ETV Bharat / international

ఉక్రెయిన్​కు అమెరికా 'పేట్రియాట్‌' క్షిపణులు.. ఇక రష్యా డ్రోన్లకు చుక్కలే!

author img

By

Published : Dec 27, 2022, 7:32 AM IST

us sending patriot missiles to ukraine
పేట్రియాట్​ క్షిపణి వ్యవస్థ

రష్యా-ఉక్రెయిన్‌ యుద్దం మొదలై పది నెలలు దాటింది. మొదట్లో ఉక్రెయిన్​ బలగాలు రష్యా సైన్యం పైకి ఎదురుదాడికి దిగలేక పోయినా తర్వాత క్రమంగా పుంజుకుంటోంది. రష్యాను సేనలను తిప్పికొట్టడమే కాకుండా ఎదురుదాడికి దిగుతోంది. అయితే ఆయుధ సంపత్తిలో ఉక్రెయిన్​పై రష్యాదే పైచేయి. దీంతో జెలెన్​స్కీ.. అమెరికా సహా పశ్చిమ దేశాల సహాయాన్ని కోరుతున్నారు. అయితే అమెరికా.. ఉక్రెయిన్​కు సాయంతో పాటుగా.. ప్రత్యర్థికి చుక్కలు చూపించే పేట్రియాట్​ క్షిపణి వ్యవస్థను కూడా అందించినున్నట్లు తెలిపింది.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్దం మొదలై 10 నెలలు దాటింది. పుతిన్‌ బలగాల ధాటికి తొలినాళ్లలో కకావికలమైన జెలెన్‌స్కీ సేన క్రమంగా పుంజుకుంటోంది! ప్రత్యర్థి దాడులను తిప్పికొడుతూనే ఎదురుదాడులు కూడా చేపడుతోంది. అయితే ఆయుధ సంపత్తిలో ఉక్రెయిన్‌పై రష్యాది స్పష్టమైన పైచేయి. అందుకే తమకు ఆయుధాలు, ఇతర రక్షణ వ్యవస్థలను అందించాలంటూ అమెరికా సహా పశ్చిమ దేశాలను జెలెన్‌స్కీ పదేపదే కోరుతున్నారు. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఇటీవల అమెరికాలో పర్యటించారు కూడా. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌కు అమెరికా తాజాగా తీపి కబురు అందించింది. ఆ దేశానికి దాదాపు రూ.13,500 కోట్ల సైనిక సాయాన్ని ప్రకటించింది. అందులో భాగంగా అత్యాధునిక పేట్రియాట్‌ క్షిపణి వ్యవస్థను అందించనున్నట్లు తెలిపింది. ప్రధానంగా రష్యా నుంచి దూసుకొస్తున్న డ్రోన్లను సమర్థంగా నిలువరించేందుకు ఈ రక్షణ వ్యవస్థ దోహదపడే అవకాశాలున్నాయి.

ఏమిటీ పేట్రియాట్‌?
పేట్రియాట్‌ అనేది 'ఫేజ్డ్‌ అర్రే ట్రాకింగ్‌ రాడార్‌ ఫర్‌ ఇంటర్‌సెప్ట్‌ ఆన్‌ టార్గెట్‌'కు సంక్షిప్త రూపం. ఉపరితలం నుంచి గగనతలంలోకి క్షిపణులను ప్రయోగించే రక్షణ వ్యవస్థ ఇది. శత్రు బలగాల నుంచి దూసుకొచ్చే క్షిపణులు/డ్రోన్లను అడ్డుకొని, వాటిని నిర్వీర్యం చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ప్రపంచంలోకెల్లా అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థల్లో ఇదొకటి. ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు వీలుగా పలు వెసులుబాట్లు కల్పించారు.

ఏమేం ఉంటాయ్‌?
ఓ ట్రక్కు పైనుంచి ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఇందులో 8 లాంఛర్లు ఉంటాయి. ఒక్కో లాంఛర్‌లో గరిష్ఠంగా 4 క్షిపణి ఇంటర్‌సెప్టార్‌ల చొప్పున ఉంటాయి. వీటితోపాటు గ్రౌండ్‌ రాడార్‌, కంట్రోల్‌ స్టేషన్‌, జనరేటర్‌ కూడా ఈ క్షిపణి వ్యవస్థలో భాగమే. దీని నిర్వహణకు 90 మంది సిబ్బంది అవసరం.

ఎలా పనిచేస్తుంది?
రాడార్లు, కమాండ్‌-కంట్రోల్‌ సాంకేతికత, వివిధ రకాల ఇంటర్‌సెప్టార్ల (పీఏసీ-2, పీఏసీ-3 వంటివి) ప్యాకేజీ వంటిది పేట్రియాట్‌. ఇవన్నీ కలిసికట్టుగా పనిచేయడం ద్వారా శత్రు బలగాల వ్యూహాత్మక బాలిస్టిక్‌ క్షిపణులు, క్రూయిజ్‌ క్షిపణులు, డ్రోన్లు, ఆధునిక విమానాలు, ఇతర ప్రమాదాలను గుర్తించి అడ్డుకుంటాయి.

ఉక్రెయిన్‌కు ఎలా ప్రయోజనకరం?
రష్యా నుంచి దూసుకొచ్చే స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులతో పాటు కామికాజి డ్రోన్లను అడ్డుకునేందుకు పేట్రియాట్‌ను ఉక్రెయిన్‌ ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. సాధారణంగా ఈ క్షిపణి రక్షణ వ్యవస్థలను ఓ బెటాలియన్‌ తరహాలో మోహరిస్తారు. ఒక్కో బెటాలియన్‌లో నాలుగు బ్యాటరీలు (క్షిపణి రక్షణ వ్యవస్థలు) ఉంటాయి. అమెరికా నుంచి జెలెన్‌స్కీ బలగాలకు మాత్రం ఒకటే బ్యాటరీ (అది కూడా ఇప్పటికిప్పుడు కాదు.. కొన్ని నెలల తర్వాతే) అందనుంది. పెద్ద నగరాలకు రక్షణ కల్పించడంలో ఇది అంతగా ప్రభావవంతంగా ఉండకపోవచ్చు.

ధర సుమారు: రూ.7,500 కోట్లు
అభివృద్ధి చేసిందెవరు: అమెరికాకు చెందిన రేథియాన్‌ టెక్నాలజీస్‌ కార్పొరేషన్‌
తొలిసారి ఎక్కడ మోహరించారు: పేట్రియాట్‌ను 1991 గల్ఫ్‌ యుద్ధంలో తొలిసారి ఉపయోగించారు. అప్పట్లో సౌదీ అరేబియా, కువైట్‌, ఇజ్రాయెల్‌లకు రక్షణగా మోహరించారు.
దీని రాడార్‌ పరిధి ఎంత: 150 కిలోమీటర్లకు పైగా
ప్రస్తుతం ఏయే దేశాలు వినియోగిస్తున్నాయి: అమెరికాతో పాటు మరో 17 దేశాలు పేట్రియాట్‌ను వినియోగిస్తున్నాయి. ఈ జాబితాలో జర్మనీ, నెదర్లాండ్స్‌, జపాన్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాలున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.