ETV Bharat / jagte-raho

రెండు నెలల్లో... రెండు ఏటీఎంలలో... లక్షల్లో చోరీ

author img

By

Published : Nov 17, 2020, 10:43 AM IST

two atms theft in hyderabad in san of two months
రెండు నెలల్లో... రెండు ఏటీఎంలలో... లక్షల్లో చోరీ

భాగ్యనగరంలో వరుస ఏటీఎం చోరీల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రధాన రహదారుపై ఉన్న ఏటీఎంలే లక్ష్యంగా చేసుకుని... గ్యాస్ కట్టర్ల సాయంతో దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. రెండు నెలల క్రితం చందానగర్​లోని ఎస్బీఐ ఏటీఎంలో 15లక్షల చోరీ జరిగిన ఘటన మరువక ముందే... తాజాగా వనస్థలిపురంలో మరో ఘటన జరగటం ఆందోళన కలిగిస్తోంది.

జన సంచారం తక్కువగా ఉన్న ఏటీఎంలే లక్ష్యంగా చేసుకుని... వాటిని ధ్వంసం చేసి చోరీలకు పాల్పడుతున్న కేసులు హైదరాబాద్​లో పెరుగుతున్నాయి. ముందుగా రెక్కీ నిర్వహించి.. పోలీసులు గస్తీ సమయాలు కూడా పరిశీలించి.. చోరీలకు పాల్పడుతుండటంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు నెలల వ్యవధిలోనే... రెండు ఎస్బీఐ ఏటీఎంలు ధ్వంసం చేసి లక్షలు రూపాయలను దుండగులు కాజేశారు.

పక్కా ప్రణాళికతో...

అక్టోబర్ 5న హైదరాబాద్-ముంబై ప్రధాన రహదారిపై చందానగర్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి చొరబడిన దొంగలు గ్యాస్ కట్టర్ల సాయంతో లోపలికి ప్రవేశించి... అందులో ఉన్న 15లక్షల రూపాలయలు చోరీ చేశారు. అనంతర అక్కడి నుంచి పరారయ్యారు. వీరి కోసం పోలీసులు ఇప్పటికీ గాలిస్తూనే ఉన్నారు. కొన్ని రోజులుగా ఏటీఎం పనిచేయకపోవడం... దీంతో తక్కువ జనసంచారం ఉండడం చూసి... అదును చూసి అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంలో అలార్మ్ లేకపోవడంతో దొంగలు సులభంగా చోరీ చేశారు.

లక్షలతో పరారు..

తాజాగా వనస్థలిపురంలోని సహారా రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడి దుండగులు ఆరు లక్షలకు పైగా నగదును దొంగిలించారు. కారులో వచ్చిన దుండగులు ఏటీఎం లోపలికి వెళ్లి... షట్టర్​ మూసేశారు. తమతో తెచ్చుకున్న గ్యాస్ కట్టర్ల సాయంతో ముందు సీసీ టీవి కెమెరాలను కాల్చివేశారు. అనంతరం ఏటీఎం మెషిన్​ను కత్తిరించి అందులోని సుమారు 8.5 లక్షల రూపాలయలను చోరీ చేశారు. వంద రూపాయల నోట్లు ఉన్న ర్యాక్ తెరుచుకోకపోవడంతో.. అక్కడి నుంచి ఎల్బీనగర్-విజయవాడ జాతీయ రహదారివైపు పరారయ్యారు.

సీసీ కెమెరాలతో..

ఈ మొత్తం తంతు ఏటీఎంకు ఎదురుగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్​లోని సీసీటీవి కెమెరాలో నమోదైంది. ఘటనకు కొద్దిసేపటి క్రితమే గస్తీ కానిస్టేబుళ్లు ఆ ప్రాంతంలో గస్తీ తిరిగి వెళ్లినట్టుగా కూడా రికార్డ్ అయ్యింది. ఉదయం చోరీ అయినట్లు గుర్తించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి 2.13 నుంచి 2.30గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్లుగా గుర్తించారు. ఘటనాస్థలంలో పోలీసు జాగిలాలతో తనిఖీ చేపట్టారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఎల్బీనగర్ డీసీసీ సన్‌ప్రీత్ సింగ్ చోరీపై ఆరా తీశారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

సెన్సార్​ సిస్టమ్​ లేకపోవడమే..

దేశంలోని అన్ని ఏటీఎం సెంటర్లు ముంబైలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ స్విచ్​కు అనుసంధానం చేసి ఉంటాయి. ఎవరైనా ట్యాంపరింగ్​కు పాల్పడినా, ధ్వంసం చేయడానికి ప్రయత్నించినా వెంటనే అలారం మోగుతుంది. ముంబై కమాండ్ సెంటర్ నుంచి బ్యాంకు మేనేజర్​కు సమాచారం అందిస్తారు. మేనేజర్ స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. ఇదంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతుంది. కానీ కొన్ని పాత ఏటీఎం మెషన్లకు ఇలాంటి సెన్సార్ సిస్టమ్ లేకపోవడం వల్లనే ఈ తరహా చోరీలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: వనస్థలిపురంలో రెండు ఏటీఎంలలో చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.