ETV Bharat / sports

'బాబర్ పెద్ద గుండు సున్నా... దయచేసి అతడిని విరాట్​తో పోల్చకండి'.. పాక్ మాజీ ఫైర్

author img

By

Published : Dec 20, 2022, 9:53 PM IST

KOHLI BABAR
KOHLI BABAR

ఇంగ్లాండ్‌ చేతిలో పాకిస్థాన్‌కు చావుదెబ్బ. వరుసగా మూడో టెస్టులోనూ ఓడిన పాక్‌.. అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకొంది. దీంతో కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై ఒక్కసారిగా తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ జట్టు మాజీ ఆటగాడు డానిష్ కనేరియా సైతం బాబర్​పై విమర్శలు గుప్పించారు.

స్వదేశంలో పాకిస్థాన్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటిది ఇంగ్లాండ్‌ ఏకంగా మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది. ఇలా చేసిన మొదటి జట్టుగా ఇంగ్లాండ్‌ అవతరించింది. బజ్‌బాల్‌ క్రికెట్‌ ఆడుతూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌పై తీవ్ర విమర్శలు రేగాయి. పాక్‌ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా అయితే బాబర్ ఆజమ్‌ను 'అతి పెద్ద గుండుసున్నా' అంటూ అభివర్ణించాడు. టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో బాబర్‌ను పోల్చడం సరైంది కాదని పేర్కొన్నాడు.

డానిష్ కనేరియా

"అభిమానులు ఇప్పటికైనా విరాట్ కోహ్లీతో బాబర్‌ను పోల్చడం ఆపాలి. రోహిత్, విరాట్ అగ్రశ్రేణి ఆటగాళ్లు. వారితో సరిపోయే ప్లేయర్లు పాకిస్థాన్‌ జట్టులో లేనేలేరు. మాటలు మాత్రం కోటలు దాటేపోయేలా ఉంటాయి. ఫలితాలు మాత్రం శూన్యం. ఇక కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌ పెద్ద గుండుసున్నా. జట్టును నడిపించే అర్హత అతడికి లేదు. మరీ ముఖ్యంగా టెస్టుల్లో టీమ్‌కు నాయకత్వం వహించే సామర్థ్యం లేదు. అయితే బాబర్‌కు మరో మంచి అవకాశం దక్కింది. బెన్‌ స్టోక్స్‌, బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను చూసి చాలా నేర్చుకోవచ్చు. లేకపోతే ఈగోను పక్కన పెట్టి కెప్టెన్సీ ఎలా చేయాలని సర్ఫరాజ్‌ అహ్మద్‌ను అడగాలి. అదేవిధంగా సుదీర్ఘ ఫార్మాట్‌లో అతడు ఆడకపోవడమే మంచిది" అని డానిష్ కనేరియా కీలక వ్యాఖ్యలు చేశాడు.

గత పొట్టి ప్రపంచకప్‌ కంటే ముందు జరిగిన ఏడు టీ20ల సిరీస్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్‌ 4-3 తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ 3-0 తేడాతో కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది. మొదటి రెండు టెస్టుల్లో పాకిస్థాన్‌కు లక్ష్యం విధించిన ఇంగ్లాండ్‌.. చివరి మ్యాచ్‌లో మాత్రం ఛేదన చేసి మరీ విజయం సాధించడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.