ETV Bharat / international

ఉక్రెయిన్​పై రష్యా బాంబుల వర్షం.. ప్రసూతి ఆసుపత్రి ధ్వంసం

author img

By

Published : Mar 10, 2022, 7:41 AM IST

Russia attack on Hospital
ఉక్రెయిన్​పై రష్యా బాంబుల వర్షం

Russia attack on Hospital: ఉక్రెయిన్​పై ఎడాపెడా రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఆసుపత్రులూ, శ్మశానాలనూ వదలటం లేదు. మేరియుపోల్​లోని ఓ ప్రసూతి ఆసుపత్రి దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద పిల్లలు సహా పలువురు రోగులు ఉన్నారని ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ ట్వీట్​ చేశారు. మరోవైపు.. ఉక్రెయిన్‌ జాతీయవాదులు పౌరుల తరలింపులను అడ్డుకుంటున్నారు పేర్కొన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​.

Russia attack on Hospital: కత్తిగట్టినట్లు ఉక్రెయిన్‌పై నిప్పులు కురిపిస్తున్న రష్యా సేనలు చివరకు ఆసుపత్రులనూ, శ్మశానాలనూ వదిలిపెట్టడంలేదు. మేరియుపొల్‌లో బుధవారం చోటు చేసుకున్న దాడిలో ఓ ప్రసూతి ఆసుపత్రి దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. పెద్దఎత్తున ప్రాణనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద పిల్లలు సహా పలువురు రోగులు ఉన్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలిదిమిర్‌ జెలెన్‌స్కీ ట్వీట్‌ చేశారు. ఈ దాడిని రష్యా చేసిన దురాగతంగా అభివర్ణించారు. విధ్వంస దృశ్యాలను ఆయన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. అడుగడుగునా శిథిలాలు, మెలితిరిగిన ఉక్కు కడ్డీలు, పగిలిపోయిన కిటికీలతో ఆ ప్రాంతం బీభత్సంగా మారింది. దాడులు కొత్త మలుపు తీసుకుంటున్నాయనే హెచ్చరిక జారీ చేసినట్లయింది. ఒకపక్క బాంబులు, క్షిపణుల మోత.. మరోపక్క సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు.. ఈ రెండు దృశ్యాలు ఉక్రెయిన్‌లో కనిపించాయి. కీవ్‌తో పాటు మేరియుపొల్‌, ఎనెర్హొదర్‌, వొల్నోవాఖా, లిజియుమ్‌, సుమీ ప్రాంతాల నుంచి ప్రజలు వెళ్లిపోయేందుకు వీలుగా రోజు మొత్తం దాడులకు విరామం ఇస్తున్నట్లు ప్రకటించిన కొద్దిసేపటికే ప్రసూతి ఆసుపత్రి ఇలా శిథిలాల గుట్టగా మారడం ప్రజల్ని కలచివేసింది.

Russia attack on Hospital
.

బతుకుజీవుడా అంటూ..

గుర్తించిన కొన్ని మార్గాలపై రోజు మొత్తంమీద దాడులకు దిగబోమని రష్యా ప్రకటించిన మేరకు ప్రజలను సమీప నగరాలకు తరలించేందుకు వరసగా రెండోరోజూ బస్సుల్ని ఏర్పాటు చేశారు. దినదినగండంగా బతుకు వెళ్లదీస్తున్న వేలమంది ప్రజలు వీటిలో తరలివెళ్లారు. కీవ్‌ నగరంతో పాటు చుట్టుపక్కల పట్టణాల నుంచి 18,000 మందిని తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జెలెన్‌స్కీ చెప్పారు. తమకు యుద్ధ విమానాలు పంపాలని మరోసారి ప్రపంచ దేశాలను అభ్యర్థించారు. ఉక్రెయిన్‌ను విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా రష్యా సైనికులకు రష్యన్‌ భాషలో విజ్ఞప్తి చేశారు. 'దాదాపు రెండు వారాలుగా మేం పోరాడుతున్న తీరు చూస్తే మేం లొంగిపోయేవాళ్లం కాదని అర్థమయ్యే ఉంటుంది. మీరు మీ ఇళ్లకు తిరిగివెళ్లిపోతే ప్రాణాలు రక్షించుకొనే అవకాశం ఇప్పటికీ ఉంది' అని చెప్పారు. దాడుల మోత ఆగిన సమయంలో మేరియుపొల్‌లో దాదాపు 70 మృతదేహాలకు ఖననం పూర్తి చేశారు. మంగళవారం శ్మశానాల్లోనూ గుళ్లమోత తప్పలేదు.

