్​పై 100 సిక్స్​లు (అన్ని ఫార్మాట్​లలో కలిపి) బాదిన తొలి క్రికెటర్​గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు కంగారూలపై ఆడిన 64 మ్యాచ్​ల్లో ఇతడు 99 సిక్సులు బాదాడు. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 63 సిక్సులతో తర్వాత స్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్ల విషయానికొస్తే సచిన్, ధోనీ 60 సిక్సులు బాదారు.

IND vs AUS SCG Test
రోహిత్

పుజారా 6 వేల పరుగులు

ఈ సిరీస్​లో పేలవ ప్రదర్శన చేస్తున్నాడు పుజారా. గత సిరీస్​లో అద్భుత బ్యాటింగ్​తో ఆకట్టుకున్న ఈ నయా వాల్ ఈ సిరీస్​లో ఆడిన రెండు మ్యాచ్​ల్లో 43, 0, 17, 3 పరుగులకే పరిమితమయ్యాడు. సిడ్నీలో జరగబోయే టెస్టులో మరో 97 పరుగులు చేస్తే టెస్టుల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకున్న 11వ భారత బ్యాట్స్​మన్​గా నిలుస్తాడు. ప్రస్తుతం పుజారా 132 ఇన్నింగ్స్​ల్లో 5,903 పరుగులతో ఉన్నాడు. సగటు 47.60గా ఉంది. చెప్పుకోదగిన విషయం ఏంటంటే టెస్టుల్లో పుజారా చివరి శతకం సిడ్నీ మైదానంలోనే చేశాడు. 2019 న్యూ ఇయర్ టెస్టులో 373 బంతుల్లో 193 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. దీంతో ఈసారి కూడా అదే మ్యాజిక్​ను రిపీట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

IND vs AUS SCG Test
పుజారా

లియోన్ 400 వికెట్లు

ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ ప్రస్తుతం 98 మ్యాచ్​ల్లో 394 వికెట్లు సాధించాడు. మరో 6 వికెట్లు దక్కించుకుంటే టెస్టుల్లో 400 వికెట్లు తీసిన మూడో ఆసీస్ బౌలర్​గా చరిత్ర సృష్టిస్తాడు. షేన్ వార్న్ (708), మెక్​గ్రాత్ (563) ఇతడి కంటే ముందున్నారు.

IND vs AUS SCG Test
లియోన్

సెహ్వాగ్ రికార్డుపై రహానె కన్ను

టీమ్ఇండియా తాత్కాలిక సారథి అజింక్యా రహానె ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై రెండు సెంచరీలు సాధించాడు. ఆ రెండు కూడా మెల్​బోర్న్ మైదానంలోనే చేయడం గమనార్హం. అయితే ఇతడు సిడ్నీలో జరిగే మ్యాచ్​లో సెంచరీ చేస్తే ఆసీస్​పై టెస్టుల్లో మూడు సెంచరీలు చేసిన సెహ్వాగ్ సరసన నిలుస్తాడు. సచిన్ అందరికంటే ముందున్నాడు. ఇతడు కంగారూ జట్టుపై 11 సెంచరీలు చేశాడు. సునీల్ గావస్కర్ (8), కోహ్లీ (7), లక్ష్మణ్ (6), పుజారా (5) తర్వాత స్థానాల్లో ఉన్నారు.

ఇవీ చూడండి: కెప్టెన్ కోహ్లీకి విరుద్ధ ప్రయోజనాల సెగ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.