ETV Bharat / opinion

జిన్‌పింగ్‌ కబంధహస్తాల్లో చైనా

author img

By

Published : Mar 23, 2021, 7:45 AM IST

Chinese President Xi Jinping is following a dictatorial trend
జిన్‌పింగ్‌ కబంధహస్తాల్లో చైనా

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్​ నియంతృత్వ పోకడలు అనుసరిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరిగిన ఆ దేశ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ భేటీ ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. జిన్​పింగ్​ రెండో విడత పదవీ కాలం 2022తో పూర్తికానున్నప్పటికీ.. ఆయన‌ వారసుడి ఊసే లేకుండా భేటీ ముగియడం చర్చనీయాంశమైంది.

అధికారం ఒక మత్తు.. అది తలకెక్కితే పతనం తప్పదు. నియంతను తలపిస్తున్న జిన్‌పింగ్‌ పాలనలో చైనా ప్రస్థానంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వారసుడి ఊసే లేకుండా ఆ దేశ నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశం ఇటీవలే ముగిసింది. అందులో 2035 వరకు అభివృద్ధి ప్రణాళికలను చర్చించారు. 2022 నవంబరులో చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ) జనరల్‌ సెక్రటరీగా జిన్‌పింగ్‌ పదవీకాలం ముగియనుంది. ఆ తరవాత అధ్యక్ష పదవి రెండోవిడత పూర్తవుతుంది. కానీ, 2018లో 'రెండు పర్యాయాల' నిబంధనను తొలగించడంతో భవిష్యత్తులో ఆయన పదవి నుంచి తప్పుకోకపోవచ్చు. అంతేకాదు- హాంకాంగ్‌లో చట్టసభల్లోకి చైనా విధేయుల పేరిట తనవారిని ప్రతిష్ఠించేందుకు వీలుగా చట్టసవరణలు చేశారు. వాస్తవానికి చైనా వ్యవస్థాపకుడైన మావో కూడా నాటి దేశ ప్రీమియర్‌ ఝావో ఎన్‌లైతో కలిసి అధికారాన్ని పంచుకొన్నారు. ఆ తరవాత ఆధునిక చైనా ఆవిష్కర్త డెంగ్‌ షావ్‌ పింగ్‌ సమష్టి నాయకత్వాన్ని ప్రోత్సహించారు. పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. 1993లో జియాంగ్‌ జెమిన్‌ అధ్యక్షుడు అయ్యాక గతంలో షాంఘైలో తనతో కలిసి పనిచేసినవారికి పదవులు కట్టబెట్టారు. వీరిని షాంఘై గ్యాంగ్‌గా అభివర్ణించేవారు.

రాజకీయ వ్యవస్థకు చీడ

అధికార పోటీలోని మరో వర్గం సీసీవైఎల్‌ (చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ యూత్‌ లీగ్‌). షీ జిన్‌పింగ్‌ కంటే ముందు దేశ అధ్యక్షుడిగా ఉన్న హూ జింటావో ఈ వర్గానికి చెందిన వారే. ఆయన పాలన సమయంలోనే షాంఘై గ్యాంగ్‌, సీసీవైఎల్‌ వర్గాల మధ్య అధికార పంపిణీ నిమిత్తం అవగాహన ఏర్పడింది. ఈ క్రమంలోనే హూ తరవాత షాంఘై గ్యాంగ్‌కు చెందిన షీ జిన్‌పింగ్‌ చేతికి పార్టీ జనరల్‌ సెక్రటరీ, దేశాధ్యక్ష పగ్గాలొచ్చాయి. డెంగ్‌ షావ్‌ పింగ్‌ జోక్యం లేకుండా అగ్రనేతగా ఎదిగిన తొలివ్యక్తి జిన్‌పింగే! ఇక నామమాత్ర ప్రీమియర్‌ పదవి సీసీవైఎల్‌ నేత లీ కెక్వియాంగ్‌కు దక్కింది. ఇక్కడి నుంచి చైనా రాజకీయ వ్యవస్థ పునాదులు కదలడం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లో సీసీవైఎల్‌ పట్టు సడలి, వ్యక్తిగత పరపతి పెరిగేలా జిన్‌పింగ్‌ చర్యలు చేపట్టారు. జిన్‌పింగ్‌ సీసీవైఎల్‌ బడ్జెట్‌ను సగానికి కుదించేశారు. చైనా పాలనలో పార్టీదే కీలకపాత్ర. దీంతో బీజింగ్‌, గ్వాగ్‌ఝూ, షెన్‌జెన్‌ ప్రొవిన్షియల్‌ పార్టీ సెక్రటరీలుగా ఉన్న సీసీవైఎల్‌ సభ్యులను తొలగించి తన అనుచరులకు పదవులు కట్టబెట్టారు. బీజింగ్‌తో సహా పలు నగరాలను తన వర్గీయుల అధీనంలోకి తెచ్చారు. దేశంలోని 31 ప్రావిన్సుల్లో పార్టీ సెక్రటరీ, గవర్నర్‌ వంటి 62 కీలక పదవుల్లోని 92శాతం అత్యున్నతాధికారులు జిన్‌పింగ్‌ మనుషులేనని బ్రూకింగ్స్‌ సంస్థ విదేశీ విధాన విభాగ పరిశోధన వెల్లడించింది. జిన్‌పింగ్‌ తొలిసారి పగ్గాలు చేపట్టిన సమయంలో ఏర్పాటైన 18వ పొలిట్‌ బ్యూరోలోని 25 మంది సభ్యుల్లో అయిదుగురు మాత్రమే ఆయన అనుచరులు; 19వ పొలిట్‌ బ్యూరోలో ఆ సంఖ్య 15కు చేరింది. షాంఘై వర్గం, సీసీవైఎల్‌ను పూర్తిగా పక్కన పెట్టారు. పార్టీలో వ్యక్తిపూజ పెరిగి ప్రజలు, సాయుధ బలగాలు షీ జిన్‌పింగ్‌కు విధేయులుగా ఉండాలనే వాతావరణం నెలకొంది.

