ETV Bharat / international

విదేశాల్లోనూ 'కింగ్​'లే.. ఆరు దేశాల అధ్యక్షులుగా భారత సంతతి వ్యక్తులు

author img

By

Published : Oct 24, 2022, 8:12 PM IST

Persons of Indian origin continuing in key positions
రిషి సునాక్​

బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నికైన రికార్డు సృష్టించారు రిషి సునాక్. దీంతో భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టిన ఆరో దేశంగా బ్రిటన్‌ నిలిచింది. ఏయే దేశాల్లో భారత మూలాలున్న వ్యక్తులు కీలక పదవులు చేపట్టారో ఓసారి చూద్దాం.

బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన రిషి సునాక్‌కు ఓ అరుదైన జాబితాలో చోటు దక్కింది. భారత మూలాలున్న వ్యక్తులు అధికారం చేపట్టిన ఆరో దేశంగా బ్రిటన్‌ నిలిచింది. ఇప్పటికే ఐదు దేశాల్లో అధ్యక్ష, ప్రధాని, ఉపాధ్యక్ష బాధ్యతల్లో భారత సంతతి వ్యక్తులు కొనసాగుతున్నారు. ఏయే దేశాల్లో భారత మూలాలున్న వ్యక్తులు కీలక పదవులు చేపట్టారో ఓసారి చూద్దాం.

గోవా మూలాలున్న ఆంటోనియో కోస్టా పోర్చుగల్‌ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆంటోనియో కోస్టా తండ్రి ఆర్నాల్డో డా కోస్టా.. గోవా కుంటుంబానికి చెందినవారు. ఇక ఇండో-గయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన మహమ్మద్‌ ఇర్ఫాన్‌ 2020లో గయానా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. మారిషస్‌ ప్రధానిగా 2017లో బాధ్యతలు చేపట్టిన ప్రవింద్‌ జుగ్నాథ్‌ భారత మూలాలున్న హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి.
మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ కుటుంబం కూడా భారత ఆర్యసమాజ్‌ హిందూ కుటుంబానికి చెందినదే. పలుమార్లు పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైన ఆయన.. 2019లో మారిషస్‌ అధ్యక్షుడు అయ్యారు.

దక్షిణ అమెరికాలోని సురినామ్‌ దేశాధ్యక్షుడిగా చంద్రికా ప్రసాద్‌ సంతోఖి కొనసాగుతున్నారు. 1959లో జన్మించిన ఆయన కుటుంబం కూడా భారత మూలాలున్నదే. ఇక భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఆమె పూర్వీకులు తమిళనాడులోని తిరువారూర్‌ జిల్లా తులసేంద్రిపురానికి చెందినవారు. కమలా హ్యారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడుకు చెందినవారు. ఇలా భారత మూలాలున్న వ్యక్తులు విదేశీ గడ్డపై కీలక పదవులు చేపడుతూ తమ సత్తా చాటుతున్నారు. కేవలం ఈ ఐదు దేశాలే కాకుండా ట్రినిడాడ్‌&టొబాగో, మలేసియా, ఫిజీ, ఐర్లాండ్‌ వంటి దేశాల్లో భారత సంతతి వ్యక్తులు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.