ఐరోపా కమిషన్‌ కఠిన ఆంక్షలు

రష్యాపై ఆంక్షలను కఠినతరం చేయనున్నట్లు ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్‌ లెయెన్‌ పేర్కొన్నారు. బెలారస్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థపైనా ఆంక్షలు విధించనున్నట్లు స్పష్టం చేశారు. మెరుగైన నైపుణ్యం కలిగిన సైనిక పరికరాలను ఉక్రెయిన్‌కు పంపించనున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వెల్లడించారు.

దాహార్తికి మంచు ముక్కలే గతి

రష్యాకు చెందిన క్షిపణులు ఏ క్షణమైనా విరుచుకుపడే అవకాశమున్న దృష్ట్యా కీవ్‌ ప్రజలు తక్షణం సురక్షిత ఆవాసాల్లోకి తరలి వెళ్లాలని బుధవారం ఉదయాన్నే సైరన్లు మోగడంతో (ఎయిర్‌ అలర్ట్‌తో) అందరూ ఉలిక్కిపడ్డారు. కాసేపటికి ఈ హెచ్చరికల్ని వెనక్కి తీసుకున్నారు. మేరియుపొల్‌ ఓడరేవు నగరాన్ని రష్యా బలగాలు చుట్టుముట్టాయి. పెద్దఎత్తున ప్రాణనష్టాన్ని ఎదుర్కొంటున్న ఆ నగరంలో మృతదేహాల సామూహిక ఖననానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా చేసిన దాడిలో 10 మంది పౌరులు మరణించారు. పలు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి అల్లాడిపోతూ అందుబాటులోని మంచుముక్కల్ని కరిగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రుల్లోని రోగులకూ ఆహారం, మందులు అందడం లేదు. క్షుద్బాధకు తట్టుకోలేనివారు సమీపంలోని దుకాణాలను దోచుకునేందుకైనా వెనుకాడడం లేదు.

ఉక్రెయిన్‌ జాతీయవాదులు పౌరుల తరలింపులను అడ్డుకుంటున్నారు: పుతిన్‌

ఉక్రెయిన్‌ నగరాల నుంచి పౌరులు తరలిపోకుండా అక్కడి జాతీయవాదులు అడ్డుకుంటున్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ బుధవారం ఆరోపించారు. ఈ మేరకు ఆయన జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల నుంచి ప్రజలు సురక్షితంగా తరలి వెళ్లేందుకు మానవతా కారిడార్లను ఏర్పాటు చేస్తున్నామని, పౌరులు సురక్షితంగా తరలి వెళ్లకుండా జాతీయవాద మిలిటెంట్లు అడ్డుకుంటున్నారని పుతిన్‌ వివరించినట్టు క్రెమ్లిన్‌ వర్గాలు తెలిపాయి. మరోవైపు రష్యా నిరంతర దాడుల కారణంగా యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి పౌరులను తరలించే ప్రక్రియకు విఘాతం కలిగిందని ఉక్రెయిన్‌ అధికారులు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య శాంతి చర్చల్లో కాస్త పురోగతి కనిపించిందని రష్యా పేర్కొంది. ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము ప్రయత్నించడం లేదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:ఉక్రెయిన్​పై ఆగని రష్యా దాడులు.. బైడెన్ ఫైర్

న్యూక్లియర్ ప్లాంట్​కు కరెంట్ కట్.. ఉక్రెయిన్​లో డేంజర్​ బెల్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.