ETV Bharat / sitara

చిన్నప్పుడే హీరోయిన్ అని చెప్పుకొనేదాన్ని: నటి డింపుల్ హయాతి

author img

By

Published : Jan 30, 2022, 7:12 AM IST

Dimple hayathi
డింపుల్ హయాతి

Dimple hayathi movies list: 'గద్దలకొండ గణేష్'లో అవకాశం రాకముందు నిరాశలోకి వెళ్లిపోయానని చెప్పింది నటి డింపుల్ హయాతి. ప్రస్తుతం పలు సినిమాల్లో కథానాయికగా చేస్తోంది. ఈ క్రమంలో తన గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.

Dimple hayathi khiladi: వెండితెరపై తెలుగమ్మాయిలు క్రమం తప్పకుండా మెరుస్తూనే ఉన్నారు. వాళ్లకు తగిన ప్రోత్సాహం దక్కాలంతే. 'గద్దలకొండ గణేష్‌' ప్రత్యేక గీతంలో డింపుల్‌ హయాతిని చూడగనే 'ఈ అందం సూపర్‌హిట్టు' అనేశారు ప్రేక్షకులు. త్వరలోనే రవితేజతో కలిసి 'ఖిలాడి'లో సందడి చేయనుంది. గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా డింపుల్‌ హయాతితో 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆమె చెప్పిన విషయాలివీ..

'గద్దలకొండ గణేష్‌' తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఎందుకింత విరామం?

సరైన సినిమా కోసం ఎదురు చూశా. చిత్ర పరిశ్రమలో మనం వేసే ప్రతీ అడుగూ పక్కాగా ఉండాల్సిందే కదా. 'గద్దలకొండ గణేష్‌'లోని సూపర్‌హిట్టు పాట తర్వాత అన్నీ అలాంటి అవకాశాలే వచ్చాయి. నేను కలలుగన్న హీరోలతో తెరని పంచుకునే అవకాశం వచ్చినా కాదనుకుంటున్నానే అని బాధగా అనిపించేది. కానీ నేను డ్యాన్సే కాదు, నటించగలననీ నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక గీతాలు చేయనని చెప్పా. అలాగని ప్రత్యేక గీతాలు ఇకపై చేయనని కాదు, కావాలంటే ఎప్పుడైనా చేయొచ్చు. కథానాయికగా సరైన సినిమా చేయాలనే 'ఖిలాడి' వరకు ఎదురు చూశా.

khiladi dimple hayathi
ఖిలాడి సినిమాలో రవితేజతో డింపుల్

'ఖిలాడి'లో అవకాశం ఎలా వచ్చింది?

రమేష్‌ వర్మ నా ఫొటోలు చూశారు. కథ చెప్పాక, ఒక వారంలో లుక్‌ టెస్ట్‌ అన్నారు. రవితేజ, నేను, మీనాక్షి చౌదరిలని కలిపి లుక్‌ టెస్ట్‌ చేశారు. లుక్‌ టెస్ట్‌ అనేది నా కెరీర్‌లో తొలిసారి. తర్వాత నన్ను ఎంపికచేశారు. రవితేజ నన్ను ఎంతో ప్రోత్సహించారు.

ఇందులో పాత్ర ఎలా ఉంటుంది?

పక్కింటి అమ్మాయిగానూ, గ్లామరస్‌గా కనిపించే ట్రెండీ అమ్మాయిగానూ రెండు రకాలుగా కనిపించే పూర్తిస్థాయి పాత్ర నాది. నటిగా నాకు సంతృప్తినిచ్చిన పాత్ర ఇది. నట ప్రయాణం గురించి ఎలాంటి కలలు కన్నానో... అలాంటి పాత్రనే చేశా. చిత్రీకరణ చాలా తృప్తినిచ్చింది. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. విశాల్‌తో కలిసి చేసిన 'సామాన్యుడు'లోనూ పూర్తిస్థాయి కథా నాయికగా నటించా. ఈరెండు సినిమాలూ ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. హిందీలో 'అత్రంగీ రే' చిత్రంలో చిన్న పాత్ర చేశా. అదీ మంచి గుర్తింపు తెచ్చింది.

