ETV Bharat / international

ప్రపంచ దేశాల్లో కేసులు తీవ్రం- మూడోవేవ్ మొదలైనట్టేనా?

author img

By

Published : Jul 28, 2021, 3:15 PM IST

Corona cases
కరోనా మూడో దశ ముప్పు

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా ఆవిర్భావం తర్వాత ఎన్నడూ లేనన్ని కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇది మూడోవేవ్​ ప్రారంభానికి సంకేతమా అని అనుమానాలు కలుగుతున్నాయి? నిజంగానే థర్డ్​వేవ్ ప్రారంభమైందా? అత్యంత తీవ్రంగా ఉంటుందని భావిస్తున్న ఈ వేవ్​ను ప్రపంచ దేశాలు ఏ మేరకు తట్టుకోగలవు?

రెండో దశ కరోనా వ్యాప్తి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. ఈ సమయంలో అనేక పరిణామాలు మూడో దశ వ్యాప్తిని సూచిస్తున్నాయి. పలు దేశాల్లో కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. మళ్లీ లాక్​డౌన్​ను ఆశ్రయించే పరిస్థితులు వస్తున్నాయి. భారత్​లోనూ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. రెండో దశ అతి తక్కువ స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఒక్కసారి మాత్రమే కొత్త కేసులు 30 వేలలోపు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మూడో దశ కరోనా వ్యాప్తి అప్పుడే మొదలైందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతున్న అమెరికాలోనూ కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మంగళవారం కొత్త కేసుల సంఖ్య 61 వేలు దాటింది. ఆ దేశంలోని అర్హులైన లబ్ధిదారుల్లో సగం మంది టీకా రెండు డోసులు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందడం ఆందోళనకరంగా మారింది.

డెల్టా వేరియంట్ ప్రమాదకర వ్యాప్తి నేపథ్యంలో అమెరికా సీడీసీ సైతం తన మార్గదర్శకాలను సవరించింది. టీకా తీసుకున్నవారికి మాస్కులు అవసరం లేదని గతంలో సూచించిన సీడీసీ.. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న చోట ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని తాజాగా స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో శ్వేతసౌధంలోనూ మళ్లీ మాస్కులు దర్శనమిచ్చాయి.

ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్తగా 3,177 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ప్రారంభమైన తర్వాత ఒక్క రోజులో బయటపడ్డ అత్యధిక కేసులు ఇవే కావడం ఆందోళకరంగా మారింది. విశ్వక్రీడల నేపథ్యంలో జులై 12 నుంచి ఇక్కడ అత్యయిక స్థితి కొనసాగుతోంది.

కరోనా విజృంభణ ధాటికి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మరో నెల రోజుల పాటు లాక్​డౌన్ పొడిగించారు. ఆగస్టు 28 వరకు లాక్​డౌన్ కొనసాగుతుందని న్యూసౌత్​వేల్స్ ప్రభుత్వం ప్రకటించింది.

దక్షిణ కొరియాలోనూ రికార్డు స్థాయి రోజువారీ కేసులు నమోదయ్యాయి. బుధవారం 1,896 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే.

మరోవైపు, చైనాలోని జియాంగ్సు రాష్ట్రం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లకు కరోనా నెగెటివ్ ధ్రువపత్రాన్ని తప్పనిసరి చేసింది స్థానిక ప్రభుత్వం. 48 గంటల్లోపు రిపోర్టు ఉంటేనే వీరికి బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.

పెరుగుదలకు కారణం?

ప్రపంచ దేశాల్లో ఒక్కసారిగా కరోనా కేసులు మళ్లీ విజృంభించడానికి అనేక కారణాలు ఉన్నాయి.

  • కరోనా నియమాలను పాటించకపోవడం: మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలను గాలికి వదిలేయడం ప్రధాన కారణం.
  • వ్యాక్సినేషన్ మందగమనం: టీకా తీసుకోని వారిలోనే కరోనా అధికంగా వ్యాపిస్తోంది. వ్యాక్సినేషన్ ఆశించిన వేగంతో జరగకపోవడం వల్ల.. అనేక మంది వైరస్​కు బలవుతున్నారు. చాలా దేశాలకు కరోనా టీకాలు అందుబాటులో ఉండటం లేదు.
  • డెల్టా వేరియంట్ వ్యాప్తి: అనేక దేశాల్లో నమోదవుతున్న కొత్త కేసుల్లో అత్యధికం డెల్టా రకానివే ఉంటున్నాయి. భారత్, అమెరికాలో 80 శాతానికి పైగా కేసులు ఈ వేరియంట్​కు సంబంధించినవే.

కరోనాతో ప్రాణనష్టం తప్పినా...

దీర్ఘకాల కరోనా అనేది తీవ్రమైన సమస్యగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్​తో ఏర్పడే మరణాలను తగ్గించినా.. సుదీర్ఘకాలం పాటు కొవిడ్​ కొనసాగటం వల్ల అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని పేర్కొన్నారు. అలసట, కండరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం సహా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.

యూకేలో 20 లక్షల మంది దీర్ఘకాలం కొవిడ్​తో బాధపడ్డారు. 3,85,000 మంది వరకు ఏడాది, అంతకన్నా ఎక్కువ కాలం లక్షణాలు కనిపించాయి. దీర్ఘకాల కొవిడ్​ను తక్కువ అంచనా వేయటానికి లేదు. ఉదారహణకు ఓ వృద్ధుడు కొవిడ్​ బారిన పడి మరణించాడు. వైరస్​ సోకకుంటే మరో ఐదేళ్లు జీవించే వాడు. వైరస్​ వల్ల నాణ్యమైన ఐదేళ్ల జీవితాన్ని కోల్పోయాడని ఓ ఆరోగ్య ఆర్థికవేత్త పేర్కొన్నారు. మరోవైపు.. ఓ యువకుడు కరోనా బారినపడి చనిపోకుండా.. 10 ఏళ్లపాటు కొవిడ్​తో బాధపడితే.. అతని సురక్షితమైన జీవితం సగానికి తగ్గిపోయినట్లేనని తెలిపారు. కొవిడ్​తో మరణాలు తగ్గిపోయాయని ఆంక్షలు సడలిస్తే.. దీర్ఘకాల కొవిడ్​తో అంతే స్థాయిలో సామాజిక నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: 'మూడో దశ ఎప్పుడని చెప్పలేం.. సిద్ధంగా ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.