ETV Bharat / international

అమెరికా ఎన్నికల్లో చైనాపై ఎందుకింత రగడ?

author img

By

Published : Sep 3, 2020, 3:44 PM IST

#BattlegroundUSA2020- US Attacks On China: Campaign Or Consistent Agenda?
ఎన్నికల్లో చైనాపై అమెరికా విమర్శలు.. అజెండా? ప్రచారమా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ట్రంప్​ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుంటే.. ప్రత్యర్థి బైడెన్​ తొలిసారి పీఠమెక్కాలని పట్టుదలతో ఉన్నారు. అయితే వీరిద్దరి ప్రచారాల్లో చైనాపై విమర్శలు కీలకంగా మారాయి. డ్రాగన్​ దేశంపై ఒక్కొక్కరు ఒక్కో తీరుతో ముందుకెళ్తున్నారు. అయితే ఇవన్నీ ప్రచార వ్యూహంలో భాగమేనా? ప్రభుత్వ విధానాలుగా మారతాయా? అనే అంశంపై విశ్లేషకుల అభిప్రాయాలు తెలుసుకుందాం రండి..

'అమెరికా ఎన్నికల్లో చైనా కార్డ్​'పై ప్రత్యేక చర్చ

అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో రెండు నెలల్లోనే జరగనున్నాయి. ఇందుకోసం రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్​, డెమొక్రాట్ల తరఫున జో బైడెన్​ హోరాహోరీగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ రాజకీయ ప్రసంగాల్లో చైనాను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. విస్తరణవాద కాంక్షతో రగిలిపోతున్న చైనాను నిజంగానే వీరిద్దరూ అడ్డుకుంటారా..? లేదంటే ఓట్ల కోసమే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

"జో బైడెన్ ఎన్నికైతే చైనా మన దేశాన్ని సొంతం చేసుకుంటుంది. బైడెన్​లా కాకుండా.. నేనైతే ప్రపంచవ్యాప్తంగా వారు కలిగించిన విషాదానికి పూర్తి జవాబుదారీగా ఉండేలా చూస్తాను" అని ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్​ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్​లో నిర్వహించిన తన అధికారిక నామినేషన్ ప్రసంగంలో అన్నారు.

"మన కంపెనీలు తరలిపోకుండా, ఉద్యోగాలు మన దేశంలోనే ఉండేలా చూస్తాను. మీరు గమనించినట్లయితే నేను ఇప్పటికే కొంతకాలంగా ఆ పని చేస్తున్నాను. జో బైడెన్​ అజెండా 'మేడ్​ ఇన్ చైనా'... నా అజెండా 'మేడ్​ ఇన్​ ద యూఎస్'"​ అని ట్రంప్ తన అధ్యక్ష ప్రత్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్​పై విమర్శలు చేశారు.

బైడెన్​ మెతక వైఖరి!

1979లో అమెరికా, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగయ్యాక తొలిసారి అగ్రరాజ్యం నుంచి అధికార బృందం ఆ దేశంలో అడుగుపెట్టింది. అందులో యువ సెనేటర్​గా బైడెన్​ కూడా ఉన్నారు. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బైడెన్​.. చైనా అభివృద్ధి గురించి అప్పట్లో సానుకూలంగా మాట్లాడారు. అయితే ఇటీవలె నామినేషన్​ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. చైనా, రష్యా విదేశీ విధానాలను ప్రస్తావించలేదు బైడెన్​. దీనిపైనా రిపబ్లికన్లు విమర్శలు గుప్పించారు. అయితే డెమొక్రటిక్​ పార్టీ ప్రాథమిక డిబేట్​లో మాత్రం జిన్​పింగ్​ను ఒక దుండగుడిగా అభివర్ణించారు జో బైడెన్​.

అధ్యక్ష పదవి రేసులో ఉన్న బైడెన్​, ట్రంప్​ మధ్య ప్రస్తుతం హోరాహోరీగా పోరు సాగుతోంది. ఈ సమయంలో చైనాతో ముడిపడిన సమస్యలు ఎన్నికల్లో కీలకపాత్ర పోషించనున్నాయా..? ఆయా పార్టీల విధానరూపకర్తలు దీనిపైనే దృష్టిసారించనున్నారా..? నవంబర్​లో ఫలితాలు వచ్చాక చైనాతో పరిస్థితులు ఘర్షణాత్మకంగానే ఉంటాయా? భవిష్యత్​ చైనా-అమెరికన్​ సంబంధాలు భారత్​ను ఎలా ప్రభావితం చేస్తాయి? అనేవి కీలకంగా మారాయి. ఈ అంశాలపై పలువురు నిపుణులతో చర్చించారు సీనియర్​ జర్నలిస్ట్​ స్మితా శర్మ.

ప్రత్యర్థులు కరోనాను నియంత్రించడంలో విఫలమయ్యారని ట్రంప్​పై విమర్శలు గుప్పిస్తుంటే.. ఆయన బీజింగ్​పై వ్యతిరేకత అంశాన్ని తెరపైకి తెస్తున్నారా? అనే దానిపై చర్చలో ప్రశ్నించారు. వాటిపై స్పందించారు బ్రూకింగ్​ సంస్థలో సీనియర్​ అధికారి తన్వీ మదన్​.

" అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా తెరపైకి రావడం అసాధారణం కాదు. ఆర్థిక, వ్యూహాత్మక అంశాల్లో సొంత తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చైనాను నిందించడం ఎప్పటినుంచో ఉన్నదే. కరోనాను నియంత్రించడంలో విఫలమయ్యారని ట్రంప్​ను విమర్శకులు ప్రశ్నిస్తున్న వేళ.. ఆయన చైనాపై వ్యతిరేకతను నెమ్మదిగా తెరపైకి తెచ్చారు. డెమొక్రాట్లు చైనా గురించి వేరే విధంగా మాట్లాడుతున్నారు. బైడెన్ తన (డెమొక్రాట్స్ నేషనల్ కన్వెన్షన్) ప్రసంగంలో చైనా గురించి ప్రస్తావించకపోవచ్చు. కానీ ఇతర వేదికలపై ప్రసంగాలు, ప్రకటనలను పరిశీలిస్తే వారు కూడా చైనాపై కఠినంగా ఉంటామని చెబుతున్నారు. అయితే చైనా సమస్యను చూసి ప్రజలు ఓటు వేస్తారో లేదో తెలియాలి. అమెరికన్లు ప్రపంచ వేదికపై విస్తృత విదేశాంగ విధాన అంశాల ఆధారంగా ఓటు వేయవచ్చు. మొత్తం మీద ఈ ఎన్నికలు నిజంగా అధ్యక్షుడు ట్రంప్ గురించి ఎలా భావిస్తున్నారనేది తేల్చనున్నాయి."

-- తన్వీ మదన్​, బ్రూకింగ్​ సంస్థలో సీనియర్​ అధికారి

'ఫేట్​ఫుల్ ట్రయాంగిల్: హౌ చైనా షేప్డ్ యుఎస్-ఇండియా రిలేషన్స్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్' పుస్తకాన్ని రచించారు తన్వీ.

రాజకీయంగా కీలకమైన యూఎస్ కాంగ్రెస్‌లో చైనాపై వ్యతిరేక భావన ఉందా? డ్రాగన్​ దేశంపై ట్రంప్ వైఖరి స్థిరంగానే ఉందా? అనేదానిపై స్పందించారు మాజీ రాయబారి విష్ణు ప్రకాశ్​.

"భౌగోళిక రాజకీయాలు, అమెరికా ఆధిపత్యం గురించి ఏ అమెరికా నాయకుడు రాజీ పడటానికి ఇష్టపడరు. ఎందుకంటే అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయడంలో చైనా దూకుడును వారంతా తెలుసుకున్నారు. ట్రంప్​కు చైనాపై స్థిరమైన అభిప్రాయం ఉంది. 2018లో హడ్సన్ ఇనిస్టిట్యూట్‌లో మైక్ పెన్స్ చైనా తీరుపై విమర్శలు గుప్పించారు. వ్యవస్థల దుర్వినియోగం, గూఢచర్యం, సైనిక శక్తిని పెంచడం, అమెరికాను లక్ష్యంగా చేసుకోవడంపై చైనాను ఆయన ఘాటు పదజాలంతో తీవ్రంగా విమర్శించారు. ఇది కొవిడ్​కు ముందే కాబట్టి చైనాపై ట్రంప్​ తీరు తన విధానమే తప్ప.. ఎన్నికల కోసం కాదని తెలుస్తోంది. ఎప్పట్నుంచో అమెరికాపై సైనికంగా, సాంకేతికంగా ఆధిపత్యం చెలాయించాలని చూస్తోన్న జిన్​పింగ్​ ప్రభుత్వంపై.. ట్రంప్​ సర్కార్​ అంతే స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తోంది".

-- విష్ణు ప్రకాశ్​, భారత మాజీ రాయబారి

"నేను అమెరికా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. అమెరికా చరిత్రలో చైనాపై మేము ఇప్పటివరకు కఠినమైన, సాహసోపేతమైన, బలమైన, కష్టతరమైన చర్యలు తీసుకున్నాం" అని ట్రంప్ తన ఆర్‌ఎన్‌సీ ప్రసంగంలో ప్రస్తావించారు.

ఇండో-పసిఫిక్ వ్యూహం నుంచి మిత్రపక్షాలు, భాగస్వాములతో రక్షణ ఒప్పందాలు, ఇతర కార్యక్రమాల విషయంలో.. చైనాను ఎదుర్కొనేందుకు అమెరికా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటుందా? లేదంటే ఎన్నికలు అయిపోగానే నవంబర్ తరువాత ఆ దేశంతో సాధారణంగానే వాణిజ్యం చేస్తుందా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే. అదే జరిగితే అమెరికా ఎన్నికల్లో చైనా అనేది ఒక ఎలక్షన్​ కార్డు అనేది నిజమైనట్లే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.