ఒక తెలుగు కథానాయికగా ఎలాంటి ప్రోత్సాహం లభిస్తోంది?

ఇప్పటివరకైతే పరిశ్రమ స్పందన సానుకూలంగానే ఉంది. చాలామందికి ఎదురైనట్టుగానే కొన్ని మంచి, చెడు అనుభవాల తర్వాత ఇక్కడి వరకు వచ్చా. కొంచెం నలుపు రంగు చర్మంతో కనిపించే అమ్మాయిని. పరిశ్రమలో తెల్లటి రంగుకీ, అందానికే ఎక్కువ ప్రాధాన్యం. ఇప్పుడు ఆ కోణం మారుతోంది. ప్రతిభకు తగ్గ ప్రాధాన్యం దక్కుతోంది. అదొక మంచి పరిణామం.

మీ రంగు విషయంపై మీకెప్పుడైనా అవమానాలు ఎదురయ్యాయా?

'గద్దలకొండ గణేష్‌'కు ముందు చాలా సినిమా కార్యాలయాలకు వెళ్లాను. ఎన్నిసార్లు తిరస్కారాలు ఎదురయ్యేవో లెక్కేలేదు. నాతో అనేవాళ్లు కాదు కానీ, నేను వెళ్లాక నలుపుగా ఉంది, ఫెయిర్‌ స్కిన్‌ ఉన్న అమ్మాయి కావాలనేవాళ్లు. అప్పుడు కొంచెం బాధగా అనిపించేది. తీవ్ర నిరాశతో ఉన్న సమయంలో 'గద్దలకొండ గణేష్‌'లో పాట చేశా. కెరీర్‌కు ప్లస్‌ పాయింట్‌ అది.

Dimple hayathi
డింపుల్ హయాతి

తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు 'గద్దలకొండ గణేష్‌' చేశా అన్నారు. అంతకు ముందు ఏం జరిగింది?

ఓ అగ్ర దర్శకుడితో పెద్ద సినిమా చేశా. అందులో ప్రధాన కథానాయికని నేను. 90 శాతం చిత్రీకరణ అయ్యాక అది ఆగిపోయింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే 'గద్దలకొండ గణేష్‌'లో ప్రధాన కథానాయిక పాత్ర కోసం నన్ను ఆడిషన్‌ చేశారు దర్శకుడు హరీష్‌ శంకర్‌. అప్పటికే ఆ పెద్ద సినిమా చేస్తుండడం వల్ల 'గద్దలకొండ గణేష్‌'కు కాల్షీట్లు కేటాయించలేకపోయా. కానీ అంతలోనే చేస్తున్న సినిమా ఆగిపోవడం వల్ల నేను తీవ్ర నిరాశకి గురయ్యా. అది హరీష్‌శంకర్‌కు తెలియడం వల్ల 'గద్దలకొండ గణేష్‌'లో ప్రత్యేక గీతం చేయమని చెప్పారు. ఆయన్ని నమ్మి చేశా. అది నా కెరీర్‌ను మలుపు తిప్పింది.

"మా ఇంట్లో ప్రతి ఒక్కరూ నటులే, ప్రతి ఒక్కరూ నృత్యకారులే. విజయవాడలో పుట్టా, హైదరాబాద్‌లో పెరిగా. అంతకుమించి నా కుటుంబ నేపథ్యం గురించి చెప్పను. నా స్వశక్తితోనే వచ్చాను, నా గుర్తింపునే నేను స్వీకరిస్తాను. నా అసలు పేరు డింపుల్‌. మరీ చిన్నగా ఉందని, సంఖ్యాశాస్త్రం ప్రకారం హయాతి అని అదనంగా జోడించా. చిన్నప్పుడే నేను హీరోయిన్‌ను అని చెప్పుకొనేదాన్ని. నాకు సినిమా అంటే అంత పిచ్చి. పదహారో ఏట 'గల్ఫ్‌' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టా. కథానాయిక ఓ తెలుగమ్మాయి అనగానే ఇంతవరకే చేయగలదని, ఆమెని ఇలాగే చూడగలం అని ముందే కొన్ని హద్దులు గీస్తుంటారు. వాటిని చెరిపేయడమే లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నా. నా ఆలోచనలు ఆధునికంగా ఉంటాయి".

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.