ETV Bharat / opinion

అతివాదులకు పట్టం కట్టిన ఇరాన్​!

author img

By

Published : Jun 21, 2021, 8:16 AM IST

raisi
రైసీ

ఇరాన్​లో ఇటీవల జరిగిన తాజా ఎన్నికల్లో ఆ దేశ న్యాయవ్యవస్థ సారథి, అతివాద నేత సయ్యద్​ ఇబ్రహీం రైసీ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇరాన్‌ సుప్రీం నేత అలీ ఖమేనీ ఆశీస్సులు లభించినవాడిగా రైసీ ఏకపక్ష విజయం ముందుగా ఊహించిందే. ప్రస్తుత అధ్యక్షుడు హసన్‌ రౌహానీతో నాలుగేళ్ల క్రితం ఎన్నికల్లో తలపడి ఓటమి పాలైన దరిమిలా వరసగా కీలక పదవులు దక్కడం రైసీకి బాగా కలిసివచ్చింది.

ఇరాన్‌ తాజా అధ్యక్ష ఎన్నికల్లో దేశ న్యాయవ్యవస్థ సారథి, అతివాద నేతగా పేరొందిన సయ్యద్‌ ఇబ్రహీం రైసీకి అధికారం దఖలుపడింది. పోలైన ఓట్లలో 62 శాతం ఒడిసి పట్టిన తీరు, రైసీ గెలుపు నల్లేరుపై బండి నడకేనని చాటుతోంది. ఇరాన్‌ సుప్రీం నేత అలీ ఖమేనీ ఆశీస్సులు లభించినవాడిగా రైసీ ఏకపక్ష విజయం ముందుగా ఊహించిందే. ప్రస్తుత అధ్యక్షుడు హసన్‌ రౌహానీతో నాలుగేళ్ల క్రితం ఎన్నికల్లో తలపడి ఓటమి పాలైన దరిమిలా వరసగా కీలక పదవులు దక్కడం రైసీకి బాగా కలిసివచ్చిన అంశం. లోగడ ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధానంతరం 1988లో వేలాది రాజకీయ ఖైదీలను భౌతికంగా అంతమొందించడంలో భాగస్వామిగా పేరున్న రైసీ ఇప్పుడీ స్థాయికి ఇలా ఎదగడం కాలవైచిత్రి.

గద్దెనెక్కించిన అమెరికాపై వ్యతిరేకత..

ఇరానీ పౌరులకు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కొల్లబోయిందని అమెరికా తన సహజ బాణీలో విమర్శలు గుప్పిస్తోంది. అగ్రరాజ్యం పట్ల కరడుగట్టిన వ్యతిరేకతే రైసీకి లాభించిందన్నది యథార్థం. రౌహానీ పగ్గాలు చేపట్టక మునుపు 2005-13 సంవత్సరాల మధ్య అధ్యక్ష పీఠం అధిష్ఠించిన అతివాద నేత అహ్మదీ నెజాద్‌ జమానాలో అమెరికా ఐరోపా యూనియన్లతో నిరంతర ఘర్షణ కొనసాగేది. కొత్తగా రైసీ మార్గదర్శకత్వంలో నేడదే పునరావృతమయ్యే అవకాశాలు ప్రస్ఫుటమవుతున్నాయి. టెహరాన్‌ను అష్టదిగ్బంధనం చేసి తీరాలన్న కసి, పట్టుదలతో తెగేదాకా లాగిన డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరికి విరుగుడుగా చైనాతో నెయ్యానికి ఇరాన్‌ మొగ్గడం తెలిసిందే. శ్వేత సౌధాధిపతిగా బైడెన్‌ రాకతో సమీకరణాల్లో గుణాత్మక మార్పు కనిపిస్తున్నా- రైసీ సారథ్యం ఇరాన్‌ను ఏ తీరాలకు చేర్చనుందో ప్రస్తుతానికి అగమ్యం.

భారత్​తో పెరిగిన దూరం..