యాంట్‌ ఫైనాన్షియల్‌ ఐపీఓకు వస్తుందనుకొన్నవేళ ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్‌ అధినేత జాక్‌ మా హఠాత్తుగా అదృశ్యం కావడం పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేసింది. చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్‌ మనవడు ఆల్విన్‌ జియాంగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ బోయు క్యాపిటల్‌ అనుబంధ సంస్థల ద్వారా ‘యాంట్‌’లో భారీగా పెట్టుబడులు పెట్టారు. జియాంగ్‌ వర్గానికి చెందిన జియా క్వింగ్‌లిన్‌ అల్లుడూ దీనిలో పెట్టుబడి పెట్టారు. సరిగ్గా యాంట్‌ ఐపీఓకు ముందు జాక్‌మా చైనా బ్యాంకింగ్‌ వ్యవస్థపై తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. దీంతో వారిని ఆర్థికంగా దెబ్బతీయడానికి జిన్‌పింగ్‌కు అవకాశం లభించింది.

పొరుగు దేశాలతో విరోధం

జిన్‌పింగ్‌ అధికారం చేపట్టగానే అవినీతి వ్యతిరేక యుద్ధం పేరిట మూడు లక్షల మందిని జైళ్లలోకి నెట్టారు. దీంతో సీసీపీలో బలమైన నాయకత్వం తుడిచిపెట్టుకుపోయిందని చైనా వ్యవహారాల నిపుణుడు బిల్‌ బిషప్‌ అభిప్రాయపడ్డారు. పారిశ్రామికవేత్తలపై సీసీపీ నియంత్రణ ఇతర దేశాల్లో చైనా పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. జిన్‌పింగ్‌ దేశీయంగా ఆధిపత్యాన్ని ప్రదర్శించడంకోసం దుందుడుకు దౌత్య వైఖరిని అవలంబిస్తున్నారు. ఫలితంగా ఝావో ఇన్‌లై 'యునైటెడ్‌ ఫ్రంట్‌' విధానాలు డెంగ్‌ జావోపింగ్‌ '24 క్యారెక్టర్‌ వ్యూహం' మసకబారాయి. డ్రాగన్‌కు- జపాన్‌, ఫిలిప్పీన్స్‌, ఇండొనేసియా, వియత్నాం, మంగోలియా, భారత్‌, ఆస్ట్రేలియా, తైవాన్‌లతో వివాదాలు తీవ్రస్థాయికి చేరాయి. హాంకాంగ్‌ ఎన్నికల విధానంలో మార్పులు బ్రిటన్‌తో విరోధాన్ని తెచ్చిపెట్టాయి. ఇలాంటి దౌత్య వైఖరే చైనాను అడ్డుకునేందుకు క్వాడ్‌ కూటమికి ఊపిరులూదింది. కొవిడ్‌ వ్యాప్తి కొనసాగుతుండటంతో ఉత్పత్తి కేంద్రమైన చైనా విషయంలో చాలా ప్రపంచ దేశాలు ఉదాసీనంగా ఉంటున్నాయి. ఒక్కసారి వైరస్‌ వ్యాప్తి తగ్గాక డ్రాగన్‌ కట్టడి వ్యూహాలు పదునెక్కడం ఖాయం.

రచయిత - పెద్దింటి ఫణికిరణ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.