ETV Bharat / international

'కలిసి సాగుదాం' అంటూ చైనా, అమెరికా స్నేహగీతం- 4గంటలపాటు బైడెన్, జిన్​పింగ్ భేటీ

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 9:57 AM IST

Updated : Nov 16, 2023, 10:24 AM IST

Biden Xi Meeting
Biden Xi Meeting

Biden Xi Meeting : అమెరికా-చైనా మధ్య సంబంధాలు మరింత దిగజారకుండా.. కలిసి పనిచేయాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. విభేదాలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగడానికి అంగీకరించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి.. చర్చల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని.. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌- చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఓ నిర్ణయానికి వచ్చారు. ఇరువురు నేతలు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బైడెన్‌ తన అభిప్రాయాలను, ఆందోళనలను జిన్‌పింగ్‌కు ఎలాంటి మొహమాటం నేరుగా చెప్పేశారని వైట్‌ హౌస్‌ వెల్లడించింది.

Biden Xi Meeting : అమెరికాతో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌తో.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ఆసియా -పసిఫిక్‌ ఆర్థిక సహకార సదస్సుకు హాజరైన జిన్‌పింగ్‌.. అనంతరం కాలిఫోర్నియాలో బైడెన్‌తో నాలుగు గంటలపాటు.. సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, తైవాన్‌ అంశాలతో పాటు.. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వివాదాలపై చర్చించారు. వాతావరణ మార్పులు, మాదక ద్రవ్యాల రవాణాను ఎదుర్కోవడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, దక్షిణ చైనా సముద్రంలో అలజడులపై కూడా బైడెన్‌-జిన్‌పింగ్‌ చర్చలు జరిపారు. ఈ సమావేశం తర్వాత అమెరికా-చైనా మధ్య సైనిక సంబంధాలు పునరుద్ధరణకు ఇరువురు నేతలు అంగీకారం తెలిపారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ.. శాంతిని స్థాపిస్తూ.. విజయం సాధించేందుకు పరస్పర సహకారం అందించుకుంటూ ముందుకు సాగుదామని బైడెన్‌కు.. జిన్‌పింగ్‌ సూచించారు. విభేదాలకు అతీతంగా ఎదగాలని.. రెండు ప్రధాన దేశాలు ఒకదానితో ఒకటి కలిసి అభివృద్ధికి సరైన మార్గాన్ని కనుగొనాలని జిన్‌పింగ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి బైడెన్‌ సానుకూలంగా స్పందించారు.

Biden Xi Meeting
జో బైడెన్, షీ జిన్​పింగ్​ కరచాలనం
  • #WATCH | US President Joe Biden says, "President Xi Jinping and I tasked our teams to maintain a policy and law enforcement coordination going forward to make sure it works...Secondly, and this is critically important, we're reassuming military-to-military contacts, direct… pic.twitter.com/hgjiv9nOrg

    — ANI (@ANI) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తైవాన్​పై మా వైఖరి అదే! : అమెరికా
బైడెన్‌-జిన్‌పింగ్‌ మధ్య తైవాన్‌ అంశంపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది. తైవాన్‌ను ఆక్రమించే దిశగా సాగుతున్నట్లు వచ్చిన వార్తలను జిన్‌పింగ్‌ ముందు బైడెన్‌ ప్రస్తావించారు. తైవాన్‌లో శాంతి, సుస్థిరతను కాపాడేందుకు అమెరికా కట్టుబడి ఉందని బైడెన్ మరోసారి స్పష్టం చేశారు. తైవాన్‌ విషయంలో అమెరికా యథాతథ స్థితిని అవలంబిస్తుందని బైడెన్‌ చెప్పారు. అమెరికా-చైనా సంబంధాలలో తైవాన్‌ అంశమే.. ప్రమాదకరమైనదని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. శాంతి మార్గం మంచిదేనని.. కానీ ఏదో ఒక సమయంలో సమస్య పరిష్కారం వైపు వెళ్లాల్సిందేనని.. స్పష్టం చేశారు.

Biden Xi Meeting
జో బైడెన్, షీ జిన్​పింగ్​

తైవాన్​పై​ మేము దండయాత్ర చేయడం లేదు : చైనా
అయితే తైవాన్‌ విషయంలో చైనా చివరకు పునరేకీకరణను సాధిస్తుందని బైడెన్‌కు.. జిన్‌పింగ్‌ స్పష్టం చేసినట్లుగా చైనా అధికారిక పత్రిక జిన్హువా వెల్లడించింది. జనవరిలో తైవాన్‌లో జరగబోయే ఎన్నికల ప్రక్రియను గౌరవించాలని.. జిన్‌పింగ్‌ను బైడెన్‌ కోరారు. తైవాన్ చుట్టూ సైన్యాన్ని మోహరిస్తున్నా ఎలాంటి దండయాత్రకు సిద్ధం కావడం లేదని.. డ్రాగన్‌ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధంపై కూడా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కృత్రిమ మేధస్సుపై కలిసి పనిచేయాలని.. అమెరికా-చైనా ఒప్పందం చేసుకున్నాయి.

Biden Xi Meeting
జో బైడెన్, షీ జిన్​పింగ్​

'ఈ మీటింగ్​ వల్ల ఒరిగేదేం లేదు!'
అయితే జిన్‌పింగ్‌-బైడెన్‌ సమావేశం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని కూడా అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2022 నవంబర్‌లో ఇరువురు నేతలు జీ20 సమ్మిట్ సందర్భంగా బాలిలో సమావేశమయ్యారని.. అప్పటి నుంచి ఇప్పటివరకు చైనా-అమెరికా సంబంధాలు దిగజారాయి కానీ బలపడలేదని గుర్తు చేస్తున్నారు. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా అభివృద్ధి జరగాలని.. అలా జరిగేలా చూడడం ఇరు దేశాధినేతల బాధ్యతని జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించినా అది అంత తేలిగ్గా జరిగేలా కనిపించడం లేదు.

'మా సొమ్మును చైనాకు దోచిపెడుతున్నారు'- పాకిస్థాన్​పై POK ప్రజలు ఫైర్

'ఇచ్చిన హామీలను మర్చిపోయారు, ప్రధాని పదవికి అనర్హుడు'- సునాక్​పై బ్రేవర్మన్​ ఘాటు విమర్శలు

Last Updated :Nov 16, 2023, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.