ETV Bharat / international

ఆ దేశాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధి.. రికార్డు స్థాయిలో కేసులు

author img

By

Published : May 30, 2022, 8:05 AM IST

congo haemorrhagic fever
ఆ దేశాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక వ్యాధి.. రికార్డు స్థాయిలో కేసులు

Iraq News: ప్రాణాంతక వ్యాధి వ్యాప్తితో ఇరాక్​ వణికిపోతోంది. కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. జ్వరం, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్న ఈ వైరస్‌తో మరణాల రేటు అధికంగా ఉండడం కలవరపెడుతోంది.

Congo haemorrhagic fever: జంతువుల్లో కనిపించే రక్తం పీల్చే పేలు (Tick Bite) విస్తృత వ్యాప్తితో ఇరాక్‌ వణికిపోతోంది. జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తోన్న ఈ ప్రాణాంతక వ్యాధి కేసులు ఇటీవల భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ఈవ్యాధి బారినపడి ఈ ఏడాది ఇప్పటికే 19 మంది ప్రాణాలు కోల్పోయారు. జ్వరం, ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్న ఈ వైరస్‌తో మరణాల రేటు అధికంగా ఉండడం కలవరపెడుతోంది. దీన్ని ఎదుర్కొనేందుకు ఇరాక్‌ గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు ధరించి పశువులపై క్రిమిసంహారకాలను పిచికారి చేయడాన్ని విస్తృతం చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

మరణాల రేటు అధికం..: నైరోవైరస్‌ అని పిలిచే క్రిమియన్‌-కాంగో హెమోరేజిక్‌ ఫీవర్‌ (CCHF) అనేది పేలు (Tick Bite) ద్వారా జంతువుల్లో వ్యాపిస్తుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల్లో వైరస్‌ వాహకంగా ఈ పేలు పనిచేస్తుంది. అలా వైరస్‌ బారినపడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు లేదా వైరస్‌ ఉన్న పేలు కుట్టినప్పుడు లేదా పశువధ కేంద్రాల్లోని స్త్రావాల ద్వారా మానవులకు సోకుతుంది. వైరస్‌ సోకిన వ్యక్తుల రక్తం, మలం, చెమట కణాల ద్వారా ఇతర వ్యక్తులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తులకు శ్వాస ఆడకపోవడం, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, తీవ్ర జ్వరంతోపాటు ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం జరిగి చివరకు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రమాదకర వ్యాధి కారణంగా ఇరాక్‌లో ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి మరణాల రేటు 10 నుంచి 40 శాతం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది.

43ఏళ్లలో తొలిసారి ఈస్థాయిలో..: సీసీహెచ్‌ఎఫ్‌కు కారణమయ్యే వైరస్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌లు లేవు. వేగంగా వ్యాపించే ఈ వ్యాధి వల్ల మానవ శరీరంలో అంతర్గతంగా, బాహ్య అవయవాల నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా ప్రాణాంతకమైన ఈ వ్యాధి సోకిన ప్రతి ఐదులో రెండో వంతు కేసుల్లో మరణాలు సంభవిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రతిఏడాది ఇరాక్‌లో ఐదు కంటే తక్కువ కేసులే నమోదవుతుండగా ఈసారి మాత్రం ఊహించని విధంగా కేసులు నమోదవుతున్నట్లు అక్కడి ధీ ఖార్‌ ప్రావిన్సులోని వైద్యాధికారి హైదర్‌ హ్యాన్‌టౌక్‌ వెల్లడించారు. ఇరాక్‌లో 1979లో తొలిసారి వైరస్‌ వెలుగు చూడగా.. గడిచిన 43ఏళ్లలో ఈ స్థాయిలో కేసులను ఎన్నడూ చూడలేదన్నారు. అయితే రైతులు, కబేళాలో పనిచేసే కార్మికులు, పశువైద్యుల్లోనే ఈ కేసులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

కారణం అదేనా..: ఇరాక్‌లో ఈ వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందడానికి చాలా కారణాలు ఉన్నాయని ఇరాక్‌లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి అహ్మద్‌ జౌటెన్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా 2020-2021 మధ్య కాలంలో పశువుల్లో క్రిమిసంహారక పిచికారి చేయకపోవడం, గ్లోబర్‌ వార్మింగ్‌ వంటివి వ్యాధి వ్యాప్తికి పలు కారణాలుగా అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోన్న ఈ పేలు వ్యాధిని అరికట్టేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గ్రామాల్లోని ఆరోగ్య కార్యకర్తలు పీపీఈ కిట్లు, అద్దాలు, మాస్కులు ధరించి పశువులపై క్రిమిసంహారక మందులను పిచికారి చేస్తున్నారు. అయితే, జులై మాసంలో అక్కడ పండుగలు ఉండడం, జంతు మాంసం విక్రయాలు భారీగా పెరగనుండడంతో ఈ కేసుల సంఖ్య మరింత అధికంగా ఉండవచ్చని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: భారీ పేలుడు శబ్దం..​ విమానం మాయం.. 22 మంది పరిస్థితి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.