అమెరికా ఆంక్షల నేపథ్యంలో టెహరాన్‌- దిల్లీ మధ్య దూరం పెరిగింది. ఇటీవల కుదిరిన పాతికేళ్ల ఒప్పందంతో ఇరాన్‌, చైనా పరస్పరం చేరువయ్యాయి. స్వాభావిక మిత్రదేశంగా గతంలో కుదుర్చుకున్న ఉభయతారక ఒప్పందాల స్ఫూర్తి ఆవిరైపోతున్న తరుణంలో ఇరాన్‌ శాశ్వతంగా దూరమైపోకుండా ఎలా కాచుకోవాలన్న దానిపై భారత్‌ దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది!

రైసీ సారథ్యంలో భారత్​కు ప్రయోజనం సిద్ధించేనా..?

సుమారు నాలుగు దశాబ్దాల క్రితం అయతొల్లా ఖొమైనీ సారథ్యాన ఇస్లామిక్‌ ప్రభుత్వం ఏర్పాటైంది మొదలు ఇరాన్‌, అమెరికా కత్తులు దూసుకొనే దృశ్యాలు సర్వసాధారణమయ్యాయి. టెహరాన్‌ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా అమెరికా ఆంక్షల విధింపు మార్గాన్ని ఆశ్రయించడం సహజంగానే ఇరాన్‌ను భగ్గుమనిపించింది. 'అంతర్జాతీయ పోలీసు'ను నిగ్గదీసే ఇస్లామిక్‌ శక్తిగా కాలూచేయీ కూడదీసుకుంది. ఇప్పుడు రైసీ గెలుపొందిన సమాచారం వెలువడగానే- ఇక పశ్చిమాసియాలో అణ్వాయుధ స్పర్థ పెచ్చరిల్లుతుందన్న ఇజ్రాయెల్‌ స్పందన, భిన్న శిబిరాల అంచనాలను కళ్లకు కట్టేదే. రైసీ ఏలుబడి దూకుడుకు పర్యాయపదంగా రుజువైతే, అది భారత్‌ ప్రయోజనాలను ఏ మేరకు ప్రభావితం చేయనుందన్నది చిక్కు ప్రశ్న. ఇప్పటికే గొట్టపు మార్గంలో చౌకగా సహజవాయు నిక్షేపాల సరఫరా అవకాశాన్ని కోల్పోయిన ఇండియాకు- వ్యూహాత్మక చాబహార్‌ ప్రాజెక్టు విషయంలోనూ తల బొప్పికట్టింది. చైనా, రష్యా, ఇరాన్ల నడుమ బంధం బలపడుతున్న కొద్దీ వాటితో భారత్‌కు దూరం పెరుగుతోంది.

చైనా ఒప్పందాల పరిస్థితి ఏంటి?

ఇరాన్‌లో చైనా భూరి పెట్టుబడులకు, బదులుగా రాయితీ ధరలపై చమురు సరఫరాలకు కుదిరిన ఒప్పందం మున్ముందు ఎలా చిలవలు పలవలు వేసుకుపోనుందో ఊహకందడం లేదు! మూడేళ్ల క్రితం రౌహానీ భారత పర్యటనలో భాగంగా భద్రత, వాణిజ్యం, ఇంధనం, ఉగ్రవాదం తదితర అంశాలపై విస్తృత సంప్రతింపుల అనంతరం తొమ్మిది ఒప్పందాలు ముడివడ్డాయి. ఏ ఒక్క అంశంపైనా భారత్‌ వైఖరితో తమకు భిన్నాభిప్రాయం లేదన్న నాటి రౌహానీ ప్రకటన తాలూకు స్నేహసుగంధం ఇప్పటికే ఇగిరిపోయింది. ఆ స్థాయి సన్నిహిత సంబంధాల పునరుద్ధరణకు ఇరాన్‌లో కొత్తగా పొద్దు పొడిచిన ఇబ్రహీం రైసీ జమానా ఏ మేరకు దోహదపడుతుందో చూడాలి!

ఇదీ చూడండి: గతుకుల బాటలో కాంగ్రెస్‌.. పూర్వవైభవం దక్కేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.