ETV Bharat / international

'కాంగ్రెస్ ఎన్నడూ బ్రిటిషర్లను నిందించలేదు.. మోదీ మాత్రం ఎప్పుడూ మాపైనే..'

author img

By

Published : Jun 5, 2023, 9:14 AM IST

Updated : Jun 5, 2023, 9:45 AM IST

Rahul Gandhi attacks PM Modi
Rahul Gandhi attacks PM Modi

Rahul Gandhi US Tour : ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్​ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. భవిష్యత్‌ గురించి ఆలోచించే సామర్థ్యం బీజేపీకి, ఆర్​ఎస్​ఎస్ లేవని రాహుల్‌ ఎద్దేవా చేశారు.

Rahul Gandhi US Tour : ప్రధాని నరేంద్ర మోదీ గతంలో వైఫల్యాలపై ఒకరిని నిందించడమే కానీ.. భవిష్యత్‌ గురించి ఎప్పుడూ మాట్లాడరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్.. న్యూయార్క్‌లోని జవిట్స్ సెంటర్‌లో భారత సంతతి ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రమాద మృతులకు సంతాపంగా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. భవిష్యత్‌ గురించి ఆలోచించే సామర్థ్యం బీజేపీకి, ఆర్​ఎస్​ఎస్ లేవని రాహుల్‌ ఎద్దేవా చేశారు. అద్దంలో చూసి కారు నడుపుతూ ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగే పరిస్థితుల్లో.. ప్రధాని మోదీ, బీజేపీ ఉన్నాయని విమర్శించారు. ద్వేషాన్ని ద్వేషంతో తెంచలేమన్న రాహుల్‌ గాంధీ.. ప్రేమతో మాత్రమే నివారించగలమని చెప్పారు.

"రైలు ప్రమాదం ఎందుకు జరిగిందంటే కాంగ్రెస్‌ 50 ఏళ్ల క్రితం నిర్మించిందని అంటారు. పుస్తకాల నుంచి పీరియాడిక్ టేబుల్, పరిణామ సిద్దాంతం ఎందుకు తొలిగించారంటే కాంగ్రెస్‌ 60 ఏళ్ల క్రితం పెట్టింది కాబట్టి అంటారు. వారి సత్వర స్పందన గతం చూడమని చెబుతుంది. మంత్రులు, ప్రధాని మాటలు వింటే వారు భవిష్యత్‌ గురించి మాట్లాడటంలేదని మీరు గుర్తిస్తారు. వారు గతం గురించే మాట్లాడతారు. గతానికి సంబంధించి ఒకరిని నిందిస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైలు ప్రమాదం జరిగితే బ్రిటిష్ వారి వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎప్పుడూ చెప్పలేదు. నాకు గుర్తుంది. కాంగ్రెస్ మంత్రి ఇది నా బాధ్యత కాబట్టి నేను రాజీనామా చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఇదే మన దేశంలో ఉన్న సమస్య." అని రాహుల్​ గాంధీ తెలిపారు.

రెండు సిద్ధాంతల మధ్య పోరాటం: రాహుల్​ గాంధీ
భారత్​లో రెండు సిద్ధాంతల మధ్య పోరాటం జరుగుతోందని రాహుల్​ గాంధీ అన్నారు. ఒకటి కాంగ్రెస్​ ఆచరించే సిద్ధాంతమైతే.. మరొకటి బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ ఆనుసరించే సిద్ధంతామన్నారు. ఒక సిద్ధాంతం వైపు వైపు మహాత్మా గాంధీ ఉన్నారన్న రాహుల్​.. మరో సిద్ధాంతం వైపు నాతూరాం గాడ్సే ఉన్నారని తెలిపారు. అమెరికా​లో ఉన్న భారత సంతతి పౌరులను రాహుల్​ గాంధీ కొనియాడారు. అక్కడ వారు జీవించే తీరును ప్రశంసించారు.

"భారత్​ నుంచి వచ్చిన దిగ్గజాలందరికి.. కొన్ని లక్షణాలు ఉన్నాయి. మొదట వారు సత్యాన్ని శోధించారు. దానికి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం పోరాడారు. రెండో విషయం.. వీరంతా వినయంగా ఉంటారు. అహంకారం ఉండదు. అమెరికాలోనూ భారతీయలు ఇలాగే పనిచేశారు. అందుకే ఇక్కడ వారు విజయం సాధించారు. అందుకు నేను వారి పట్ల గౌరవంతో ఉన్నాను." అని రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు.

భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రముఖ నాయలందరూ ప్రవాస భారతీయులేనన్నారు రాహుల్​ గాంధీ. మహాత్మా గాంధీ, బీఆర్​ అంబేడ్కర్, వల్లభాయ్​ పటేల్​, జవహార్​లాల్​ నెహ్రూ, సుభాష్​ చంద్రబోస్​ వంటి తదితర నాయకులు.. బయటి ప్రపంచంపై ఓపెన్ మైండ్​తో వ్యవహరించారని తెలిపారు.

Last Updated :Jun 5, 2023, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.